Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏకపక్షంగా ముందుకెళ్లి.. దెబ్బతిన్న మోడీ సర్కార్
- నిరసనలకు దిగిరాక తప్పలేదు..
- సాగు చట్టాలపై అన్నివర్గాల్లోనూ వ్యతిరేకత
న్యూఢిల్లీ : అధికారంలోకి వచ్చింది(2014లో) మొదలు మోడీ సర్కార్ ఒంటెత్తు పోకడలు పోతోంది. స్వపక్షం..ప్రతిపక్షం నుంచి అనేక అభ్యంతరాలు(నోట్లరద్దు, జీఎస్టీ, సాగు చట్టాలు) వచ్చినా..పట్టించుకోవాల్సిన పనిలేదనే ధోరణితో ప్రధాని మోడీ, ఆయన పాలనాతీరు నడుస్తోంది. పార్లమెంట్లో ఎంపీల బలముంది కదా..అని ఏకపక్షంగా బిల్లుల్ని ఆమోదింపజేస్తోంది. వ్యవసాయ బిల్లులు(సాగు చట్టాలు) ఆమోదం పొందిన సమయంలో అధికార బీజేపీ తీరు చర్చనీయాంశమైంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా వందకోట్లకుపైగా ప్రజలపై ప్రభావం చూపే అంశం(సాగు చట్టాలు)లో కేంద్రం వ్యవహరించిన తీరు వివాదస్పదమైంది. దాంతో దేశ రైతాంగం ఉద్యమబాట పట్టక తప్పలేదు.
ఆ మూడే కాదు..విద్యుత్ బిల్లును కూడా
సాగు చట్టాలు : 1.నిత్యావసర సరుకుల (సవరణ) బిల్లు (ది ఎసెన్షియల్ కమోడిటీస్, 2020) 2. ది ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ బిల్లు 3. ది ఫార్మర్స్(ఎంపర్మెంట్ అండ్ ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ బిల్లు-2020. ఈ మూడింటితోపాటు విద్యుత్ సవరణ బిల్లును కూడా ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు ఉద్యమం ప్రారంభించాయి. ఈ ఉద్యమానికి వామపక్షాలు, కాంగ్రెస్, మరికొన్ని పార్టీలు మద్దతు పలికాయి. సాగు చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లును గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి.
రైతుల హక్కులను కాలరాసేందుకు ఈ బిల్లులను తీసుకొచ్చారని మేధావులు, సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ మోడీ సర్కార్ బిల్లులపై ఏకపక్షంగా పార్లమెంట్లో ఆమోదముద్ర వేయించుకుంది. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్రతో చట్టరూపం దాల్చింది. పంజాబ్, హర్యానా, యూపీ రైతులు ఢిల్లీ సరిహద్దులో చేసిన ఆందోళనలు ప్రపంపవ్యాప్తంగా భారతీయుల్ని కదిలించాయి. ఈ వ్యతిరేకతను కేంద్రం సీరియస్‌గా తీసుకోలేదు. వారితో చర్చించి, వారి డిమాండ్లు నెరవేర్చాలన్న పరిశీలన చేయలేదు.
- 5 జూన్, 2020 : మూడు సాగు చట్టాలను తేనున్నట్టు కేంద్రం అత్యవసర ఆదేశాలు(ఆర్డినెన్స్) జారీచేసింది.
- 14 సెప్టెంబర్ 2020 : కేంద్రం ఆర్డినెన్స్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టింది
- 17 సెప్టెంబర్ 2020 : వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోదం
- 25 సెప్టెంబర్ 2020 : వీటిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త నిరసనలకు కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ పిలుపు.
- 27 సెప్టెంబర్ 2020 : రాష్ట్రపతి ఆమోదం, గెజిట్ నోటిఫికేషన్ విడుదలతో బిల్లులకు చట్టరూపం.
- 25 నవంబర్ 2020 : వీటిని నిరసిస్తూ 'చలో ఢిల్లీ'కి పంజాబ్, హర్యానా రైతులు పిలుపు.
- 26 నవంబర్ 2020 : ఢిల్లీవైపు సాగుతున్న రైతులను నగర సరిహద్దుల్లోనే అడ్డుకున్న పోలీసులు
- 28 నవంబర్ 2020 : రైతులతో చర్చించేందుకు సిద్ధమని కేంద్రహోం మంత్రి అమిత్ షా ప్రకటన
- 3 డిసెంబర్ 2020 : తొలిసారిగా రైతు సంఘాల నాయకులతో ప్రభుత్వం చర్చలు..డిసెంబర్ 5న రెండోసారి చర్చలు
- 8 డిసెంబర్ 2020 : 'భారత్ బంద్'కు రైతు సంఘాల పిలుపు. ఇందుకు మద్దతు తెలిపిన పలు రాష్ట్రాల రైతులు
- 9 డిసెంబర్ 2020 : చట్టాలకు సవరణ చేస్తామని ప్రభుత్వ ప్రతిపాదనకు నిరాకరించిన రైతు సంఘాలు
- 11 డిసెంబర్ 2020 :వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన భారతీయ కిసాన్ యూనియన్
- 4 జనవరి 2021 : ఏడోసారి రైతులు-కేంద్రం మధ్య చర్చలు జరిగినప్పటికీ...చట్టాల రద్దుకు కేంద్రం నిరాకరణ.
- 7 జనవరి 2021 : సాగుచట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం అంగీకారం.
- 12 జనవరి 2021 : వ్యవసాయ చట్టాలపై 'స్టే' విధించిన సుప్రీంకోర్టు, సాగు చట్టాలపై సిఫార్సులు చేసేందుకు నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు.
- 26 జనవరి 2021 : గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆందోళనకారులతో అట్టుడికిన ఎర్రకోట.
- 29 జనవరి 2021 : ఏడాదిన్నరపాటు ఈ మూడు చట్టాలను తాత్కాలికంగా నిలిపివేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన.
- 5 ఫిబ్రవరి 2021 : రైతుల ఆందోళనలపై తయారుచేసిన 'టూల్‌కిట్' వ్యవహారంపై ఢిల్లీ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు.
- 6 మార్చి 2021 : ఢిల్లీ సరిహద్దులో 100 రోజులకు చేరిన రైతుల ఆందోళన
- 27 మే 2021 : రైతుల ఉద్యమం ఆరు నెలలకు చేరుకోవడంతో 'బ్లాక్ డే'గా ప్రకటించిన రైతు సంఘాలు.
- 22 జులై 2021 : వర్షాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నం
- 7 ఆగస్టు 2021 : సాగుచట్టాలను వ్యతిరేకిస్తూ జంతర్‌మంతర్ వద్ద జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న 14ప్రతిపక్ష పార్టీలు
- 29 అక్టోబర్ 2021 : ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసన చేపట్టిన ప్రాంతం వద్ద బారీకేడ్లను తొలగించిన ఢిల్లీ పోలీసులు.
- 19 నవంబర్ 2021 : సాగు చట్టాలను రద్దు చేసేందుకు ప్రధాని మోడీ నిర్ణయం.