Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిమాండ్లు ఇంకా మిగిలే ఉన్నాయి
- ఉద్యమం కొనసాగుతుంది
- లక్నో కిసాన్ మహా పంచాయత్‌లో ఎస్కేఎం నేతలు స్పష్టం
- మోడీకి రైతుల బలమైన సందేశం
- ఎస్కేఎం నేతలకు ఘన స్వాగతం
న్యూఢిల్లీ : తమ డిమాండ్లు ఇంకా మిగిలే ఉన్నాయనీ, అన్నీ డిమాండ్లూ పరిష్కారమయ్యేవరకూ ఉద్యమం ఆగదని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నేతలు స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఎకోగార్డెన్ (పాత జైలు) బంగ్లా బజార్లో కిసాన్ మహా పంచాయత్ సోమవారం జరిగింది. వేలాది మంది రైతులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. ఎస్కేఎం నేతలు రాకేష్ టికాయత్, హన్నన్ మొల్లా, అశోక్ ధావలే, బల్బీర్ సింగ్ రాజేవాల్, డాక్టర్ దర్శన్ పాల్, జగ్జిత్ సింగ్ దల్లేవాల్, జోగిందర్ సింగ్ ఉగ్రహన్, యుధ్వీర్ సింగ్, యోగేంద్ర యాదవ్ తదితరులు హాజరయ్యారు. అలాగే లఖింపూర్ ఖేరీ రైతుల ఊచకోతలో అమరవీరుల కుటుంబ సభ్యులు కూడా వేదికను పంచుకున్నారు. అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించారు. కిసాన్ మహా పంచాయత్ ద్వారా ప్రధాని మోడీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్‌కు రైతులు బలమైన సందేశం పంపారు. లక్నోలో అడుగుపెట్టిన పలువురు నేతలకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఎస్కేఎం నేతలు మాట్లాడుతూ ఎంఎస్పీ హామీ చట్టం, విత్తన బిల్లు, పాలసీ వంటి అనేక సమస్యలు ఇంకా పరిష్కారం కానందున ఆందోళన ఆగదని స్పష్టం చేశారు. ప్రభుత్వం తమతో చర్చలు జరపాలనీ, లేకుంటే తాము ఇండ్లకు వెళ్ళబోమని స్పష్టంచేశారు. మూడు చట్టాలను రద్దు చేస్తామని ప్రధాని మోడీ ప్రకటించటం.. రైతుల మొదటి విజయం మాత్రమేననీ, రైతులకు సంబంధించిన అనేక డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉన్నాయనీ, వాటికి చాలా తక్కువ ప్రాధన్యత ఇస్తున్నదని చెప్పారు. ఏడాదికాలంగా దృఢమైన, ఐక్యంగా పోరాడిన దేశంలోని రైతులు, కార్మికులను ఎస్కేఎం నేతలు అభినందించారు. అదే స్ఫూర్తితో పోరాటాన్ని కొనసాగించాలని కోరారు. రైతులకు చెరకు బకాయిలు చెల్లించకపోవడంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లఖింపూర్ ఖేరీ రైతుల ఊచకోతలో ఏదైనా న్యాయం జరగాలంటే అజరు మిశ్రా తేనిని అరెస్టు చేసి బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉందని నాయకులందరూ డిమాండ్ చేశారు. మన ఆహారం, వ్యవసాయ వ్యవస్థలపై కార్పొరేట్ నియంత్రణను వెనక్కి నెట్టామనీ, ఇప్పటివరకు ఉద్యమం ద్వారా ఉద్భవించిన చైతన్యం, శక్తులను నిలబెట్టడానికి పౌరులు అదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు.
యువ ఇంజనీర్ నాగరాజ్‌కు ఎస్కేఎం, ఏఐకేఎస్ ఘన స్వాగతం
కర్నాటకకు చెందిన యువ ఇంజనీర్ కె నాగరాజ్ 185 రోజుల పాటు 5,100 కిలోమీటర్లు నడిచి ఢిల్లీకి చేరుకున్నారు. కర్నాటకలోని ఎంఎం హిల్స్ నుంచి సింఘూ సరిహద్దు వరకు ఒక్కడే పాదయాత్ర నిర్వహించాడు. ఆయనకు సింఘూ వద్ద ఘన స్వాగతం పలికారు. అతను మొదట కర్నాటకలోని 31 జిల్లాలను తిరిగి, ఆపై ఢిల్లీకి బయలుదేరాడు. యాత్ర పొడవునా ఆయన రైతుల నిరసన సందేశాన్ని ప్రతిచోటా ప్రచారం చేశారు. రైతుల పోరాటాన్ని ప్రచారం చేసే మార్గంలో లెక్కలేనన్ని సభలు నిర్వహించారు. రైతులకు అతని స్ఫూర్తిని, మద్దతును తెలియజేశారు. దారిలో ఉండగానే అతని తల్లి చనిపోయింది. అతను ఆమె అంత్యక్రియల కోసం ఇంటికి తిరిగి వెళ్ళాడు. అతను వదిలిపెట్టిన చోటు నుంచి తిరిగి తన కవాతును కొనసాగించాడు. అతని కష్టతరమైన ప్రయాణంలో అనేక రైతు, కార్మిక సంఘాలు ఆయనకు మద్దతుగా నిలిచాయి. ఏఐకేఎస్ అధ్యక్షుడు అశోక్ ధావలే, ఆర్థిక కార్యదర్శి పి. కృష్ణప్రసాద్, హర్యానా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇందర్జిత్ సింగ్, హర్యానా రాష్ట్ర కార్యదర్శి సుమిత్లతో కూడిన ఏఐకేఎస్ నాయకత్వం సింఘూ సరిహద్దులో కె నాగరాజ్‌ను కలుసుకుని, ఆయనను సత్కరించి, బస, భోజన ఏర్పాట్లు చేసింది. సోమవారం రోజు లక్నో కిసాన్ మహాపంచాయత్‌కు హాజరయ్యేందుకు అమృత్సర్ నుంచి లక్నో వరకు సైకిల్ తొక్కిన జగదీష్ సింగ్‌కు కూడా ఎస్కేఎం సెల్యూట్ చేస్తుంది.