Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో రోజూ అట్టర్‌ప్లాప్ షో
ముంబయి : ఎంతో అట్టహాసంగా స్టాక్ మార్కెట్లోకి వచ్చిన పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ఇన్వెస్టర్లకు రక్తకన్నీరు మిగుల్చుతోంది. వరుసగా రెండో సెషన్లోనూ తీవ్ర పతనాన్ని చవి చూసింది. సోమవారం ఇంట్రాడేలో ఆ కంపెనీ సూచీ ఏకంగా 18.72 శాతం కోల్పోయి రూ.1271కి పడిపోయింది. తుదకు 13.03 శాతం నష్టంతో రూ.1,360.30 వద్ద ముగిసింది. ఐపీఓలో ఈ కంపెనీ విలువను దాదాపు రూ.1.5 లక్షల కోట్లుగా చూపించగా.. మార్కెట్లో భారీ పతనంతో రూ.88,184 కోట్లకు పడిపోయింది. వరుసగా రెండు సెషన్లలో ఈ కంపెనీ సూచీ 40 శాతం మేర విలువ కోల్పోయింది. దీంతో మదుపర్లు 63వేల కోట్ల మేర నష్టాలను చవి చూశారని అంచనా. ఐపీఓ లిస్టింగ్ తొలి రోజే 27 శాతం పడిపోవడంతో రూ.38 వేల కోట్ల సంపద తుడిచుకు పెట్టుకుపోయింది. పేటీఎంలో 9.1 శాతం వాటా కలిగిన ఈ కంపెనీ వ్యవస్థాపకులు విజరు శేఖర్ శర్మ సంపద రూ.10వేల కోట్ల మేర కరిగిపోయింది. ఈ కంపెనీ సూచీ రూ.1200కు పడిపోవచ్చని తొలుత నిపుణులు అంచనా వేసినప్పటికీ.. మరింత పడిపోయే అవకాశాలు లేకపోలేదని తాజా అంచనాలు హెచ్చరిస్తున్నాయి. రిటైల్ మదుపర్లు ఈ సూచీ కొనుగోలు పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.