Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గతంలోనే మోడీ లేఖ రాశారు
- జాప్యం కోసమే కమిటీ ఎత్తులు
- రైతులపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
- రైతుల విజయానికి సెల్యూట్ : ఏచూరి
న్యూఢిల్లీ : కనీస మద్దతు చట్టం కోసం 11 ఏండ్ల కిందట గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోడీ అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్కు లేఖ రాశారనీ, అందుకోసం కొత్తగా కమిటీలు అవసరం లేదనీ, జాప్యం కోసమే కమిటీల ఎత్తులు చేస్తున్నారని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. సుదీర్ఘంగా జరిగిన రైతు ఉద్యమం విజయం సాధించినందుకు సీపీఐ(ఎం) అభివాదం (సెల్యూట్) చేస్తుందని అన్నారు. శుక్రవారం నాడిక్కడ సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీతారాం ఏచూరి మాట్లాడారు. మొండి వైఖరితో ఉన్న మోడీ, కేంద్ర ప్రభుత్వం రైతు ఉద్యమానికి దిగొచ్చి మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించిందన్నారు. ''అయితే రైతుల ప్రయోజనాల కోసమే చట్టాలు తీసుకొచ్చామని ప్రధాని మోడీ సమర్థించుకున్నారు. కొన్ని వర్గాలు రైతులను తప్పుదోవపట్టించాయి. కానీ రైతులను ఒప్పించలేకపోయాం. కనుక చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని మోడీ అన్నారు'' అని ఏచూరి తెలిపారు. ''అలాగే రైతు ఉద్యమం ముఖ్యమైన డిమాండ్ రైతులందరికీ అన్ని పంటలకు ఎంఎస్పీ చట్టం చేయాలనేది. ఈ అంశం పరిశీలన కోసం ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు. అయితే కనీస మద్దతు ధరకు చట్టం చేయాలని 11 ఏండ్ల కిందట మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ప్రధాన మంత్రికి లేఖ రాశారు. కనుక ఎంఎస్పీ కోసం కొత్తగా కమిటీ అవసరం లేదు. కమిటీ పేరుతో జాప్యం చేయడమే'' అని అన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడే ఎంఎస్పీ చట్టం చేయాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసిందని, దానికి కట్టుబడి ఉందని తెలిపారు. విద్యుత్ సవరణ బిల్లు రైతులకు సంబంధించిందనీ, కనుక ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇది కూడా రైతు ఉద్యమంలో మరో ముఖ్యమైన డిమాండేనని గుర్తు చేశారు. ఈ రెండు డిమాండ్లను ప్రధాని మోడీ ప్రస్తావించలేదని విమర్శించారు. రైతులను ఖలీస్థానీ, టెర్రరిస్టు, నక్సలైట్స్ అంటూ బీజేపీ ముఖ్యమంత్రులు, నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారనీ, ప్రధాన మంత్రి కూడా ఆందోళనజీవి అంటూ అవమానకర వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు హర్యానా, ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రులే రైతు ఉద్యమానికి ప్రతిపక్షాలు బాధ్యులని పేర్కొన్నాయని తెలిపారు. రైతులపై దాడులు చేశారనీ, లఖింపూర్ ఖేరీలో రైతులను హత్య చేశారని ప్రస్తావించారు. రైతులపై అనుచిత, అవమానకార వ్యాఖ్యలు చేసిన వారిపైన, రైతులపై దాడులు చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని తమ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. కేంద్ర హౌం సహాయ మంత్రి అజరు మిశ్రాను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రైతు ఉద్యమంలో దాదాపు 750 మంది రైతులు అమరవీరులయ్యారనీ, వారికి సంతాపం తెలుపుతూ ప్రధాని మోడీ కనీసం ఒక్కమాట కూడా మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరవీరులకు వారికి న్యాయం కావాలనీ, పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్కేఎం భవిష్యత్తు ఆందోళనలకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని అన్నారు. ఈ విజయం రైతులది మాత్రమే కాదని, దేశ ప్రజలందరిదని పేర్కొన్నారు. ఇది లేబర్ కోడ్స్, ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న కార్మికోద్యమ విజయమని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించినట్టు ప్రభుత్వం చేసిన ప్రకటనలు అర్థరహితమని అన్నారు. దేశ ప్రజల నుంచి కేంద్రం సెస్, సర్చార్జి ద్వారా రూ.3.60 లక్షల కోట్లు వసూళ్లు చేస్తుందని, వాటిని తగ్గించలేదని తెలిపారు. పెట్రోల్ ఉత్పత్తుల ధరలు పెరగడానికి కారణం సెస్, సర్చార్జి అని పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించిందని తెలిపారు. ఈ చట్టాల రద్దు అందుకోసమే కావచ్చనీ, అయితే గత ఏడాదిగా ఏం జరిగిందో ప్రజలు మరిచి పోరని తెలిపారు.