Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎయిర్టెల్ బాటలో వీఐ
- టారిఫ్‌ల్లో 25 శాతం పెంపు
న్యూఢిల్లీ : ప్రయివేటు టెలికం కంపెనీలు వినియోగదారుల నడ్డివిరిచే పనిలో పడ్డాయి. ఇప్పటికే ఇంధన, వంటగ్యాస్, కూరగాయలు సహా నిత్యావసరాల ధరలతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న ప్రజలపై తాజాగా మొబైల్ చార్జీల మోత మొదలైంది. భారతీ ఎయిర్టెల్ మొబైల్ టారీఫ్‌ల పెంపు ప్రకటన చేసిన మరోసటి రోజే వొడాఫోన్ ఐడియా (వీఐ) కూడా అదే తరహా నిర్ణయం తీసుకుంది. తమ నెట్వర్క్ ప్రీపెయిడ్ చార్జీలను 20-25 శాతం పెంచుతున్నట్లు మంగళవారం వెల్లడించింది. పెంచిన చార్జీలు ఈ నెల 25వ తేది నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. టాప్అప్ చార్జీలను 19-21 శాతం మేర పెంచింది. నూతన టారీఫ్‌ల వల్ల వినియోగదారుల నుంచి సగటు రాబడి (ఏఆర్పీయూ) పెరగనుందని వీఐ ఓ ప్రకటనలో తెలిపింది. వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్ మొత్తం ఖాతాదారుల్లో 90-95 శాతం మంది ప్రీపెయిడ్ ఖాతాదారులు ఉన్నారు. ఎయిర్‌టెల్‌కు ప్రతీ వినియోగదారుడి నుంచి సగటు రాబడి రూ.153గా ఉండగా, జియోకు రూ.143, వీఐకి 109 చొప్పున ఉంది. వీఐ మారిన చార్జీల ప్రకారం.. ప్రస్తుతం 28 రోజుల గడువుతో రూ.79గా ఉన్న కనీస వాయిస్ ప్లాన్ ధరను ఇకపై రూ.99 చేర్చింది. రూ.149 ప్లాన్‌కు రూ.179 చెల్లించాల్సి ఉంటుంది. రూ.219 ప్లాన్ ధరను రూ.269కి చేర్చింది. రూ.599 ప్యాక్ రూ.719కి పెంచింది. ఎయిర్టెల్ నవంబర్ 26 నుంచి ప్రీపెయిడ్ ప్లాన్లపై టారీఫ్‌లను 20-25 శాతం పెంచనున్నట్లు ఇంతక్రితం రోజే ప్రకటించింది. దీంతో వినియోగదారుల నుంచి సగటు రాబడి (ఏఆర్పీయూ)ని భారీగా పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. చార్జీల పెంపునతో వినియోగదారుడి నుంచి కనీసం రూ.200 ఏఆర్పీయూను రాబట్టుకోవాలని అంచనా వేస్తోంది. ఇప్పటి వరకు రూ.79కే 28 రోజుల గడువుతో అందిస్తున్న బేసిక్ ప్లాన్ ధరను రూ.99కి పెంచింది. రూ.149 ప్లాన్‌ను రూ.179కి, 219 ప్లాన్‌ను 265కు, రూ.399 ప్లాన్‌ను రూ.479కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అన్ని ప్లాన్ల ధరలను అమాంతం పెంచేసింది. ఎయిర్టెల్, విఐ బాటలోనే ఇక రిలయన్స్ జియో కూడా చార్జీల పెంపు ప్రకటన చేయొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.