Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిమాండ్లన్నీ నెరవేరే వరకూ పోరాటం యథాతథం
- ఎస్కేఎం సమావేశంలో కీలక నిర్ణయాలు
- యథావిధిగా ఇప్పటికే ప్రకటించిన ఆందోళనలు
- 22న లక్నోలో కిసాన్ మహాపంచాయత్
- 26న రాష్ట్ర రాజధానుల్లో ట్రాక్టర్ల మార్చ్, ఎద్దుల బండ్ల ప్రదర్శన
- 28న ముంబాయి ఆజాద్ మైదాన్‌లో కిసాన్ మజ్దూర్ మహాపంచాయత్
- 29 నుంచి పార్లమెంట్‌కు ట్రాక్టర్ల మార్చ్
- మరణించిన రైతుల కుటుంబాలకు నష్ట పరిహారంతో పాటు ఉపాధి
- పార్లమెంట్ సమావేశాల్లో అమరవీరులకు నివాళులర్పించాలి
- రైతులపై బనాయించిన తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలి
న్యూఢిల్లీ : రైతుల న్యాయమైన డిమాండ్లన్నీ కేంద్ర ప్రభుత్వం నెరవేర్చేవరకు తమ పోరాటం కొనసాగుతోందని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) స్పష్టం చేసింది. ఇప్పటికే ఎస్కేఎం ప్రకటించిన ఆందోళన కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపింది. రైతులంతా వాటిని విజయవంతం చేయాలని పిలుపు ఇచ్చింది. శనివారం ఈ మేరకు సింఘూ సరిహద్దు వద్ద జరిగిన ఎస్కేఎం సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకుంది. ముందుగా అనుకున్నట్టుగా ఈ నెల 22న లక్నోలో జరగబోయే కిసాన్ మహా పంచాయత్‌లో రైతులు పెద్ద సంఖ్యలో చేరాలని ఎస్కేఎం విజ్ఞప్తి చేసింది. ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న శాంతియుత రైతు ఉద్యమం నవంబర్ 26 నాటికి ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సింఘూ, టిక్రీ, ఘాజీపూర్, షాజహాన్‌పూర్ ప్రాంతాల్లో రైతు ఉద్యమం వేదికల వద్ద భారీ స్థాయిల్లో ఆందోళనలు నిర్వహించనున్నారు. ఆయా ప్రాంతాలకు ఉత్తర భారతదేశ రాష్ట్రాల నుంచి రైతులు చేరుకోవాలని పిలుపు ఇచ్చింది. నవంబర్ 26న మొదటి వార్షికోత్సవం సందర్భంగా అన్ని రాష్ట్రాల రాజధాని నగరాల్లో ట్రాక్టర్ మార్చ్, ఎద్దుల బండ్ల ప్రదర్శనలు, ఇతర నిరసనలు జరపాలని తెలిపింది. నవంబర్ 28న వందకు పైగా రైతు సంఘాలు సంయుక్త షెత్కారీ కమ్గర్ మోర్చా నేతృత్వంలో ముంబయిలోని ఆజాద్ మైదాన్‌లో భారీ కిసాన్ మజ్దూర్ మహాపంచాయత్ నిర్వహణ జరుగుతుంది. నవంబర్ 29 నుంచి పార్లమెంట్‌కు రోజుకు 500 మంది రైతులతో ట్రాక్టర్ మార్చ్ శాంతియుతంగా, క్రమశిక్షణతో నిర్వహిస్తామని స్పష్టం చేసింది.
