Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లింగ తటస్థత వైపు కేరళలోని ఒక ప్రభుత్వ పాఠశాల అడుగు
- అభినందించిన ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి
తిరువనంతపురం : కేరళలోని ఒక ప్రభుత్వ పాఠశాల 'లింగ సమానత్వం' విషయంలో ఒక అడుగు ముందుకేసింది. పాఠశాలలోని బాలబాలికల యూనిఫాం విషయంలో ఒక వినూత్న నిర్ణయాన్ని తీసుకొని అమలు పరుస్తున్నది. బాలబాలికలకు ఒకే తీరులో ఉన్న యూనిఫామ్‌ను ప్రవేశపెట్టి అన్ని వర్గాల నుంచి ప్రశంసలు పొందుతన్నది. ఎర్నాకుళం జిల్లాలోని పెరుమ్బవూర్ దగ్గరలో ఉన్న వలయన్చిరంగర ప్రభుత్వ దిగువ ప్రాథమిక పాఠశాల.. విద్యార్థులకు ఈ ఏకరీతి యూనిపామ్ను ప్రవేశపెట్టింది. ఈ పాఠశాలలో మొత్తం 754 మంది విద్యార్థులు ఉన్నారు. 'షర్ట్, మోకాలి వరకు ఉండే షార్ట్' ను బాలబాలికలనే తేడా లేకుండా విద్యార్థులందరూ ధరించేలా ఈ పాఠశాల నిర్ణయం తీసుకొని అమలుపరుస్తున్నది. కాగా, ఈ కొత్త డ్రెస్ కోడ్ ప్రణాళికకు 2018లోనే బీజం పడింది. కరోనా లాక్డౌన్ అనంతరం స్కూళ్లు తెరుచుకోవడంతో ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ యూనిఫామ్‌ను అందరు విద్యార్థులకూ వర్తింపజేశారు. ''విద్యార్థులు, తల్లిదండ్రులను నుంచి మద్దతు లభించింది. అందరు విద్యార్థులూ సమాన స్థాయి స్వేచ్ఛను పొందడానికి ఏకరీతి యూనిఫామ్‌కు మేము సంకల్పించాం'' అని ఈ నిర్ణయాన్ని తీసుకున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సంఘం (పీటీఏ) అధ్యక్షుడు వివేక్ తెలిపారు. కాగా, ఈ యూనిఫామ్ బాగున్నదని తల్లిదండ్రులు, బాలికలు తెలిపారు. కొత్త డ్రెస్‌కోడ్‌పై విద్యార్థులు ఆనందంగా ఉన్నారనీ, ముఖ్యంగా ఈ యూనిఫామ్ బాలికలకు చాలా సౌకర్యవంతంగా ఉంటుందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కే.పీ సుమ వెల్లడించారు. కాగా, పాఠశాల తీసుకున్న చర్య ప్రశంసనీయమైనదని ఆ రాష్ట్ర సాధారణ విద్యా మంత్రి వీ. శివన్కుట్టి పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ట్వీట్ చేశారు. బాల, బాలికలకు ప్రత్యేక పాఠశాలలు ఉండాలా? లేదా? అన్న అంశంపై సమాజంలో చర్చ జరగాల్సిన అవసరమూ ఉన్నదని వివరించారు.