Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీబీఐ, ఈడీ దర్యాప్తు సంస్థల్ని ఆయుధంగా మార్చుకున్న మోడీ సర్కార్
- ఏడేండ్లుగా ప్రతిపక్ష పార్టీలను దెబ్బతీయటమే వాటి పని!
- డైరెక్టర్ పదవీ కాలం పెంపునకు అడ్డంకిగా మారిన సుప్రీం, పార్లమెంట్
- అందుకే మోడీ సర్కార్ ఆర్డినెన్స్ జారీ
- 2024 సార్వత్రిక ఎన్నికలకు ఇప్పట్నుంచే ఏర్పాట్లు
న్యూఢిల్లీ : సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలం పొడిగిస్తూ మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. గత ఏడేండ్లుగా సీబీఐ, ఈడీ ఏ విధంగా వ్యవహరిస్తున్నాయన్నది అందరికీ తెలిసిందే. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాల్ని కూలదోయడానికి సీబీఐ, ఈడీలను కేంద్రం పావులుగా వాడుతోంది. మునుపెన్నడూ లేనంతగా దర్యాప్తు సంస్థల స్వతంత్ర ప్రతిపత్తి ప్రశ్నార్థకంగా మార్చింది. ఎన్ఫోర్స్మేంట్ డైరెక్టర్ (ఈడీ) ప్రస్తుత డైరెక్టర్ సంజరు కుమార్ మిశ్రా పదవీ కాలాన్ని పొడగించాలని మోడీ సర్కార్ భావించింది. అయితే ఈ నిర్ణయానికి పార్లమెంట్, సుప్రీంకోర్టు ఆమోదం లభించలేదు. దాంతో కేంద్రం ఆర్డినెన్స్ మార్గంలో వెళ్లింది. 19 నవంబర్, 2021న రిటైర్ కావాల్సిన మిశ్రా పదవీకాలాన్ని పొడిగించింది. మోడీ సర్కార్ రాజకీయ ప్రయోజానల్ని కాపడటం కోసమే ఇదంతా జరిగిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నచ్చితే..మొత్తం ఐదేండ్లు..
పదవీకాలంపై కేంద్రం జారీచేసిన ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలైంది. నిబంధనల ప్రకారం సీబీఐ, ఈడీ డైరెక్టర్లు రెండేండ్లపాటు పదవిలో ఉంటారు. పదవీకాలం ముగిసిన తర్వాత కూడా ఒక్కో ఏడాది చొప్పున మూడేండ్ల వరకు వారి పదవీకాలాన్ని పెంచడానికి వీలు కల్పిస్తూ ఈనెల 14న రెండు ప్రత్యేక ఆర్డినెన్స్‌లను కేంద్రం తీసుకొచ్చింది. దీంతో ఆయా సంస్థల డైరెక్టర్లు మొత్తం అయిదేండ్లపాటు పదవిలో కొనసాగడం వీలవుతుంది. ఈ ఆర్డినెన్స్‌లతో కేంద్ర దర్యాప్తు సంస్థల స్వతంత్ర ప్రతిపత్తి నిర్వీర్యం అవుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చే అధికారిని ఐదేండ్లుగా ఆ పదవిలో కొనసాగించటమే మోడీ సర్కార్ అసలు ఉద్దేశంగా కనపడుతోంది. ఈ నిర్ణయం దర్యాప్తు సంస్థల నైతికతను, విశ్వసనీయతను దెబ్బతీస్తోందని కేంద్ర హోంశాఖ మాజీ స్పెషల్ డైరెక్టర్ యశోవర్ధన్ ఆజాద్ చెప్పారు.
2024 సార్వత్రిక ఎన్నికలు
ఇదంతా కూడా 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాల్ని దెబ్బతీయడానికేననే విమర్శలున్నాయి. ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, వారి మద్దతున్న వ్యాపారులు, పారిశ్రామికవేత్తలపై కేంద్రం ఈడీ దాడులు జరుపుతోంది. పెద్ద సంఖ్యలో మనీలాండరింగ్ కేసులు నమోదుచేస్తోంది. ఈ ఏడేండ్లలో కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ, శివసేన, టీఎంసీ, బీజేడీ, డీఎంకే, ఎన్సీపీ, జనతాదళ్(ఎస్)..మొదలైన పార్టీలపై పదుల సంఖ్యలో ఐటీ దాడులు, ఈడీ దాడులు జరిగాయి.
పౌర సమాజంపై ప్రయోగం
ఇంటెలిజెన్స్ బ్యూరో, రా(రీసెర్చ్, అనాలసిస్ వింగ్), సీబీఐ, ఈడీ...వీటి ముఖ్య అధికారుల పదవీ కాలాన్ని పెంచుతూ కేంద్రం ఆర్డినెన్స్ విడుదల చేసింది. ఇందులో ఈడీకి అపరిమిత అధికారాలున్నాయి. దీనిని ఆసరా చేసుకొని ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగుతోంది. దేశంలో సామాన్య ఓటరుకు కూడా ఈ విషయం తెలుసు. అలాగే స్వతంత్ర మీడియా గొంతు అణచివేయడానికి కూడా ఈడీ దాడుల్ని ప్రయోగిస్తోంది. హిందీ దినపత్రిక దైనిక్ భాస్కర్, న్యూస్ పోర్టల్స్..న్యూస్‌లాండ్రీ, న్యూస్‌క్లిక్‌లపై ఈడీ, ఐటీ దాడులు జరిగాయి. పౌర సమాజంలో ప్రతిపక్షాలు, స్వతంత్ర మీడియా పరపతిని దెబ్బతీయడానికి ఈ దాడులు పాలకులకు ఉపయోగపడుతున్నాయి.