పెండింగ్‌లో మూడు డిమాండ్లు
తమ డిమాండ్లలో మూడు డిమాండ్లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని పేర్కొంది. దేశంలోని రైతులు ఏండ్లుగా వ్యవసాయ ఉత్పత్తులకు చట్టబద్ధంగా హామీ ఇచ్చే ఎంఎస్పీ చట్టం కోసం పోరాడుతున్నారని, తమ సుదీర్ఘ పోరాటంలో ఎంఎస్పీ చట్టం కూడా ప్రధాన డిమాండని ఎస్కేఎం పేర్కొంది. కానీ ప్రభుత్వం ఆ డిమాండ్‌ను విస్మరించిందని తెలిపింది. విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని, ఢిల్లీలోని గాలి నాణ్యత నియంత్రణ చట్టంలో రైతులకు శిక్షలు వేసే నిబంధనలు రద్దు చేయాలనే డిమాండ్లు అలానే ఉన్నాయని ఎస్కేఎం పేర్కొంది.
670 మంది అమర వీరులకు పరిహారం ఇవ్వాలి
రైతు ఉద్యమంలో ఇప్పటివరకు 670 మందికి పైగా రైతులు తమ ప్రాణాలను అర్పించారు. మోడీ ప్రభుత్వం తన మొండి, అహంభావ ప్రవర్తన కారణంగానే ఇంత మంది రైతులు మరణించారని తెలిపింది. ఈ అమరవీరుల కుటుంబాలకు నష్టపరిహారంతో పాటు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేసింది. పార్లమెంటు సమావేశాల్లో అమరవీరులకు నివాళులు అర్పించడంతోపాటు వారి పేరిట స్మారక చిహ్నం కూడా నిర్మించాలి. హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, చండీగఢ్, మధ్యప్రదేశ్ తదితర వివిధ రాష్ట్రాల్లో వేలాది మంది రైతులపై వందలాది తప్పుడు కేసులు బనాయించారు. ఈ కేసులన్నింటినీ బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.
స్వాగతించిన పలు రాష్ట్రాల సీఎంలు
కర్నాటక నుంచి ఢిల్లీకి ఒంటరిగా పాదయాత్ర చేస్తున్న నాగరాజ్ ఉత్తరప్రదేశ్‌లోని కోసి కలాన్‌కు చేరుకున్నారు. ఆయనకు స్థానిక రైతులు ఘనంగా స్వాగతం పలికారు. అనేక మంది ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వ ప్రకటనను స్వాగతించారు. ఇందులో ఢిల్లీ, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, పంజాబ్, మహారాష్ట్ర, కేరళ, రాజస్థాన్, తమిళనాడు తదితర రాష్ట్రాలు ఉన్నాయి. కొంతమంది ముఖ్యమంత్రులు కూడా రైతుల పెండింగ్ డిమాండ్లను నెరవేర్చాలని ఒత్తిడి చేశారని ఎస్‌కెఎం గుర్తు చేసింది. నిరసన తెలిపిన రైతులు తాము పొందిన మొదటి ప్రధాన విజయాన్ని సంబరాలు చేసుకుంటున్నప్పటికీ, పంజాబ్‌లోని ముక్త్సర్ జిల్లా మలౌట్కు చెందిన జస్వీందర్ సింగ్ ఉద్యమం కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు. 2020 నవంబర్ 26న టిక్రీ బోర్డర్‌కు చేరుకున్న ఆయన అప్పటి నుండి ఇంటికి వెళ్లలేదు. అమరవీరుడు జస్వీందర్ ప్రధానమంత్రి ప్రకటన శుభవార్తను విన్నారు. ఆందోళన మొదటి విజయం పట్ల సంతోషంగా ఉన్నారు.
మోడీ దేశ రైతులను అర్థం చేసుకోలేదు
''ప్రధాని నరేంద్ర మోడీ.. ట్రంప్, బైడెన్‌లను అర్థం చేసుకుని వుండవచ్చు కానీ భారతదేశ రైతులను అర్థం చేసుకోలేదు. నల్ల చట్టాలను రద్దు చేయడంలో జరిగిన జాప్యం వల్ల 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉద్యమం భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాన్ని అరికట్టినట్టు అయింది. కనీస మద్దతు ధర లాంటి సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. అందుకే నల్ల చట్టాల స్థానంలో తెల్ల చట్టాలు తేవాల్సి ఉన్నది''
- ఎఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా