Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 146 కోట్ల బిడ్‌తో మూతపడ్డ హెచ్‌ఎన్‌ఎల్ టేకోవర్
- వచ్చేఏడాది నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తాం : మంత్రి పి.రాజీవ్
తిరువనంతపురం: రుణ భారాలు అధికం కావడం, ప్రభుత్వంపై భారం పడుతున్న దన్న కారణాలతో మోడీ సర్కారు కేంద్ర యాజమాన్యంలోని ప్రభుత్వ రంగ సంస్థలను (పీఎస్‌యూ) ప్రయివేటీకరణ పేరుతో వదిలించుకుంటున్నది. దీనికి అనుగుణంగా ఇటీవల ఓ ప్రణాళిను రూపొందించి పలు ప్రభుత్వ సంస్థలను ప్రయివేటు పరం చేసింది. అయితే, సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని కేరళ సర్కారు మాత్రం ప్రభుత్వ రంగ సంస్థలకు అండగా నిలుస్తోంది. కేంద్రం ప్రభుత్వం వదిలించుకోవాలనుకుంటున్న ప్రభుత్వ రంగ సంస్థలకు చేయూత అందిస్తోంది. దీనికి అనుగుణంగానే వెల్లోర్లోని 700 ఎకరాల పారిశ్రామిక టౌన్‌షిప్‌లోని హిందూస్థాన్ న్యూస్ ప్రింట్ లిమిటెడ్ (హెచ్‌ఎన్‌ఎల్)ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ ఆమోదంతో రూ.146 కోట్ల బిడ్‌తో కేరళ టేకోవర్ చేసుకుంది. ఒకప్పుడు మెరుగైన లాభాలతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న హెచ్‌ఎన్‌ఎల్.. అసమర్థ పాలన, తత్ఫలితంగా ఆదాయ నష్టాల్లోకి జారుకుంది. దీంతో 2019 నుంచి కార్యకలాపాలు నిలిపివేసింది. ఎంతో మంది ఉపాధిపై ప్రభావం పడింది. ఇటీవలే కేరళ దీనిని స్వాధీనం చేసుకోవడంతో.. రాష్ట్ర అధికారులు ఈ యూనిట్ పునరుద్ధరణకు చర్యలు ప్రారంభించారు. ఇది 2022 జనవరి ప్రారంభం నుంచి కేరళ పేపర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (కేపీపీఎల్)గా తన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించనుంది. కేరళ పరిశ్రమల శాఖ మంత్రి పి.రాజీవ్ మాట్లాడుతూ.. కొత్త సంస్థ 46 నెలల్లో నాలుగు దశల్లో వివిధ కార్యకలాపాలను ప్రారంభిస్తుందని తెలిపారు. 'రాష్ట్ర ప్రభుత్వం మొదటి రెండు దశల్లో సుమారు రూ.125 కోట్లు పెట్టుబడి పెట్టనుండగా, రాబోయే రెండు దశల్లో రూ.1,600 కోట్ల మూలధన పెట్టుబడి అవసరం అవుతుంది. ఇది బ్యాంకుల నుంచి సేకరించబడుతుంది. నాలుగో దశ చివరిలో మొత్తం టర్నోవర్ రూ.2,600కోట్లుగా ఉంటుంది'' అనిమంత్రి వెల్లడించారు.