Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చారిత్రాత్మక ఉద్యమానికి తలొంచిన మోడీ సర్కార్
- ప్రస్తావించని ఎంఎస్పీ చట్టం, విద్యుత్ బిల్లు ఉపసంహరణ డిమాండ్లు
- డిమాండ్లన్నీ పరిష్కారమయ్యేవరకు ఉద్యమం : ఎస్కేఎం
- అన్నదాతల ఉద్యమ ఒత్తిడితో వెనకడుగు : ప్రతిపక్షాలు
మోడీ ఇమేజ్ మసకబారుతున్నది. జై కిసాన్..జైజవాన్ అంటూ భారత్ నినదిస్తోంది. చట్టసభల్లో మందబలంతో మూడు నల్లచట్టాలను బీజేపీ సర్కార్ ఆమోదించుకున్నది. అప్పటి నుంచి తగ్గేదేలేదన్న బీజేపీ మునకేయటం ఖాయమన్న సంకేతాలతో దిగివచ్చింది. ఏడాదిగా రైతులు ఉద్యమిస్తున్నా ఏనాడూ ప్రధాని మోడీ నోరువిప్పలేదు. మన్కీబాత్లలో ఆందోళన్జీవిలంటూ ఎగతాళి చేస్తూ..రైతులపై కాండకావరం ప్రదర్శించింది.ఢిల్లీ సరిహద్దులో దీక్ష చేయటానికి కూడా ఆంక్షలు పెట్టింది. జలఫిరంగులు, లాఠీలే కాదు. అమాయక రైతుల ప్రాణాలను తోడేసింది. అంతర్జాతీయంగా దుమారం రేగినా.. ఎర్రకోట వద్ద అల్లర్లు జరిగినా.. కరోనా మహమ్మారి విజృంభించినా చొరవ చూపలేదు.కార్పొరేట్ సేద్యం కోసం ఎంతకైనా తెగిస్తామనేలా బీజేపీ ప్రభుత్వం నిలిచింది. అయినా అన్నదాత వెనక్కి తగ్గలేదు.మడమ తిప్పలేదు. మరోవైపు పార్లమెంట్ సమావేశాలు..ఇంకోవైపు రైతుల ముట్టడి చేస్తామనే హెచ్చరికలతో మోడీ ప్రభుత్వం భయపడింది. లఖింపూర్ ఖేరీ ఘటనలో కేంద్రమంత్రి, అతని తనయుడు చేసిన అరాచకంతో..బీజేపీ మెడకు చుట్టుకున్నది. వీటితో పాటు ముఖ్యంగా యూపీ ఎన్నికల్లో కమలం పార్టీ మునగటం ఖాయమనే సంకేతాలతో..ప్రధాని మోడీ క్షమాపణ చెప్పారు. అయితే కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)తో పాటు పలు డిమాండ్లు పరిష్కరించేదాకా వెనకడుగువేయమని రైతుసంఘాలు స్పష్టంచేశాయి.
న్యూఢిల్లీ : రైతులు విజయం సాధించారు. సుదీర్ఘంగా దాదాపు ఏడాది పాటు సాగిన చారిత్రాత్మక రైతు ఉద్యమానికి మోడీ సర్కార్ దిగిరాక తప్పలేదు. అన్నదాతల ప్రాణత్యాగాలకు వారి కల సాకారమైంది. మూడు రైతు వ్యతిరేక చట్టాల రద్దు చేస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశంలో వీటిని ఉపసంహరి స్తానని స్పష్టం చేశారు. ఉద్యమం విజయం సాధించడంతో యావత్ దేశంలోని రైతులు సం బరాలు చేసుకుంటున్నారు. మిఠాయిలు తినిపించుకుని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల విజయోత్సవ ర్యాలీలు జరిగాయి. అయితే రైతులు ఒకపక్క చట్టాలు రద్దు ప్రకటనను స్వాగతిస్తూనే, మరోవైపు నిరసన కొనసాగిస్తామంటున్నారు. సరిహద్దుల్లో నిరసన కార్యక్రమాలు చేస్తున్న రైతులు తిరిగి ఇండ్లకు వెళ్లాలని ప్రధాని కోరారు.
ఆ చట్టాలు రద్దు చేశాకే..
ఢిల్లీ సరిహద్దుల్లో ఉంటున్న రైతులు మాత్రం దీనిపై చట్టం చేశాకే తిరిగి ఇండ్లకు వెళతామని స్పష్టం చేశారు. పార్లమెంటులో చట్టాలను రద్దు చేసే ప్రక్రియ ప్రారంభమైన తర్వాత మాత్రమే తాము నిరసన స్థలం నుంచి బయలుదేరుతామని రైతులు ముక్తకంఠంతో చెప్పారు.
ఆర్డినెన్స్ వచ్చినప్పటినుంచి ఆందోళన...
