Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిద్ధుపై విమర్శలు మొదలు
చండీఘర్ : పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను పెద్దన్నయ్య అనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పాకిస్తాన్‌లోని దర్బార్ షాహిబ్ గురుద్వారా పర్యటనకు వెల్లిన ఆయనకు పాకిస్తాన్ అధికారులు స్వాగత సత్కారాలతో ఆహ్వానించారు. దీనికి ఆయన ఇమ్రాన్‌కు ధన్యవాదాలు తెలుపుతూ.. పెద్దన్నయ్య అని సంబోధించారు. దీనిపై పలువురు మండిపడుతున్నారు. అంతేకాకుండా గతంలో పాక్ ఆర్మీ చీఫ్‌ను ఆలింగనం చేసుకోవడంపై కూడా ట్రోల్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోపై బీజేపీ నేత అమిత్ మాలవీయా స్పందిస్తూ .. కాంగ్రెస్ నేత రాహుల్‌కు , పాకిస్తాన్‌కు అత్యంత ప్రీతిపాత్రుడు సిద్ధు అని ఎద్దేవా చేశారు. 'రాహుల్ గాంధీకి సన్నిహితుడైన నవజ్యోత్ సింగ్ సిద్ధు ..పాకిస్తాన్ ప్రధానిని పెద్దన్నయ్య అని పిలిచారు. గతంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వాను సైతం కౌగిలించుకున్నారు. తదుపరి వారసుడిగా అమరీందర్ సింగ్ కన్నా పాకిస్తాన్ ప్రీతిపాత్రుడు సిద్ధును గాంధీ కుటుంబం ఎన్నుకోవడంలో ఆశ్చర్యమేమన్న ఉందా?' అంటూ ట్వీట్ చేశారు.కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందంటూ సల్మాన్ ఖుర్షీద్ రాసిన పుస్తకాన్ని ప్రస్తావిస్తూ.. బిజెపి నేత సంబిత్ పాత్రా వ్యాఖ్యానించారు. బిజెపి నేతలే కాకుండా అకాలీదళ్ చీఫ్ సుఖ్భీర్ సింగ్ బాదల్ కూడా సిద్ధు పర్యటనపై స్పందించారు. దేశ సైనికులను సిద్ధు పదేపదే అవమానిస్తున్నారంటూ పేర్కొన్నారు. ఆప్ నేత రాజీవ్ చద్దా స్పందిస్తూ.. పాక్ ప్రధాని, పాకిస్తాన్‌పై పంజాబ్ అధికార పార్టీ, ఆ ముఖ్యమంత్రి ప్రేమ కురిపించడం ఆందోళనకరమని అన్నారు.