Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్ బాధితుల కుటుంబాలకు సాయంపై రాష్ట్రాల నుంచి సమాచారం సేకరించండి : కేంద్రాన్ని కోరిన సుప్రీం
న్యూఢిల్లీ : కోవిడ్‌తో మరణించిన వారి పిల్లలకు రూ.50వేల నష్టపరిహారం ఇవ్వడంపై ఇంతవరకు తీసుకున్న చర్యల గురించి రాష్ట్రాల నుంచి సమాచా రాన్ని సేకరించాల్సిందిగా సుప్రీంకోర్టు కేంద్రాన్ని సోమవారం ఆదేశించింది. జస్టిస్ ఎ.ఎం.ఖాన్ విల్కర్, జస్టిస్ సి.టి.రవికుమార్‌లతో కూడిన బెంచ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నష్టపరిహారం చెల్లింపులకు సంబంధించి కుటుంబాలు చేసే ఫిర్యాదులను విచారించేందుకు ఇబ్బందుల పరిష్కార కమిటీలను ఏర్పాటు చేయడంలో రాష్ట్రాలు సాధించిన పురోగతిపై కూడా సమాచారం ఇవ్వాలని కోరింది. వచ్చే సోమవారం నాటికి సమాచారం ఇవ్వగలమని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు హామీ ఇచ్చారు. కాగా, ఈ నష్టపరిహారం చెల్లింపుపై గుజరాత్ జారీ చేసిన సవరించిన ప్రభుత్వ తీర్మానం (జీఆర్) పట్ల బెంచ్ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఆదేశాలను ఉల్లం ఘించినందుకు గత విచారణ సందర్భంగా గుజరాత్ ప్రభుత్వాన్ని బెంచ్ మందలించింది. నష్టపరిహారం చెల్లింపుల కోసం బాధితుల పిల్లలు దాఖలు చేసే దరఖాస్తుల్లో నిజాయితీ ఎంత వుందో తెలుసుకోవడానికి ఒక పరిశీలనా కమిటీని గుజరాత్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రోగి మరణ ధృవీకరణ పత్రం, ఆర్టీపీసీఆర్ సర్టిఫికెట్లను అందచేసిన వెంటనే నగదు చెల్లించాలని కోర్టు పేర్కొంది. కానీ ఈ క్రమాన్ని మరింత చిక్కుల్లోకి నెట్టేలా చర్యలు తీసుకున్నారని జస్టిష్ షా విమర్శించారు. స్క్రూటినీ కమిటీకి అందచేయడానికి పలు పత్రాలను రాష్ట్రం కోరుతోంది. దీనిపై మెహతా మాట్లాడుతూ, కొంతసమయం ఇస్తే అధికారులతో కూర్చుని సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు. దానిపై కోర్టు సోమవారం వరకు గడువు ఇచ్చింది. మెహతాతో చర్చలు జరపాల్సిందిగా గుజరాత్ చీఫ్ సెక్రటరీని కోరింది.