Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీలోనే సీఎం కేసీఆర్, మంత్రులు
- యాసంగి లో పండే బాయిల్డ్ రైస్ కొనమన్న కేంద్రం
- బాయిల్డ్ రైస్ కనుమరుగేనా..?
న్యూఢిల్లీ : ధాన్యం సేకరణపై కేంద్రం తేల్చటంలేదు. వానాకాలంలో వరి ధాన్యం సేకరణపై కూడా మోడీ ప్రభుత్వం నాన్చు తూనే ఉన్నది. ఇప్పటికే యాసంగిలో పండే బాయిల్డ్ రైస్ కొనమని కేంద్రం స్పష్టం చేసింది. ఈ ప్రకటనతో బాయిల్డ్ రైస్ చరిత్రలో కనుమరుగేనా..అన్న చర్చకు దారితీసింది. ఇక సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు..ఢిల్లీలో మకాం వేసిన రాష్ట్రమంత్రులు.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్., కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూశ్ గోయెల్ లతో విడి విడిగా భేటీ అయ్యారు. రాష్ట్ర మంత్రులు కేటీఆర్,నిరంజన్ రెడ్డి, గంగుల కమాలకర్రెడ్డితో పాటు పదిమంది ఎంపీలు, సీఎస్ సోమేశ్ కుమార్తో పాటు పలువురు ఉన్నతాధికారుల బృందం దాదాపు మూడున్నర గంటల పాటు సుధీర్ఘంగా చర్చించారు.
అయితే ధాన్యం సేకరణపై కేంద్రం ఎటూ తేల్చకుండా., తిరిగి ఈనెల 26 వ తేదీన సమావేశమవుదామని హామీ ఇచ్చింది. అయితే రాష్ట్రంలో ఇప్పటికే సాగైన వానాకాలం వరిధాన్యం కొనుగోలు చేయాలనీ, రానున్నయాసంగి వరిధాన్యం కొనుగోలు విషయం పై ముందుగానే స్పష్టతనివ్వాలని కోరుతూ రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు తదితర వ్యవసాయం సంబంధిత అంశాలపై పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆధర్యంలో బృందం కేంద్రమంత్రుల వద్ద ఏకరువు పెట్టింది. తెలంగాణ రైతు ఈ వానాకాలం లో పండించిన వరిధాన్యం కొనుగోలు అంశం పై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి స్పష్టతనివ్వలేదు.మరోవైపు వచ్చే యాసంగి బాయిల్డ్ రైస్ ను కొనబోమని మరోసారి కరాఖండిగా తేల్చి చెప్పింది. మామూలు బియ్యాన్ని ఎంతకొంటామనే విషయాన్ని ఈనెల 26 వతేదీన స్పష్టం చేస్తామని కేంద్రం మంత్రులు తెలిపారు.