Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జర్నలిస్టు సహా మరో ఇద్దరు బీజేపీ కార్యకర్తలపై కేసు నమోదు
బెంగళూరు : 'అంబేద్కర్ జిందాబాద్' అంటూ ఓ ముస్లిం మహిళ వ్యాఖ్యలతో కూడిన వీడియోను 'పాకిస్థాన్ జిందాబాద్'గా అంటున్నట్టుగా మార్ఫింగ్ చేసిన కర్నాటకకు చెందిన ఓ జర్నలిస్టుతో పాటు ఇద్దరు బీజేపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదుచేశారు. నిందితుల్లో కన్నడ ప్రభ స్థానిక రిపోర్టర్ ఎస్.ఎన్ హరీష్ ఉన్నాడు. ఇతను సోమ్వార్పేట్ జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షునిగా కూడా కొనసాగుతున్నాడు. మరో ఇద్దరు నిందితుల్లో బీజేపీ గ్రామ పంచయతీ సభ్యుడు రఘు, బీజేపీ కార్యకర్త గిరిష్ ఉన్నారు. ఈ ఘటన కర్నాటకలోని కొడగు జిల్లాలోని శనివారసంథే పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అసలు వీడియోకు సంబంధించిన ఘటన నవంబర్ 12న ఓ పోలీసు స్టేషన్ ముందు జరిగింది. ఒక ముస్లిం వ్యక్తి అరెస్టు చేయడం పట్ల నిరసన వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు.. ఆ వ్యక్తిపై తప్పుడు అభియోగాలు మోపారనీ, అతన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఓ ముస్లిం మహిళ 'అంబేద్కర్ జిందాబాద్' అంటూ నినాదాలు చేసింది. ఈ వీడియోను ఉపయోగించి.. సదరు ముస్లిం మహిళ 'పాకిస్థాన్ జిందాబాద్' అని అరుస్తున్నట్టుగా వీడియో మార్ఫింగ్ చేశారు. దీనిని ఉపయోగించి నవంబర్ 15న శనివారసంథేలో బంద్‌కు పిలుపునివ్వడానికి వాడారు. ఈ ప్రాంతంలో హిందువులు అణచివేయబడుతున్నారని పేర్కొంటూ నిందితులైన జర్నలిస్ట్ ఎస్ఎన్.హరీష్, బీజేపీ కార్యకర్తలు రఘు, గిరిష్లు ఇతరులతో దీనిని పంచుకున్నారు. గిరీష్ అనేక వాట్సప్ గ్రూపులలో మార్ఫింగ్ చేసిన వీడియోను ఒక సందేశంతో పంచుకున్నారు. ఆ మెసేజ్‌లో 'ముస్లిం వర్గానికి చెందిన ప్రజలు శనివారసంథే పోలీస్ స్టేషన్ ముందు పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ జాతివ్యతిరేకులను అరెస్టు చేసి, కేసు నమోదుచేయాలి' అని పేర్కొన్నాడు. కావాలనే ఉద్రేకాలు, అల్లర్లను రెచ్చగొట్టడం వంటి పలు ఆరోపణల కింద ఆ ముగ్గురు నిందితులపై కేసు నమోదుచేసినట్టు పోలీసులు తెలిపారు.