Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంతర్జాతీయంగా సంఘీభావ కార్యక్రమాలు
- షుగర్ మిల్లు ప్రారంభోత్సవానికి రావొద్దు : కేంద్ర మంత్రికి యూపీ రైతుల హెచ్చరిక
- రైతుల ఆందోళనలపై జీ న్యూస్ తప్పుడు కథనాలు
న్యూఢిల్లీ : దేశంలోని లక్షలాది మంది రైతులు 12 నెలల సుదీర్ఘమైన, నిరంతర పోరాటాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా నవంబర్ 26 జరగబోయే మొదటి వార్షికోత్సవ కార్యక్రమాలకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆ రోజు ఢిల్లీ చుట్టూ ఉన్న రైతు ఆందోళన శిబిరాలకు వేలాదిమంది రైతులు చేరుకోనున్నారు. ఢిల్లీకి దూరంగా ఉన్న రాష్ట్రాల్లోని రాజధాని నగరాల్లో ఇతర నిరసనలతో పాటు ట్రాక్టర్ ర్యాలీలు, ఎద్దుల బండ్లు ప్రదర్శనలు జరగనున్నాయి. ఆ రోజున రైతు ఉద్యమం పాక్షిక విజయాన్ని పురస్కరించుకుని, మిగిలిన డిమాండ్లను స్పష్టంచేయనున్నది. ఉద్యమ అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. లక్నో కిసాన్ మహా పంచాయత్ ద్వారా బీజేపీకి చాలా స్పష్టమైన సందేశం ఇచ్చామని ఎస్కేఎం పేర్కొంది. రైతుల డిమాండ్లను నెరవేర్చక పోతే, రానున్న ఎన్నికల్లో బీజేపీకి ఓటువేయద్దని ఓటర్లను కోరతామని తెలిపింది. నవంబర్ 24న (నేడు) సంపూర్ణనగర్లో జరిగే షుగర్ మిల్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనవద్దనీ, ఈ కార్యక్రమం నుంచి వైదొలగాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా తేనికి రైతులు హెచ్చరించారు. లక్నోలో కేంద్ర మంత్రి అజరు మిశ్రా కార్యక్రమంలో పాల్గొంటే, రైతులు తమ చెరకును చక్కెర కర్మాగారాలకు తీసుకెళ్లడం మానేస్తామని, బదులుగా వాటిని జిల్లా కలెక్టర్ (డీఎం) కార్యాలయాలకు తీసుకెళతారని హెచ్చరించారు.
అంతర్జాతీయంగా..
ప్రవాస భారతీయులతో పాటు అంతర్జాతీయ రైతు సంఘాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా సంఘీభావ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నవంబర్ 26న మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు లండన్‌లోని భారత హైకమిషన్ వద్ద నిరసన ప్రదర్శన జరగనుంది. అదే రోజు రాత్రి వాంకోవర్‌లో స్లీప్-అవుట్‌తో పాటు కెనడాలోని సర్రేలో స్లీప్-అవుట్ ఉంటుంది. నవంబర్ 30న ఫ్రాన్స్‌లోని పారిస్‌లో నిరసన ప్రదర్శన జరగనుంది. డిసెంబర్ 4న కాలిఫోర్నియాలో కార్ల ర్యాలీ, అమెరికాలోని న్యూయార్క్‌లో సిటీ మార్చ్ నిర్వహిస్తున్నారు. అదే రోజు శాన్ జోస్ గురుద్వారాలో సంస్మరణ, కొవ్వొత్తుల ప్రదర్శన కూడా జరుగుతుంది. డిసెంబరు 5న నెదర్లాండ్స్‌లో ఆందోళన కార్యక్రమం, డిసెంబర్ 8న ఆస్ట్రియాలోని వియన్నాలో ఆందోళన జరుగుతుంది. ఆస్ట్రేలియాతో పాటు యూఎస్ఏలోని వాషింగ్టన్, టెక్సాస్ వంటి ఇతర ప్రదేశాలలో సంఘీభావ ఆందోళనలు జరుగుతాయి.
జీ న్యూస్ తప్పుడు కథనాలు
న్యూస్ బ్రాడ్‌కాస్టింగ్, డిజిటల్ స్టాండర్డ్స్ అథారిటీ (ఎన్బీడీఎస్ఏ) విడుదల చేసిన రిపోర్టు ప్రకారం వార్తా ఛానెల్ జీ న్యూస్ తాను ప్రసారం చేసిన మూడు వీడియోలలో నైతిక నియమావళిని ఉల్లంఘించిందనీ, అందులో రైతుల నిరసనలను ఖలిస్తానీలతో ముడిపెట్టి ఉందని స్పష్టం అయింది. ఎర్రకోటపై జాతీయ జెండాను తొలగించినట్టు జీ న్యూస్ తప్పుడు కథనాన్ని ప్రచురించిందని అథారిటీ పేర్కొంది. అథారిటీ బ్రాడ్‌కాస్టర్‌కు తన అసమ్మతిని తెలియజేసి, వీడియోను వెంటనే తొలగించాలని కోరింది. కొన్ని మీడియా ఛానెల్‌లు నిరసన తెలిపే రైతులకు వ్యతిరేకంగా తమ పక్షపాత ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయనీ, ఏ ఛానెల్‌లను విశ్వసించాలో, ఏది నమ్మకూడదో తెలిసిన వివేకం గల వీక్షకులకు ఎస్కేఎం కృతజ్ఞతలు తెలిపింది.
విభజించే కుట్ర...
రైతులను విభజించేందుకు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయని ఎస్కేఎం పేర్కొంది. శ్రామిక వర్గానికి వ్యతిరేకంగా రైతులను ఇరికించాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నదని విమర్శించింది. మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలనీ, అలాగే విద్యుత్ సవరణ బిల్లు ముసాయిదాను ఉపసంహరించుకోవాలని తమ డిమాండ్ సామాన్య పౌరులను దృష్టిలో ఉంచుకుని చేసిందని ఎస్కేఎం స్పష్టంచేసింది. ఆహార ధరలను అందుబాటులోకి తీసుకురావాలనీ, ప్రజా పంపిణీ వ్యవస్థను కాపాడాలని రైతులు కూడా కోరారని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలనీ, ప్రయివేటీకరణ డ్రైవ్‌కు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాల డిమాండ్‌కు ఎస్కేఎం మద్దతు ఇచ్చిందని తెలిపింది. కార్మికులపై రైతులను ఉసిగొల్పిందుకు చేస్తున్న దుశ్చర్యలు విఫలం అవుతాయని ఎస్కేఎం స్పష్టం చేసింది. ఉద్యమంలో ఉన్న రైతులందరూ తమ ప్రతిఘటనను శాంతియుతంగా కొనసాగించాలని ఎస్కేఎం విజ్ఞప్తి చేసింది.