Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాల్గొన్న కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్
- సీఐటీయూ, బీఎంఎస్, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, ఏఐయూటీసీ ప్రతినిధులు హాజరు
న్యూఢిల్లీ : ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) కు చెందిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) 229వ సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. కేంద్ర కార్మిక మంత్రి భూపేంద్ర యాదవ్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. కార్మిక శాఖ సహాయ మంత్రి, సీబీటీ ఉపాధ్యక్షులు, కార్మికశాఖ కార్యదర్శి, డిప్యూటీ కార్యదర్శి, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సీఐటీయూ, బీఎంఎస్, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, ఏఐయూటీసీ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్మిక సంఘాల, యాజమాన్య ప్రతినిధులు పలు అంశాలను మంత్రికి వివరించారు. కనీస పెన్షన్ సమస్యపై సుప్రీంకోర్టు కేసు, కేవైసీ వివరాల నమోదులో బీడీ తదితర తరగతుల కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సీఐటీయూ నాయకులు ఏ.కే. పద్మనాభం సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. అలాగే, సీబీటీ సభ్యులు లేవనెత్తిన సమస్యలపై అధికార యంత్రాంగం వైఖరి, ఉద్యోగుల పెన్షన్, ఈపీఎఫ్ఓ పెన్షనర్స్, తదితర అంశాలను ఆయన ప్రస్తావించారు. ఇతర కార్మిక సంఘాలూ పలు అంశాలను లేవనెత్తాయి. ఈపీఎఫ్ఓ నిర్వహణ, నూతన కార్మిక కోడ్-సామాజిక సంక్షేమం, పెన్షన్, ఈ-అడ్మినిస్ట్రేషన్ అనే నాలుగు అంశాలపై సబ్ కమిటీల నియామకం గురించి కేంద్ర మంత్రి ప్రతిపాదించారు. సీబీటీ మీటింగ్ ప్రతి మూడు నెలలకొకసారి తప్పనిసరిగా జరుగుతుందనీ, అవసరమైతే రెండురోజుల పాటూ జరుపుతామన్నారు. జీరో అవర్ పైనా ఆయన హామీ ఇచ్చారు. కాగా, ఈ ప్రతిపాదనలను సీబీటీ సభ్యులు ఆమోదించారు. ఆ తర్వాత ప్రధానంగా సీబీటీ, ఈపీఎఫ్ఓ తో పాటు పలు అంశాలపై చర్చ జరిగింది. కోర్టు వివాదాలు, కేసులను సాధ్యమైనంతగా పరిష్కరించాలని కార్మిక సంఘాల ప్రతినిధులు కోరారు. ప్రావిడెంట్ ఫండ్ నిధులు కొందరు దొంగిలించడానికి సంబంధించిన విషయంపై అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామనీ, భవిష్యత్తులో అలా జరగకుండా నివారించడానికి చర్యలు తీసుకుంటామని కార్మికశాఖ మంత్రి ఈ సందర్భంగా హామీనిచ్చారు.