Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉధృతంగా నదులు -రిజర్వాయర్ల నుంచి నీటి విడుదల
- వర్షాలకు 24 మంది మృతి-17 మంది గల్లంతు
అమరావతి : భారీ వర్షాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాల్లో తీవ్ర ఆస్తి నష్టం జరిగినట్టు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. వర్షాలు, వరదల వల్ల ఇప్పటి వరకూ 24 మంది మృతి చెందారు. 17 మంది గల్లంతయ్యారు. మొత్తం 58,362.5 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. 49,110 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఆయా జిల్లాలకు తక్షణ సాయంగా ఏడు కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. తిరుపతి తిరుమల ఘాట్ రోడ్డులో 13 చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. ఐదు చోట్ల రక్షణ గోడలు దెబ్బతిన్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఘాట్ రోడ్డులో ఐదు చోట్ల రక్షణ గోడలు దెబ్బతిన్నాయని పేర్కొంది. వర్షాలు తగ్గినా చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాలు, పంట పొలాలు నీటి ముంపులోనే ఉన్నాయి. నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రిజర్వాయర్ల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో, ముంపు కొనసాగుతోంది. గల్లంతైన మృతదేహాలు బయటపడుతున్నాయి. నేటికీ పలు రహదార్లపై నుంచి నీరు ప్రవహిస్తోంది. నీరు నిల్చిపోయింది. పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. పలు గ్రామాలు నేటికీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. సహాయం కోసం వరద బాధితులు ఎదురు చూస్తున్నారు. వరదలకు గల్లంతైన వారి కోసం ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో సీపీఐ(ఎం) బృందాలు పర్యటించి వరద బాధితులతో మాట్లాడాయి.
కదిరిలో కూలిన ఇండ్లు... ఆరుగురు దుర్మరణం
అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని చైర్మన్ వీధిలో నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల భవనం శనివారం ఉదయం నాలుగు గంటల సమయంలో కూలిపోయింది. వాటి శిథిలాలు ఆ పక్కనే ఉన్న రెండు ఇండ్లపై పడడంతో అవీ నేలమట్టమయ్యాయి. ఆ సమయంలో ఈ మూడు ఇండ్లలో మొత్తం 15 మంది గాఢనిద్రలో ఉన్నారు. భవనం పక్కనే ఉన్న ఇండ్లలోని వారిలో ఆరు గురు మృతి చెందారు. వారిలో నలుగురు మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శిథిలాలు కిందపడిన సమయంలో ఒక ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో మంటలు వ్యాపించి ఇద్దరు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. శిథిలాల్లో చిక్కుకున్న వారిని, మృతదేహాలను పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, ఫైర్ సిబ్బంది, ఎన్డిఆర్ఎఫ్ బృందాలు వెలికితీశాయి.
కడపలో మరో నాలుగు మృతదేహాలు లభ్యం
అన్నమయ్య ప్రాజెక్టు వరద నీటిలో గల్లతైన వారిలో మరో ముగ్గురి మృతదేహాలు శనివారం లభ్యమయ్యాయి. శుక్రవారం 30 మంది గల్లంతు కాగా, వారిలో 12 మృతదేహాలు అదే రోజు దొరికాయి. వేంపల్లె వద్ద గల్లంతైన ఆటో డ్రైవర్ మృతదేహం లభ్యమైంది. మిగిలిన వారి ఆచూకీ లేకపోవడం వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.