Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోజికోడ్ : హలాల్ విధానంపై కేరళ బీజేపీ విష ప్రచారం వ్యాప్తి చేస్తోంది. త్రిపుల్ తలాఖ్ మాదిరిగానే హలాల్ కూడా చెడు సాంప్రదాయమని తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేరేళ బీజేపీ జనరల్ సెక్రెటరీ పి. సుధీర్ పేర్కొన్నారు. హలాల్ విధానంపై విజయన్ ప్రభుత్వం నిషేధం విధించాలని బీజేపీ డిమాండ్ చేసింది. అలాగే రెస్టారెంట్లలో హలాల్ అనే బోర్డులపై కూడా నిషేధం విధించాలని కోరింది. మాంసాహారంతో పాటు అటువంటి ఆహరాలను అందించే రెస్టారెంట్ల వ్యాపారాలను లక్ష్యంగా చేసుకుని సోషల్‌మీడియాలో ఆర్ఎస్ఎస్ చేస్తున్న విమర్శలకు వ్యతిరేకంగా వ్యాపారులు ప్రదర్శనలు చేపడుతున్న సమయంలోనే బీజేపీ ఈ డిమాండ్ చేయడం గమనార్హం. కొన్ని హోటల్స్, రెస్టారెంట్లపై మతపరమైన, తప్పుడు ప్రచారాలకు పాల్పడుతన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలతో పాటు కేరళ హోటల్స్, రెస్టారెంట్స్ అసోసియేషన్ (కెహెచ్ఆర్ఎ) డిమాండ్ చేస్తోంది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కి రెస్టారెంట్ల యజమానుల సంఘం లేఖలు రాసింది. ప్రజల మధ్య విభజనలు సృష్టించాలన్న ఆర్ఎస్ఎస్ యత్నాల ఫలితమే ప్రస్తుత ఈ వివాదమని అధికార సీపీఐ(ఎం) సీనియర్ నేత కొడియేరి బాలకృష్ణన్ పేర్కొన్నారు. విభిన్న కమ్యూనిటీల మధ్య విభజన సృష్టించడం బిజెపి లక్ష్యంగా ఉందని, ఈవిధమైన ప్రచారాలు కేరళ రాష్ట్రానికి మంచివి కావని అన్నారు. అలాగే కేరళలో ఇలాంటి యత్నాలు విజయవంతం కాలేవని స్పష్టం చేశారు. సోషల్‌మీడియాను దుర్వినియోగం చేస్తూ, ఇస్లామిక్ పదాలను తప్పుగా అన్వయిస్తూ రాష్ట్రంలో ఇటువంటి మతపరమైన ప్రచారాలకు గతంలోనూ జరిగాయి. గతేడాది కూడా హలాల్ చేసిన ఆహారాలను వ్యతిరేకించాలంటూ ప్రదర్శనలు .జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా హలాల్ ధృవీకరించబడిన ఆహార, పానీయాల పరిశ్రమల నుండి ఎగుమతుల్లో భారత్ ప్రముఖ స్థానంలో ఉంది. ముస్లిమేతరులు అధికంగా కలిగిన దేశాలైన బ్రెజిల్, ఆస్ట్రేలియాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.