Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్య సంరక్షణ అవసరాలు తీర్చడంలో మన్సిపల్ బాడీలు విఫలం
- అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయ అధ్యయనం వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత దేశ ఆరోగ్య వ్యవస్థలో నెలకొన్న డొల్లతనం బయటపడింది. కరోనా ప్రారంభంలో పెద్ద ఎత్తున ఆరోగ్య వ్యవస్థలో మార్పులు శ్రీకారం చుడుతున్నామని కేంద్రంలోని మోడీ సర్కారు ప్రకటించింది. అయితే, ఎడాదిన్నర దాటుతున్న ఆరోగ్య వ్యవస్థలో పెద్ద మార్పులు తీసుకురావడం, వైద్య రంగాన్ని మెరుగుపర్చడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఇదివరకే పలు అధ్యయనాలు పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా దేశంలోని పట్టణ పేదల ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చడంలో మున్సిపల్ బాడీలు విఫలమవుతున్నా యని అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం అధ్యయనం పేర్కొంది. మున్సిపాలిటీల్లో సరిపడా, మెరుగైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు లేని కారణంగా పట్టణ పేదలు ప్రయివేటు రంగంలో సేవలు పొందాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపింది.పట్టణీకరణ అత్యం త వేగంగా విస్తరిస్తున్నందున, 1960లో 18శాతంగా ఉన్న పట్టణ జనాభా 2019నాటికి రెట్టింపు (34 శాతం) అయిందని పేర్కొంది. దీనికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో పట్టణ పేదలు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు పొందకుండా ఇబ్బందు లు పడుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పేదలకు ఆరోగ్య సంరక్షణలో తగినంత బడ్జెట్‌ను కేటాయించడం లేదు. ఈ విషయంలో మున్సిపల్,అక్కడి పరిపాలన సంస్థలు విఫలమవుతు న్నాయి.దేశవ్యాప్తంగా ఉన్న 17 ప్రాంతీయ ఎన్జీవోల సహకారంతో అధ్యయనం సాగించి అజీమ్ ప్రేమ్‌జీ వర్సీటీ ఈ నివేదికను 'హెల్త్ కేర్ ఈక్విటీ ఇన్ అర్బన్ ఇండియా' అనే పేరుతో విడుదల చేసింది. దేశంలోని నగరాల్లో ఆరోగ్య దుర్బలత్వం,అసమానతలను ఈ నివేదిక ఎత్తిచూపింది.పట్టణ ప్రాంతాల్లో జీవన పరిస్థితుల్లో వ్యత్యా సాలు అధికంగా ఉంటాయి.దీనిని సామాజికంగా ఉన్న అంతరాలు కూడా ప్రభావితం చేస్తున్నాయి.ప్రభుత్వ, ప్రయివేటు ఆరోగ్య సంరక్షణ ఖర్చుల్లో 10 రెట్లు వ్యత్యాసం ఉన్నప్పటికీ, పట్టణ పేదలు ప్రభుత్వేతర సంరక్షణను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ప్రభుత్వ సౌకర్యాల కొరతే దీనికి కారణమని నివేదిక పేర్కొంది. ''పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా పట్టణ ప్రజారోగ్య సేవల లభ్యత దేశవ్యాప్తంగా ప్రభుత్వ నిబంధనల కంటే 40శాతం తక్కువగా ఉంది. అదనంగా, అందుబాటులో ఉన్న సౌకర్యాలు సైతం చాలా తక్కువగా ఉన్నాయి. దీని కారణంగా పట్టణ పేదలు..ముఖ్యంగా పట్టణాల అంచున..మురికివాడల్లోని ప్రజలు అత్యంత హానికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు'' అని అధ్యయనం పేర్కొంది. ఉదాహరణకు దేశంలోని పేదల్లో 30 శాతం మంది ప్రయివేటు మూలాల నుంచి డెలివరీ కేర్‌ను కోరుకుంటున్నారు. ఫలితంగా అధిక ఖర్చులకు దారితీస్తుంది. అయితే, సేవలకు ప్రాప్యత, ఖర్చులో ఇటువంటి అసమానతలు ఆరోగ్య సేవలను ఆలస్యం చేయడం లేదా పూర్తిగా వదులుకోవడానికి కారణమవుతున్నాయి. ప్రత్యేకించి దీర్ఘకాలిక సంరక్షణ అవసరమయ్యే పరిస్థితులను దిగజారుస్తున్నాయి. పేదల అసమాన వైద్య భారాన్ని సైతం అధ్యయనం ఎత్తి చూపింది. పట్టణ ప్రాంతాల్లోని ధనవంతులతో పోలిస్తే పేదవారిలో ఆయుర్దాయం పురుషులు, స్త్రీలలో వరుసగా 9.1, 6.3సంవత్సరాలు తక్కువగా ఉంది. ''కొన్ని ఆరోగ్య పరిస్థితుల పరిగణలోకి తీసుకుంటే గ్రామీణ పేదలతో పోల్చినప్పుడు కూడా పట్టణ పేదలలో వైద్య ఖర్చుల భారం ఎక్కువగా ఉంది. ''పిల్లలలో తక్కువ బరువు,ఊబకాయం,క్షయ వంటివి ప్రభావితం చేస్తున్నాయి .పట్టణ ధనవంతులు,గ్రామీణ పేదలతో పోలిస్తే పట్టణ పేదలలో మద్యం, ఖైనీ, ధూమపానం వంటి ప్రమాద కారకాలకు గురికావడం చాలా ఎక్కువ. పట్టణ ప్రాంతాల్లో, ముఖ్యంగా అట్టడుగు సామాజిక-ఆర్థిక సమూహాలు, మహిళల్లో మానసిక అనారోగ్యం ఎక్కువగా ఉంది'' అని నివేదిక కనుగొంది. ప్రభుత్వ వైద్య సౌకర్యా లు అందించే వ్యవస్థల్లో వైద్యులు, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది కొరత అధికంగా ఉందని అధ్యయనం గుర్తించింది.