Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2017-20 మధ్య ఖాతాదార్ల నుంచి రూ.254కోట్లు వసూలు
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన కింద వివిధ బ్యాంకుల్లో కోట్లాది మంది 'జీరో అకౌంట్ బ్యాలెన్స్' పొదుపు ఖాతాలు తీసిన సంగతి తెలిసిందే. వీటిని 'బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్'గా (బీఎస్‌బీడీఏ) పేర్కొంటారు. అయితే ఈ తరహా ఖాతాల్లో పరిమితికి మించి(నెలకు నాలుగు కన్నా ఎక్కువ) జరిగిన ప్రతి లావాదేవీపై బ్యాంకులు రూ.17.70 ఛార్జీలు వసూలుచేశాయి. యూపీఐ, రూపే కార్డ్, డిజిటల్ లావాదేవీలపైనా ఛార్జీలు వసూలుచేశాయి. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తూ, మరోవైపు మోడీ సర్కార్ ఇలా ఛార్జీలు వసూలు చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో ఇలా వసూలు చేసిన ఛార్జీల్ని తిరిగి ఖాతాదారులకు బ్యాంకులు చెల్లించాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయం పూర్తిగా అమలుకాలేదని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ ఖాతాదార్లకు ఎస్బీఐ సుమారుగా రూ.90 కోట్లు చెల్లించిందని, ఇంకా మరో రూ.164కోట్లు చెల్లించాల్సి వుందని ఐఐటీ-ముంబయి ఒక నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికలో పేర్కొన్న వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఏప్రిల్ 2017-సెప్టెంబర్ 2020 (33 నెలల కాలంలో) బీఎస్‌బీడీఏ ఖాతాలకు సంబధించి పరిమితి దాటిన యూపీఐ, రూపే కార్డ్, డిజిటల్ లావాదేవీలపై ఎస్బీఐ ఛార్జీలు విధించింది. ప్రతి లావాదేవీపై రూ.17.70 వసూలు చేసింది. వివిధ సంక్షేమ పథకాల నిమిత్తం కేంద్రం తమ ఖాతాల్లో డబ్బులు వేస్తుందని భావిస్తే, దానికి విరుద్ధంగా వారి ఖాతాల్లో పొదుపు డబ్బును లాగేసుకోవటంతో విమర్శలు వెల్లువెత్తాయి. మోడీ సర్కార్ తీరు వివాదాస్పదమైంది. కోట్లాదిమంది జన్‌ధన్ ఖాతాదార్లు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కేంద్రం నష్టనివారణా చర్యలకు దిగింది.కేంద్ర ఆర్థిక శాఖ దిద్దుబాట చర్యలు చేపట్టింది. ఛార్జీల రూపంలో వసూలు చేసినదాన్ని తిరిగి ఖాతాదార్లకు చెల్లిస్తామని ఆగస్టు 2020లో ప్రకటించింది. సంబంధిత ఖాతాలకు రీఫండ్ చేయాలని ఎస్బీఐని ఆదేశించింది. జనవరి 2020 నుంచి జన్‌ధన్ ఖాతాల్లో యూపీఐ, రూపే డెబిట్ కార్డ్, డిజిటల్ లావాదేవీలకు ఎలాంటి పరిమితులు లేవనీ, ముందు ముందు కూడా రుసుములు విధించరాదని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్, ఆర్బీఐ బ్యాంకులకు మార్గదర్శకాలు విడుదల చేశాయి.