Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వామినాథన్ కమిషన్ ఉండగా, మరో కమిటీ ఎందుకు...?
- 700 మంది రైతుల మరణాలకు కేంద్రమే బాధ్యత వహించాలి
- చారిత్రాత్మక రైతు ఉద్యమం ఘన విజయం
- నేడు సింఘూలో ఎస్కేఎం సమావేశం : ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయూ నేతలు
న్యూఢిల్లీ : ''కనీస మద్దతు ధర చట్టం చేసేవరకు రైతులు విశ్రమించరు. ఎంఎస్పీ కోసం కొత్తగా కమిటీ అవసరం లేదు. స్వామినాథ్ కమిషన్ ఉంది'' అని రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు. శుక్రవారం నాడిక్కడ ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐకేఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్ దావలే, హన్నన్ మోల్లా, సహాయ కార్యదర్శులువిజూ కృష్ణన్, ఎన్కె శుక్లా, కోశాధికారి కృష్ణ ప్రసాద్, ఏఐకేఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సహాయ కార్యదర్శి విక్రమ్ సింగ్ మీడియాతో మాట్లాడారు.
ఏడాది పాటు సుదీర్ఘంగా జరిగిన చారిత్రాత్మక ఉద్యమం ఘన విజయం సాధించిందని అన్నారు. దేశంలో 90 కోట్ల మంది రైతులు మహౌన్నతమైన పోరాటం చేశారనినీ ఈ నెల 26 నాటికి ఉద్యమం ఏడాది పూర్తి చేసుకుంటుందని తెలిపారు. ప్రపంచంలోనే సుదీర్ఘ ప్రజాస్వామ్య పోరాటం ఇదేనని, నాలుగు ప్రధాన డిమాండ్లతో ఈ ఉద్యమం ప్రారంభమైందని అన్నారు. మూడు నల్ల చట్టాలు (వ్యవసాయ) తొలగించాలి, ఒక తెల్ల చట్టం (ఎంఎస్పీ) ఆమోదించాలని, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలని, రైతులపై జరిమానా, జైళు శిక్ష విధించే పర్యవరణ కమిషన్ చట్టం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
అన్ని రకాలుగా రైతు ఉద్యమంపై దాడులు చేశారని, రైతు ఉద్యమంపై దుష్ప్రాచారం చేశారని విమర్శించారు. రైతులపై దాడి చేసి, హత్య చేశారని గుర్తు చేశారు. రైతు ఉద్యమంపై నిందలు వేసేందుకు జనవరి 26న ఎర్ర కోటపై దాడి చేశారని, నరేంద్ర మోడీ, అమిత్ షాతో సంబంధాలు ఉన్న వ్యక్తి అక్కడ జాతీయ జెండా అవమానించాడని తెలిపారు. రైతు ఉద్యమంతో సంబంధం లేని ఒక నిహాంగ్ సింఘూ సరిహద్దు వద్ద హత్యకు గురైతే, దానిపై రైతులను నిందించారని తెలిపారు. వాస్తవంగా ఎవరైతే హత్య చేశారో ఆ నిహాంగ్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని బీజేపీ ఎంపీతో కలిసి రహస్యంగా కలిశారని గుర్తు చేశారు. ఉద్యమాన్ని నిందించాలని, విభజించాలని తీవ్రంగా ప్రయత్నించారని అన్నారు. ఆ తరువాత రైతులపై భౌతిక దాడి చేశారని, హర్యానాలో ఒక రైతు, అసోంలో ఇద్దరు, ఉత్తరప్రదేశ్లో నలుగురు రైతులను హత్య చేశారని తెలిపారు. కానీ రైతులు తాము 90 కోట్లు ఉన్నామని, ఎంత మందిని చంపుతారని ప్రశ్నించారని అన్నారు. ఎలాంటి అవరోధం కూడా రైతు ఉద్యమాన్ని ఆపలేదని స్పష్టం చేశారు. రైతుల మనోభావాలను అర్థం చేసుకోవడంలో ప్రధాని మోడీ విఫలం అయ్యారని, ఆయన అమెరికా అధ్యక్షులు ట్రంప్, బైడెన్లను మాత్రం అర్థం చేసుకుంటారని అన్నారు. రైతు ఉద్యమంలో 700 మంది రైతులు మరణించారని, అయితే ఏడు వేల మంది మరణించినా తమ డిమాండ్లు నెరవేరే వరకు వెనుదిరగమని స్పష్టం చేశారు. రైతుల త్యాగాలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. అమరవీర రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ ఇదే నిర్ణయం ఏడాది క్రితం తీసుకుంటే, ఏడు వందల మంది రైతుల ప్రాణాలను కాపాడేవారని అన్నారు.
దేశంలోని రైతు ఉద్యమ విజయం ప్రజా ఉద్యమాన్ని ప్రోత్సహిస్తుందని అన్నారు. ప్రజా ఉద్యమం ప్రజలను ఏకం చేసిందని, శాంతియుతంగా ఉద్యమం జరిగిందని తెలిపారు. 500 రైతు సంఘాలు ఐక్య ఉద్యమించాయని, ఆ ఐక్య ఉద్యమమే కేంద్ర మెడలు వంచిందని తెలిపారు. మూడు నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారని, దాన్ని తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. మూడు చట్టాలు భవిష్యత్తు సమస్య అయితే, ఎంఎస్పి ప్రస్తుత సమస్య అని అన్నారు.
భవిష్యత్తు ప్రమాధాన్ని వెనక్కి తీసుకున్నారని, ప్రస్తుతం కావాల్సిన ఎంఎస్పీ చట్టంపై ఎటువంటి నిర్ణయం తెలపలేదని స్పష్టం చేశారు. కనీస మద్దతు ధర లేక దేశంలోని ప్రతి రోజు 52 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇప్పటి వరకు 4 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. స్వామినాథన్ కమిషన్ ప్రకారం సి2ం50శాతం ఎంఎస్పి ఇవ్వాలని, పంట సేకరణకు హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 20 ఏళ్లుగా ఈ కమిటీ రిపోర్టు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఎంఎస్పి చట్టం కాకపోతే రైతులు మనుగడ సాగించలేరని పేర్కొన్నారు. తమ డిమాండ్లలో 50 శాతం నెరవేరాయని, వంద శాతం నెరవేరేవరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. నేడు (శనివారం) సింఘూ సరిహద్దు వద్ద ఎస్కేఎం సమావేశమవుతుందని, అక్కడ భవిష్యత్ పోరాటాన్ని నిర్ణయిస్తామని తెలిపారు. రైతు ఉద్యమానికి మద్దతు తెలిపిన కార్మిక, ఉద్యోగ, వ్యవసాయ కార్మిక, విద్యార్థి, మహిళ, యువత, దళిత, గిరిజన వర్గాలకు ధన్యవాదాలు తెలిపారు.