Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం వద్ద ప్రయివేట్ హాస్పిటల్స్ లాబీయింగ్!
- పెరిగిన వ్యాక్సిన్ నిల్వలు..దగ్గరపడిన వాటి ఎక్స్పైరీ డేట్
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ప్రయివేటు హాస్పిటల్స్ వద్ద కరోనా వ్యాక్సిన్ నిల్వలు పేరుకుపోతున్నాయి. వయోజనులు గానీ, వృద్ధులుగానీ వ్యాక్సిన్ కోసం ప్రయివేటును సంప్రదిస్తున్న వారి సంఖ్య తగ్గుముఖం పట్టింది. మరోవైపు ప్రయివేటు వద్ద ఉన్న టీకా నిల్వల ఎక్స్పైరీ డేట్ (తుది గడువు) త్వరలో ముగియనున్నది. తుది గడువు ముగిసి.. టీకాలు వృధా అయితే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుందని..ప్రయివేటు హాస్పిటల్స్ కొత్త ఎత్తుగడ వేస్తున్నాయి. బూస్టర్ డోసులు ఇవ్వడానికి అనుమతి ఇవ్వాలని ప్రయివేట్, కార్పోరేట్ హాస్పిటల్స్ మోడీ సర్కార్‌తో లాబీయింగ్ చేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఒక్క మహారాష్ట్రలోనే ప్రయివేట్ హాస్పిటల్స్ కొనుగోలు చేసిన 50లక్షల వ్యాక్సిన్ డోసుల తుది గడువు త్వరలో ముగియనున్నది. ముంబయిలోని ప్రయివేట్ హాస్పిటల్స్ వద్ద దాదాపు 19 లక్షల డోసులు, పూణెలో 20.48లక్షల డోసుల తుది గడువు దగ్గరపడింది. దేశంలో మిగతా రాష్ట్రాల్లోని ప్రయివేటు హాస్పిటల్స్‌ను కూడా లెక్కలోకి తీసుకుంటే వ్యాక్సిన్ నిల్వలు భారీగా పేరుకుపోయాయని తెలుస్తోంది. ఢిల్లీ, హైదరాబాద్, బెంగుళూర్..ఇతర నగరాల్లో ప్రయివేటు హాస్పిటల్స్ ఆందోళన చెందుతున్నాయి. వీటివద్ద ఉన్న వ్యాక్సిన్ నిల్వల తుది గడువు వచ్చే ఏడాది జనవరి-మార్చి మధ్య ముగియనున్నది. భారత్‌లో కోవిడ్-19 నియంత్రణకు స్పుత్నిక్, కోవిషీల్డ్, కోవాక్సిన్లు వాడుతున్నారు. ఇందులో స్పుత్నిక్ వ్యాక్సిన్‌ను ఆరు నెలల్లోపు ఉపయోగించాలి. కోవిషీల్డ్‌ను 9 నెలల్లోగా, కోవాక్సిన్‌ను ఒక ఏడాదిలోగా వాడాలి. ఏ వ్యాక్సిన్ అయినా రెండు డోసుల్లో ఇవ్వడానికి మాత్రమే భారత్‌లో అనుమతిస్తున్నారు. అయితే 40కిపైగా దేశాల్లో బూస్టర్ డోసు(మూడో డోస్) మొదలైంది. కరోనా వైరస్ మరోసారి విజృంభించినా అడ్డుకునేందుకు అనేక దేశాలు బూస్టర్ డోసుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే ఈ విధానాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ తప్పుబడుతోంది.
ముందుగా హైరిస్క్ ఉన్న ప్రాంతాల్లో, హైరిస్క్ ఉన్న ప్రజలకు వ్యాక్సినేషన్ పెంచాలని డబ్ల్యూహెచ్ఓ గట్టిగా చెబుతోంది. ఇప్పుడు బూస్టర్ డోస్ ఇవ్వటం మొదలైతే, పేద దేశాల్లో వాక్సినేషన్ ప్రక్రియ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేసింది. పేద దేశాల్లో మొదటి డోస్ పంపిణీతో పోల్చితే ధనిక దేశాల్లో బూస్టర్ డోస్ పంపిణీ ఆరు రేట్లు ఎక్కువగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్‌లో వయోజనుల్లో రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకోవాల్సినవారు 60శాతం ఉన్నారు. ఇదిలా ఉండగా ప్రయివేటు హాస్పిటల్స్ బూస్టర్ డోస్‌కు వెళ్లటం ఏంటని విమర్శలు వస్తున్నాయి.