Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ స్ఫూర్తితో భూమి, ఉపాధి, సామాజిక న్యాయం కోసం సమైక్య ఆందోళనలు : వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్
- మోడీ విధానాలపై పోరాడాలి : కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షులు ఆమ్రారామ్
న్యూఢిల్లీ : ఏడాది కాలంగా దేశవ్యాప్తంగా సాగిన కిసాన్ ఉద్యమం భవిష్యత్ ప్రజా పోరాటాలకు మార్గ నిర్దేశం చేసిందని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్ అన్నారు. శనివారం వ్యవసాయ కార్మిక సంఘం రాజస్థాన్ రాష్ట్ర మహాసభ బికనీర్లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో వెంకట్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, కార్పొరేట్ అనుకూల చట్టాలను ప్రతిఘటిస్తూ దేశవ్యాప్తంగా సాగిన ఉద్యమం మోడీ ప్రభుత్వానికి ప్రజా పోరాటాల రుచి చూపించిందని అన్నారు. కుట్రలు కుతంత్రాలతో, అరెస్టులు నిర్బంధాలులాంటి అరాచక పద్ధతులతో ప్రజా ఉద్యమాలను అణచాలనుకునే ప్రజాకంఠక పాలకులకు బుద్ధి చెప్పే విధంగా ఈ ఉద్యమం సాగిందని అన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న యావత్ శ్రామిక ప్రజలు, కార్మిక కర్షక ఐక్యతను చాటుతూ వీరోచితంగా సాగించిన పోరాటం అని ఆయన అన్నారు. ఈ పోరాటాల స్ఫూర్తితో రానున్న కాలంలో భూమి ఉపాధి సామాజిక న్యాయం కోసం సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కిసాన్ సభ జాతీయ నాయకులు, షాజహాన్పూర్ సరిహద్దు వద్ద ఏడాది కాలంగా శిబిరానికి నాయకత్వం వహిస్తున్న అమ్రారామ్ మాట్లాడుతూ ప్రభుత్వ మార్పిడి తప్ప కాంగ్రెస్, మోడీ ప్రభుత్వాలకు ఏమాత్రం తేడా లేదని అన్నారు. దోపిడీకి వ్యతిరేకంగా పోరాడే శ్రామికుల అందరికీ చారిత్రాత్మక రైతాంగ పోరాటం మార్గం చూపిందని అన్నారు. ఈ బహిరంగ సభలో వ్యవసాయ కార్మిక సంఘం రాజస్థాన్ రాష్ట్ర కార్యదర్శి పవన్ దుగ్గల్, బికనీర్ శాసనసభ్యులు ఘర్ దారిమారియా తదితరులు పాల్గొన్నారు.