Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశ ప్రజలకు క్షమాపణ
- పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యాంగ ప్రక్రియ పూర్తి చేస్తాం
- ఎంఎస్పీ కోసం కమిటీ : ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : మూడు రైతు చట్టాలు రద్దు చేయాలని నిర్ణయించామనీ, ఈ నెల చివర్లో ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యాంగ ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రధాని మోడీ వెల్లడించారు. ఎంఎస్పీని మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ కమిటీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ ఆర్థికవేత్తల ప్రతినిధులు ఉంటారని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. గురునానక్ జయంతి సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఒకటిన్నర సంవత్సరాల విరామం తరువాత కర్తార్ పూర్ సాబిV్‌ా కారిడార్ ఇప్పుడు తిరిగి తెరిచారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ''నా ఐదు దశాబ్దాల ప్రజా జీవితంలో రైతుల సవాళ్లను నేను చాలా నిశితంగా చూశాను. అందుకే 2014లో దేశానికి ప్రధానిగా సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమం కోసం అధిక ప్రాధాన్యత ఇచ్చా''అని అన్నారు. రైతుల పరిస్థితులను మెరుగు పరచడం కోసం విత్తనాలు, బీమా, మార్కెట్, పొదుపులకు సంబంధించిన నాలుగు అంచెల దశల చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. మంచి నాణ్యమైన విత్తనాలతో పాటు, ప్రభుత్వం రైతులను వేప పూత యూరియా, భూసారా కార్డు, సూక్ష్మ నీటిపారుదల వంటి సౌకర్యాలతో అనుసంధానించిందని ఆయన చెప్పారు.రైతులు కష్టపడి పనిచేసినందుకు ప్రతిఫలంగా వారు తమ ఉత్పత్తులకు సరైన ధరను పొందడానికి అనేక కార్యక్రమాలు చేపట్టామని ప్రధాని మోడీ తెలిపారు. గ్రామీణ మార్కెట్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేశామని, ఎంఎస్పీని పెంచడమే కాకుండా, రికార్డు సంఖ్యలో ప్రభుత్వ సేకరణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రభుత్వం అనుసరించిన ఉత్పత్తుల సేకరణ విధానం గత అనేక దశాబ్దాల రికార్డులను బద్దలు కొట్టిందని అన్నారు. రైతుల పరిస్థితిని మెరుగుపరచడానికి చేసిన ఈ గొప్ప ప్రచారంలో భాగంగా దేశంలో మూడు వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చామని ప్రధాని మోడీ తెలిపారు. దేశ రైతులు, ముఖ్యంగా చిన్న రైతులను బలోపేతం చేయాలనీ, వారి ఉత్పత్తులకు సరైన ధర, ఉత్పత్తులను విక్రయించడానికి గరిష్ట ఎంపికలను కల్పించాలని రైతులు, వ్యవసాయ నిపుణులు, దేశంలోని రైతుల సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారని ప్రధాని గుర్తు చేశారు.ఇంతకు ముందు కూడా అనేక ప్రభుత్వాలు దీనిపై మేధోమథనం చేశాయనీ, ఈసారి పార్లమెంటులో కూడా చర్చ తరువాత ఈ చట్టాలు వచ్చాయని తెలిపారు. దేశంలోని అనేక రైతు సంఘాలు వీటిని స్వాగతించి మద్దతు తెలిపాయనీ చెప్పారు.
ఈ చర్యకు మద్దతు ఇచ్చిన సంఘాలు, రైతులు, వ్యక్తులకు కృతజ్ఞతలని అన్నారు.రైతుల సంక్షేమం, ముఖ్యంగా చిన్న రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగం ప్రయోజనాల, గ్రామీణ పేదల ఉజ్వల భవిష్యత్తు, పూర్తి సమగ్రత, స్పష్టమైన మనస్సాక్షి , రైతుల పట్ల అంకితభావంతో ప్రభుత్వం ఈ చట్టాలను తీసుకువచ్చిందని ప్రధాని చెప్పారు. పవిత్రమైన, పూర్తిగా స్వచ్ఛమైన రైతుల ప్రయోజనాలకు సంబంధించిన ఈ చట్టాలపై కొందరిలో నెలకొన్న సందేహాల నివృత్తికి ప్రయత్నాలు చేసినప్పటికీ, కొంతమంది రైతులకు వివరించ లేకపోయామని అన్నారు. వ్యవసాయ ఆర్థిక వేత్తలు, శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు కూడా వ్యవసాయ చట్టాల ప్రాముఖ్యతను వారికి చెప్పేందుకు శాయశక్తులా ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని అన్నారు. అందుకే మూడు వ్య వసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించామని ప్రధాని మోడీ ప్రకటించారు. ఈ నెల చివర్లో ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో ఈ మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసే రాజ్యాంగ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు.ఈ రోజు ఎవరినీ నిందించే రోజు కాదనీ, రైతుల సంక్షేమం కోసం పనిచేయడానికి తనను తాను తిరిగి అంకితం చేసుకుంటున్నట్టు తెలిపారు.దేశప్రజలకు క్షమాపణ తెలియజేశారు. వ్యవసాయ రంగానికి ఒక ముఖ్యమైన చొరవను ఆయన ప్రకటించారు. జీరో బడ్జెటింగ్ ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, మారుతున్న దేశ అవసరాలకు అనుగుణంగా పంట సరళిని మార్చడానికి, ఎంఎస్పీని మరింత సమర్థవంతంగా , పారదర్శకంగా చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. ఈ కమిటీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ ఆర్థికవేత్తల ప్రతినిధులు ఉంటారని తెలిపారు.