Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడ్జెట్లో కేటాయింపులు పెంచాలి
- మరింత ఉపాధిని సృష్టించాలి
- 'ఉపాధి హామీ'పై ఎన్ఆర్ఈజీఏ సంఘర్ష్ మోర్చా డిమాండ్లు
న్యూఢిల్లీ : కేంద్రం ప్రభుత్వ పథకం 'మహత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లారుమెంట్ గ్యారెంటీ యాక్ట్ (ఎంజీఎన్ఆర్ఈజీఏ)' గత కొన్ని నెలలుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నది. మోడీ సర్కారు తీరుతో ఈ చట్టం కింద లబ్దిదారులకు సరైన ఉపాధి హామీ లభించడం లేదు. సరిపడా నిధులు లేకపోవడం, లబ్దిదారులకు వేతనాలు చెల్లించలేకపోవడం, చెల్లింపుల్లో కులాల కేటగిరి వంటివి ఎంజీఎన్ఆర్ఈజీఏ కలిగి ఉన్న సమస్యల్లో ప్రధానమైనవి. దీంతో ఈ పథకం అమలు విషయంలో ఎన్ఆర్ఈజీఏ సంఘర్ష్ మోర్చా ఆందోళన వ్యక్తం చేస్తున్నది.
వేతనాలెప్పుడిస్తరో..!
కేంద్రం ఇప్పటికే లబ్దిదారుల చెల్లించాల్సిన వేతనాల మొత్తం రూ. 5వేల కోట్లకు పైగా ఉన్నది. అయితే, పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని సంఘర్ష్ మోర్చా కేంద్రాన్ని డిమాండ్ చేసింది. పెండింగ్ వేతనాల విషయంలో కేంద్రం నుంచి ఏపీకి అత్యధికంగా రూ. 801 కోట్లు రావాల్సి ఉన్నది. ఇక, తెలంగాణకు కేంద్రం రూ. 22.9 కోట్ల బకాయిలను విడుదల చేయాల్సి ఉన్నది. అలాగే, మరింత ఉపాధిని కల్పిస్తూ మరిన్ని నిధులను ఈ పథకానికి కేటాయించాలని సంఘర్ష్ మోర్చా తెలిపింది. ఉపాధి హామీ చట్టానికి మోడీ సర్కారు నిధుల కేటాయింపులను తగ్గించడంపై మోర్చా ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారి విజృంభించిన 2020లో ఈ చట్టానికి అత్యధికంగా రూ. 1.11 లక్షల నిధులను కేంద్రం కేటాయించింది. అయితే, 2021-22 బడ్జెట్లో ఈ కేటాయింపులు దారుణంగా తగ్గి రూ. 73 వేల కోట్లకు పడిపోవటం గమనార్హం. అంతేకాదు, ఈ ఏడాది అక్టోబర్ నాటికి దేశంలోని 21 రాష్ట్రాలు ఎన్ఆర్ఈజీఏ నిధుల్లో నెగెటివ్ బ్యాలెన్స్‌ను చూశాయి. దీని మొత్తం రూ. 8,686 కోట్లు కావడం గమనార్హం.
అడుగంటిన నిధులు.. కార్మికులపై ప్రభావం
ఈ పథకం పని డిమాండ్‌ను చేరలేదని సంఘర్ష్ మోర్చా ఆరోపించింది. నిధులు పూర్తిగా అడుగంటిపోవడం దేశవ్యాప్తంగా ఈ పథకం కింద లబ్ది పొందుతున్న దాదాపు ఐదు కోట్ల మంది కార్మికులపై ప్రభావం చూపిందని తెలిపింది. '' క్షేత్రస్థాయిలో పనికి సంబంధించిన డిమాండ్, అవసరం పెరిగింది. ఈ పథకం నిధుల లేమితో సతమతమవుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకో ఐదు నెలలు మిగిలి ఉండగానే ఇప్పటికే 90 శాతానికి పైగా కేంద్ర బడ్జెట్ కేటాయింపులు అయిపోయాయి'' అని ఎన్ఆర్ఈజీఏ సంఘర్ష్ మోర్చా ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఈనెల 14 నాటికి దాదాపు రూ. 3.46 కోట్ల లావాదేవీలు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని ఇది హైలెట్ చేసింది. ఇప్పటికే నిధుల సమస్యను ఎదుర్కొంటున్న ఈ పథకంలో ఎస్సీ, ఎస్టీ, ఇతర కేటగిరీలుగా విభజిస్తూ వేతనాలు చెల్లించే అంశాన్ని మోర్చా తప్పుబట్టింది. ఇది కార్మికుల మధ్య అనవసర ఆందోళనలను తీసుకొస్తుందని వివరించింది. కాగా, రాష్ట్రాల నుంచి వచ్చిన ఫిర్యాదులతో పూర్వపు చెల్లింపులను పునరుద్ధరించడానికి కేంద్రం ఈనెల 1న నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.
బడ్జెట్లో 34 శాతం కోత
కాగా, పీపుల్స్ యాక్షన్ ఫర్ ఎంప్లారుమెంట్ గ్యారెంటీ (పీఏఈజీ) ప్రకారం.. గతేడాది సవరణ బడ్జెట్ కంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం బడ్జెట్ కేటాయింపులో 34 శాతం తగ్గుదల ఉండటం గమనార్హం. అలాగే, గత సంవత్సరాలతో పోల్చుకుంటే బకాయిలు రూ. 17,180 కోట్లుగా ( ఇది కేటాయించిన మొత్తం బడ్జెట్లో 23.53 శాతం) ఉండటం గమనార్హం.ఈ సమస్యల పరిష్కారం కోసం వివిధ రాష్ట్రాల్లోని ఎన్ఆర్ఈజీఏ సంఘర్ష్ మోర్చా నెట్వర్క్ (ఇందులో రైతులు, కార్మికులు, హక్కుల సంస్థల కార్యకర్తలూ ఉన్నారు) సంబంధిత రాష్ట్రాల సీఎంల వద్దకు ప్రతినిధుల బృందాన్ని పంపింది. పెండింగ్ వేతనాలను కేంద్రం వెంటనే విడుదల చేయడం, ఎన్ఆర్ఈజీఏ కింద మరింత ఉపాధిని సృష్టించడం కోసం అదనపు నిధులు కేటాయించడం, 2021-22 ఆర్థిక సంవత్సరంలో అర్హత ఉన్న ప్రతి ఇంటికీ 150 రోజుల పనిదినాలు కల్పించడం, కులం ఆధారిత చెల్లింపులను వెనక్కి తీసుకోవడం సంఘర్ష్ మోర్చా ప్రధాన డిమాండ్లు. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేలా చర్చలు జరపాలంటూ రాష్ట్రాలను ఈ నెట్వర్క్ కోరింది. కాగా, తాము ఎంతోకాలంగా వేచి చూస్తున్న ఈ డిమాండ్లను కేంద్రం పరిష్కరిస్తుందన్న ఆశతో తాము ఉన్నట్టు సంఘర్ష్ మోర్చా పేర్కొన్నది.