Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీసమద్దతు ధరల చట్టం కోసం..
- దేశంలో కేవలం 6 శాతం రైతులకే ఎంఎస్పీ
- పెండింగ్ డిమాండ్లపై ప్రధాని మోడీకి ఎస్కేఎం కోర్ కమిటీ బహిరంగ లేఖ
న్యూఢిల్లీ బ్యూరో : దేశంలోని రైతులు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) చట్టం కోసం పోరాటం కొనసాగిస్తున్నారు. రైతులు పండించే పంటలకు మద్దతు ధర లేకనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రైతు ఉద్యమం స్పష్టం చేసింది. రైతులకు తక్షణ ఉపశమనం కలగాలంటే, ఎంఎస్పీ చట్టం చేయాలని రైతు ఉద్యమం డిమాండ్ చేస్తున్నది. దేశంలో కేవలం 6శాతం మంది రైతులు తమ పంటలను ఎంఎస్పీకి అమ్ము కోగ లుగుతున్నారనీ, మిగిలిన 94శాతంమంది రైతులకు ఎంఎస్పీ అందుబా టులో లేదని స్పష్టం చేసింది. కనుక దేశంలో రైతులందరూ పండించిన అన్ని పంటలకూ ఎంఎస్పీ చట్టబద్దమైన హామీనిస్తూ చట్టం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులకు ఎంఎస్పీని చట్టబద్ధమైన హక్కుగా మార్చడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలంటున్నారు.
నేడు లక్నోలో కిసాన్ మహా పంచాయత్
యూపీలోని లక్నోలో నేడు (సోమవారం) కిసాన్ మహా పంచాయత్ జరగనున్నది. లక్నోలోని ఎకోగార్డెన్ (పాత జైలు) బంగ్లా బజార్లో నిర్వహించే కిసాన్ మహా పంచాయత్‌లో రైతులు, కూలీలు, యువకులందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపునిచ్చింది. లక్నో మహా పంచాయత్‌లో తమ సత్తాను ప్రదర్శించాలని నిర్ణయించారు. ప్రధాని మోడీ ప్రకటన తర్వాత ఎస్కేఎం తొలి బహిరంగ సభ ఇది.
రైతుల పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను ప్రస్తావిస్తూ పార్లమెంట్లో వ్యవసాయ చట్టాల ఉపసంహరణ కోసం వేచి చూస్తామని పేర్కొన్నది. ఈ మేరకు ఆదివారం నాడిక్కడ సింఘూ సరిహద్దు వద్ద కిసాన్ ఆందోళన్ కార్యాలయంలో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బల్బీర్ సింగ్ రాజేవాల్, దర్శన్ పాల్, గుర్నామ్ సింగ్ చారుని, హన్నన్ మొల్లా, జగ్జిత్ సింగ్ దల్లేవాల్, జోగీందర్ సింగ్ ఉగ్రహన్, శివకుమార్ శర్మ 'కక్కాజీ', యుధ్వీర్ సింగ్, యోగేంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అపూర్వమైన సుదీర్ఘ పోరాటం తర్వాత చారిత్రాత్మక విజయం సాధించినందుకు దేశ రైతులు, కార్మికులందరినీ ఎస్కేఎం సమావేశం హదయపూర్వకంగా అభినందించింది.
ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించే అంశంపై ఏర్పాటు చేయనున్న కమిటీపై స్పష్టత తీసుకుంటామని ఎస్కేఎం నేతలు వివరించారు. సింఘూ సరిహద్దులో కోర్ కమిటీ సమావేశం అనంతరం మీడియాతో ఎస్కేఎం బల్బీర్ సింగ్ రాజేవాల్ మాట్లాడుతూ.. ప్రధాని తన శుక్రవారం నాటి ప్రసంగంలో కమిటీ హక్కులు, విధులు, కాలవ్యవధి గురించి స్పష్టంగా చెప్పలేదని ఆయన అన్నారు. ''ఆందోళన సమయంలో రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవడం, ప్రాణాలు కోల్పోయిన రైతులకు పరిహారం, విద్యుత్ బిల్లుపై చర్చ, హౌం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి అజరు మిశ్రాను తొలగించడం వంటి వాటిని కూడా మేము కోరుతాము'' అని రాజేవాల్ అన్నారు. ఎస్కేఎం తదుపరి సమావేశం నవంబర్ 27న జరగనున్నదనీ, అప్పుడు భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
'తెలంగాణ ప్రభుత్వానికి అమరవీరుల జాబితా ఇస్తాం'
''రైతు ఉద్యమంలో సుమారు 700 మంది వీర రైతులు చేసిన త్యాగాలను ప్రధాని, ఆయన ప్రభుత్వం గుర్తించనప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలకు మద్దతునిచ్చేందుకు ముందుకు వచ్చింది. అమరవీరుల కుటుంబానికి ఒక్కొక్కరికి రూ. 3 లక్షలు ప్రకటించింది. ప్రతి రైతు కుటుంబానికీ కేంద్ర ప్రభుత్వం రూ.25 లక్షలు చెల్లించాలనీ, రైతులపై అన్ని కేసులనూ బేషరతుగా ఉపసంహరించుకోవాలి'' అని డిమాండ్ చేశారు. అమరవీరుల కుటుంబాలకు అందించే ఈ ఎక్స్‌గ్రేషి యా కోసం తెలంగాణ ప్రభుత్వానికి అమరవీరుల జాబితాను అందజేస్తామని ఎస్కేఎం తెలిపింది.
బీజేపీ నాయకులకు
రైతుల నుంచి నిరసన సెగలు
హర్యానాలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి జెపి దలాల్ కోర్టు కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తోషం చేరుకుంటే, ఆయనకు వ్యతిరేకంగా రైతులు నల్ల జెండాలతో నిరసన తెలిపేందుకు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. రైతులను అదుపులోకి తీసుకుని, మంత్రి కార్యక్రమం ముగిసిన తర్వాతే వారిని విడుదల చేశారు. కేవలం పంజాబ్, హర్యానా, పశ్చిమ యూపీలలోనే కాదు.., బీజేపీ నేతలకు వ్యతిరేకంగా నల్లజెండాలతో నిరసనలు ఎదురవుతున్నాయి.
ఆరు అంశాలతో ప్రధానికి ఎస్కేఎం లేఖ
న్యూఢిల్లీ బ్యూరో : రైతు ఉద్యమంలో మిగిలిన డిమాండ్లు, సమస్యలు పరిష్కరించడానికి రైతులతో చర్చలు జరపాలని ఎస్కేఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం ''దేశానికి మీ సందేశం, మీకు రైతుల సందేశం'' పేరుతో ప్రధాని మోడీకి ఎస్కేఎం లేఖ రాసింది. ''దేశంలోని కోట్లాది మంది రైతులకు నవంబర్ 19 ఉదయం దేశానికి మీ సందేశాన్ని వినిపించారు. 11 విడుత చర్చల తర్వాత మీరు ద్వైపాక్షిక పరిష్కారం కాకుండా ఏకపక్ష ప్రకటన మార్గాన్ని ఎంచుకున్నారని మేము గుర్తించాం. అయితే మీరు మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించినందుకు మేము సంతోషిస్తున్నాము. మేము ఈ ప్రకటనను స్వాగతిస్తున్నాం. వీలైనంత త్వరగా మీ ప్రభుత్వం ఈ హామీని నెరవేరుస్తుందని ఆశిస్తున్నాం'' అని ఎస్కేఎం లేఖలో పేర్కొన్నది. ''రైతు ఉద్యమం ఏకైక డిమాండ్ మూడు నల్ల చట్టాలను రద్దు చేయడమే కాదని మీకు బాగా తెలుసు. ఎస్కేఎం ప్రభుత్వంతో చర్చల ప్రారంభం నుంచి మరో మూడు డిమాండ్లను లేవనెత్తింది'' అని తెలిపింది.