Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బుధవారం జరగబోయే సమావేశంలో నిర్ణయం
- భయపడ్డ ఆర్ఎస్ఎస్... అందుకే రద్దు
న్యూఢిల్లీ : మూడు రైతు వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల చట్టాలను రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్ట బద్దత కల్పించాలనీ, విద్యుత్ బిల్లు ఉపసంహరించుకోవాలని, గాలి నాణ్యత చట్టంలో రైతులకు శిక్ష విధించే నిబంధనలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చారిత్రాత్మక రైతు ఉద్యమ ఒత్తిడితో కేంద్రంలోని మోడీ సర్కార్ దిగొచ్చింది. మూడు చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించారు. ఈ నెల 29 నుంచి జరగబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశంలో చట్టాల రద్దు ప్రక్రియ జరుగుతుందని తెలుపుతూ దేశ ప్రజలకు ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. అందులో భాగంగానే వచ్చే కేంద్ర మంత్రి వర్గంలో మూడు వ్యవసాయ చట్టాల రద్దును ఆమోదిస్తూ నిర్ణయం తీసుకోనున్నది. ఈ మేరకు ఈ నెల 24 (బుధవారం) జరగబోయే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో చట్టాల రద్దు అంశంపై దృష్టాసారించినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం. మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణకు ఆమోదం తెలపనుంది. అలాగే వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో మూడు చట్టాల ఉపసంహరణకు సంబంధించిన బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
రైతు ఉద్యమంతో..
దేశంలో సుదీర్ఘంగా సాగుతున్న రైతు ఉద్యమంపై సంఘపరివార్, బీజేపీ అనేక అబాంఢాలు వేశాయి. రైతులపై ఖలీస్తానీలు, జాతి వ్యతిరేకులు, నక్సల్స్ వంటి అనేక అవమానకర వ్యాఖ్యలు చేశాయి. అయినప్పటికీ రైతులు మొక్కవోని దీక్షతో ఉద్యమాన్ని నిర్విరామంగా సాగించారు. ఇది పంజాబ్ ఉద్యమం అంటూ రైతు పోరాటాన్ని ఆ రాష్ట్రానికి పరిమితం చేసే ప్రయత్నం చేశారు. తరువాత ఉద్యమం హర్యానాకు విస్తరించింది. అప్పుడు పంజాబ్, హర్యానా పోరాటం అన్నారు. ఆ తరువాత రైతు ఉద్యమం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్... అలా అన్ని రాష్ట్రాలకు ఉద్యమం విస్తరించింది. రైతులు దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో శిబిరాలు ఏర్పాటుచేసుకొని ఆందోళన కొనసాగిస్తున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లోని ఉద్యమానికి దేశవ్యాప్తంగా సంఘీభావ పోరాటాలు జరుగుతున్నాయి. రైతు ఉద్యమం దేశంలోని ప్రతిమూలకు, సామాన్యలకు వెళ్లింది. ఈ ఏడాది జరిగిన పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి దిగజారింది. పశ్చిమ బెంగాల్లో ఎలాగైనా గెలుస్తామని ఆశించారు. కానీ దానికి భిన్నంగా చతికిలపడ్డారు. కేరళలో ఉన్న ఒక్క సీటునూ కోల్పోయింది. అధికారంలో ఉన్న అసోంలో (0.83 శాతం) స్వల్ప ఓట్ల తేడాతో నెగ్గింది. 11స్థానాలను కోల్పోయింది. ఇక తమిళనా డులో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకొని ఆశించిన స్థానాలను కూడా గెలవలేకపోయింది. దీంతో బీజేపీ, ఆర్ఎస్ఎస్లో భయం నెలకొంది. వచ్చే ఏడాది (2022) ఫిబ్రవరి, మార్చి మాసాల్లో జరగబోయే ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూల పరిస్థితులు నెలకొన్నా యి. వీటిలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవాల్లో బీజేపీ ప్రస్తుతం అధికారంలో ఉంది. పంజాబ్‌లో కాంగ్రెస్ అధికా రంలో ఉంది. వీటిలో పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రైతు ఉద్యమ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. బీజేపీకి ఉత్తరప్రదేశ్ గుండెకాయ లాంటిది. అలాంటి యూపీలో బీజేపీకి ప్రతికూల పరిస్థితి నెలకొంది. గతంలో బీజేపీకి మద్దతు ఇచ్చిన జాట్ కమ్యూనిటి రైతు ఉద్యమ నేపథ్యంలో బీజేపీకి దూరమైంది. దీంతో బీజేపీ కాస్తా ఇరకాటంలో పడింది.దాదాపు 120 అసెంబ్లీ స్థానాల్లో జాట్ల ప్రాబల్యం ఉంది.వాటిలో గత ఎన్నికల్లో బీజేపీకి దాదాపు 110వరకూ వచ్చాయి.ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అందుకే బీజేపీ జాతీయ నాయకులు డాంభికాలు పలుకుతున్నా,యూపీ బీజేపీ నేతలు మాత్రం సతమతమవుతున్నారు.దీనిపై సూక్ష్మస్థాయి లో పరిశీలన చేస్తున్న ఆర్ఎస్ఎస్ కూడా భయపడింది. ఈ పరిస్థితికి ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని ఆర్ఎస్ఎస్ నిర్ణయం తీసుకుంది. అందుకే యూపీ ఎన్నికలలో నరేంద్ర మోడీకి బలమైన ప్రతిష్ట ఉన్నప్పటికీ, సంఫ్‌ు పరివార్ ఎటువంటి రిస్క్ తీసుకోవడానికి సిద్ధం లేదు. అందువల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ప్రధాని మోడీపై ఆర్ఎస్ఎస్ ఒత్తిడి తెచ్చింది. దీంతో మూడు చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించారు. ఆర్ఎస్ఎస్ జోక్యంతోనే చట్టాల రద్దుకు మోడీ సమ్మతించారని ఆర్ఎస్ఎస్ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి.