Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెత్తబడ్డ ప్రధాని : న్యూయార్క్ టైమ్స్
న్యూఢిల్లీ : వివాదాస్పద మూడు సాగు చట్టాలను రద్దుపై మోడీ చేసిన ప్రకటనను ప్రముఖ వార్త సంస్థ 'న్యూయార్క్ టైమ్స్' తన వెబ్సైట్లో పొందుపర్చింది. దాదాపు ఏడాది పాటు కొనసాగిన రైతుల ఉద్యమం ముందు మోడీ చివరకు తన వైఖరిని మార్చుకోవాల్సి వచ్చింది. మెతక వైఖరిని అవలంబించాలని నిర్ణయించుకున్న ప్రభుత్వం ఈ చట్టాలను ఉపసంహరించుకున్నది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రైతులు స్వాగతించారు.
రాజకీయ నిస్సహాయత : సీఎన్ఎన్
మోడీ ప్రసంగాన్ని ప్రముఖ వార్త సంస్థ సీఎన్ఎన్ పబ్లిష్ చేసింది. ఒక ముఖ్యమైన రోజున ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఇది రైతుల పెద్ద విజయమని రైతు నాయకులు దీప్కా లంబా అన్నారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని మేము భావిస్తున్నామని తెలిపారు. 'భారత్ ఒక వ్యవసాయ దేశం. ఏ ప్రభుత్వమూ రైతుల ఆగ్రహానికి గురికావడానికి రిస్క్ తీసుకోదు' అని సీఎన్ఎన్ తన వెబ్సైట్లో రాసుకొచ్చింది.
రైతుల మాట వినలేదు : ది గార్డియన్
సాగు చట్టాల విషయంలో రైతుల మాటను మోడీ ప్రభుత్వం వినలేదని బ్రిటీషు వార్త పత్రిక 'ది గార్డియన్' పేర్కొన్నది. గతేడాది ఈ వ్యవసాయ చట్టాలను ప్రవేశపెట్టినప్పుడు, వ్యవసాయం మొత్తం నిర్మాణాన్ని మార్చాలని ప్రభుత్వం భావించింది. దేశంలో 60 శాతం మంది వ్యవసాయ రంగం పైనే ఆధారపడి ఉన్నారు. మోడీ సర్కారు తీసుకొచ్చిన చట్టాలు రైతులకు సంతృప్తికరంగా లేవు. రైతుల కోసమే చట్టాలు తెస్తే వారితో ఎందుకు చర్చించలేదన్నది రైతుల వాదన. ఈ చట్టాలతో వారి జీవనోపాధికి, ప్రాణాలకు ముప్పు వాటిల్లింది.
రాజకీయ కారణాలు : ది గ్లోబ్ అండ్ మెయిల్
సాగు చట్టాల రద్దుపై మోడీ చేసిన ప్రకటన నుంచి అనేక అర్థాలు గ్రహించొచ్చని కెనడా వార్త పత్రిక 'ది గ్లోబ్ అండ్ మెయిల్' పేర్కొన్నది. దీనికి రాజకీయ కారణాలూ ముఖ్యమే. గతేడాది సెప్టెంబర్లో సాగు చట్టాలు ఆమోదం పొందినప్పటి నుంచి వీటిపై రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రభుత్వానికి ఇబ్బందులు ఎక్కువయ్యాయి. 'ది స్టార్.కామ్' కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
వెనక్కి తగ్గిన సర్కారు : పాకిస్థాన్ వార్త పత్రిక 'డాన్'
వివాదాస్పద సాగు చట్టాల విషయంలో మోడీ సర్కారు వెనక్కి తగ్గిందని పాకిస్థాన్లోని ప్రముఖ వార్త పత్రిక, వెబ్సైట్ 'డాన్.కామ్' పేర్కొన్నది. సాగు చట్టాల రద్దుకు సంబంధించిన వార్తలను ఇది తన వెబ్సైట్లో ప్రసారం చేసింది.