Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చట్టాల రద్దుపై సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్
న్యూఢిల్లీ : వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేస్తామని ప్రధాని మోడీ ప్రకటించిన విషయం.. సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వంలో ఐకమత్యంగా పోరాడిన రైతుల చారిత్రాత్మక విషయమని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్ పేర్కొన్నారు. చట్టాల రద్దు విషయంలో రైతులు అప్రమత్తంగానే ఉన్నారని వివరించారు. '' ఈ పోరాటంలో అసువులుబాసిన 700 మంది రైతుల గురించి పశ్చాత్తాపం లేదు. రైతులపై మోపిన తప్పుడు కేసులను ఉపసంహరణ విషయంలో ఎలాంటి హామీ లేదు. ఏడాది పాటుగా రైతులపై ఉపయోగించిన అసభ్య పదజాలానికి ఎలాంటి క్షమాపణా లేదు. ఆయన( ప్రధాని) పార్టీ నేతలే రైతులను ఉగ్రవాదులు, దేశద్రోహులు, గూండాలు, ఆటంకాలు కలిగించేవారు, అబద్దాలు చెప్పేవారు, మోసగించేవారు అన్నారు'' అంటూ మోడీ ప్రసంగంపై ఆమె పేర్కొన్నారు. '' అందులో ఒకరు ఇప్పుడు కేంద్ర క్యాబినేట్లో ఉన్నారు. ఆయనకు భయంకరమైన లఖింపూర్ ఖేరీ ఘటనతో సంబంధం ఉన్నారు'' అని గుర్తు చేశారు. వివాదాస్పద సాగు చట్టాలను సమర్ధిస్తూ ''కొందరు'' రైతులను ఒప్పించడంలో విఫలమయ్యామని క్షమాపణలు చెప్పిన మోడీ సెల్ఫ్‌గోల్ చేసుకున్నారని వివరించారు. ఒకవేళ చట్టాలు మంచివైతే, ''కొందరు'' రైతులు వాటిని వ్యతిరేకిస్తే వాటిని ఎందుకు ఉపసంహరించాలి? అని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో ముఖ్యంగా రైతుల పోరాటానికి కేంద్రంగా ఉన్న పంజాబ్, యూపీలో రాజకీయ పతనం కొనసాగుతున్నదని ఆమె వివరించారు.
'' మెజారిటీ బలాన్ని ఉపయోగించి పార్లమెంటరీ విధానాలను అణచివేయడం ఖరీదైన అంశం. ఒక ప్రభుత్వం ఈ బిల్లులను స్టాండింగ్ కమిటీకి పంపితే, రైతుల వాదనలు వినడానికి అవకాశం కల్పిస్తే, న్యాయమైన ఓటింగ్ విధానాలను అనుమతించినట్టయితే ప్రస్తుత పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు. ప్రస్తుత రూపంలో ఉన్న బిల్లులు చట్టాలుగా మారవు'' అని బృందా కారత్ పేర్కొన్నారు.
'' ఆది నుంచి రైతులకు అపకీర్తి కలిగేలా ప్రభుత్వం తన అన్ని అధికారాలను వినియోగించింది. అర్బన్ నక్సల్స్, యాంటీ నేషనల్స్ గా అడ్వకేట్లను, రైతు నాయకులను పిలిచారు. రైతుల ఐకమత్య ఉద్యమం కేంద్ర, రాష్ట్ర స్థాయిలో బీజేపీకి, దాని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజాపోరాటంగా మారింది'' అని ఆమె వివరించారు.
'' నియంతృత్వం పని చేయదనీ, దానిని ఓడించొచ్చని భారతదేశంలోని శ్రామిక వర్గాలు, రైతులు, కార్మికులు తమ ధైర్యాన్ని చూపారు. రైతు ఉద్యమ విజయం న్యాయం, రాజ్యాంగంలో పొందుపర్చిన ప్రజాస్వామ్య విలువలు, సెక్యులరిజం వైపు ఉన్నవారిలో విశ్వాసాన్ని తీసుకొస్తాయి'' అని పేర్కొన్నారు.