గతేడాది జూన్‌లో మూడు వివాదాస్పద ఆర్డినెన్స్ తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం, సెప్టెంబరులో ఈ బిల్లులను పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదించింది. పార్లమెంట్ ఆమోదించిన ఈ మూడు బిల్లులపై రాష్ట్రపతి ఆమోదం ముద్ర వేయడంతో చట్టాలుగా మారాయి. ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పటి నుంచి ఆందోళన చేస్తున్న రైతులు, చట్టాలుగా మారిన తరువాత ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. తమ ఉద్యమ వేదికను రాష్ట్రాల నుంచి దేశ రాజధానికి తరలించాలని నిర్ణయించారు. 500 రైతు సంఘాల నేతృత్వలోని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) చలో పార్లమెంట్‌కు పిలుపు ఇచ్చింది. 2020 పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా మూడు రైతు వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చలో పార్లమెంట్‌కు వేలాది మంది రైతులు కదం తొక్కారు. పంజాబ్ నుంచి ఢిల్లీ వస్తున్న రైతులపై మార్గమధ్యలో హర్యానా ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. కేంద్ర ప్రభుత్వం సహకారంతో హర్యానా ప్రభుత్వం భారీ భద్రతా బలగాలను ముళ్ల కంచెలు, కందకాలు తవ్వడం, భారీస్థాయిలో బారికేడ్లు, కంటెనర్లు వంటి వాటితో దిగ్బంధించాడానికి తీవ్రంగా ప్రయత్నించింది. తీవ్రమైన చలిలో కూడా రైతులపై జలఫిరాంగులను ఎక్కుపెట్టింది. అయినప్పటికీ రైతులు వెనుదిరగలేదు. అనేక అవంతరాలు ఎదుర్కొని ఎట్టకేలకు 2020 నవంబర్ 26న ఢిల్లీ సరిహద్దులకు రైతులు చేరుకున్నారు. అప్పటి నుంచి నిర్విరామంగా ఆందోళన కొనసాగుతోంది. దాదాపు ఏడాది సాగుతున్న రైతు ఉద్యమ ఒత్తిడికి కేంద్రం దిగొచ్చింది.
యూపీ ఎన్నికల కోసమే...
వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటామని ప్రధాని మోడీచేసిన ప్రకటనపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసమే సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రధాని ప్రకటించారని విమర్శలు గుప్పించాయి. ఏడాది కాలంగా కొనసాగుతున్న రైతు ఆందోళనపై ఎప్పుడూ ఒక్కమాటైనా మాట్లాడని ప్రధానమంత్రి, ఉన్నపళంగా వచ్చి సాగు చట్టాల్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించడం వెనుక ఎన్నికల భయమే కారణమని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. ప్రధాని ఇప్పుడు క్షమాపణలు చెప్పినా, తప్పుల్ని ఒప్పుకున్నా ప్రజలు ఆయనను నమ్మరని పేర్కొన్నాయి.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, టీఎంసీ అధినేత్రి మమతా బెనార్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎన్సీపీ అధినేత శరద్ పవర్ వంటి వారు విమర్శలు గుప్పించారు. మరోవైపు బీజేపీ నేతలు ప్రధాని ప్రకటనను స్వాగతిస్తూ ప్రధాని గొప్ప రాజనీతిజ్ఞత చూపించారని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హౌం మంత్రి అమిత్ షా వంటి వారు ప్రధాని ప్రకటనకు మద్దతు తెలిపాయి.
పూర్తిస్థాయిలో డిమాండ్లు నెరవేరలేదు. ఎస్కేఎం
''మూడు చట్టాలు రద్దు ప్రకటనను స్వాగతిస్తున్నాం. తమ డిమాండ్లు పూర్తి స్థాయిలో నెరవేరలేదు. రైతులకు ముఖ్యమైన కనీస మద్దతు ధర చట్టం, విద్యుత్ బిల్లు ఉపసంహరించుకోవడం వంటి డిమాండ్లు మిగిలి ఉన్నాయి. మా డిమాండ్లు నెరవేరేవరకు ఉద్యమం కొనసాగుతోంది'' . రైతుల మరణాలకు కేంద్రమే బాధ్యత వహించాలి.ఎంఎస్పీ చట్టం, విద్యుత్ బిల్లు ఉపసంహరణ వంటి డిమాండ్లపై మోడీ ప్రస్తావించలేదు. ఎస్కేఎం
రైతుల ముందు రెండుసార్లు తలొంచిన మోడీ
ప్రధాని మోడీ ఎవ్వరినీ లెక్కచేయరు, ఒక నియంతలా మొండిగా వ్యవహరిస్తారు.అధికారంలో ఉన్న మందబలంతో ఏదైనా సాధించవచ్చనే అభిప్రాయం..వెనుక కార్పొరేట్ల సహకారం వెరసి తనకు ఎదురులేదనే భావనవ్యక్తమవుతున్నది. అలాంటి మోడీ 2014లో ఢిల్లీ పీఠమెక్కన నాటి నుంచి ఇప్పటి వరకు రెండు సార్లు రైతుల ఉద్యమానికి తలొంచాల్సి వచ్చింది. 2014లో భూ సేకరణ చట్టానికి సవరణలు చేస్తూ బిల్లును తీసుకొచ్చారు. అప్పుడు భూమి అధికార్ ఆందోళన నేతృత్వంలో వందలాది రైతు సంఘాలు, గిరిజన సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టాయి. అప్పడు కూడా తీవ్రంగా వ్యతిరేక వచ్చింది. దీంతో రైతు ఉద్యమానికి దిగొచ్చిన మోడీ సర్కార్, ఆ చట్ట సవరణలను వెనక్కి తీసుకున్నారు. మళ్లీ ఇప్పుడు మూడు రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. దేశ రాజధాని రహదార్లు దిగ్బంధించారు. ఏడాది పాటు సుధీర్ఘంగా సాగుతున్న చారిత్రాత్మక రైతు పోరాటానికి మోడీ సర్కార్ దిగిరాక తప్పలేదు. మూడు చట్టాలను రద్దు చేస్తామని ప్రకటన చేశారు.