Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రపతి చేతులు మీదుగా అవార్డును అందుకున్న భార్య సంతోషి, తల్లి మంజుల
న్యూఢిల్లీ : కల్నల్ బి.సంతోష్ బాబు (మరణానంతరం)కు మహావీర చక్ర అవార్డును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇచ్చారు. తెలంగాణ లోని సూర్యాపేట పట్టణానికి చెందిన సంతోష్ బాబు 2020 జూన్ 15న గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందారు. ఆ ఘటనలో సంతోష్‌తో సహా 21 మంది సోల్జర్లు వీరమరణం పొందారు. సంతోష్ బాబు మరణానంతరం కేంద్రప్రభుత్వం ఆయనకు మహావీర్ చక్ర పురస్కారం ప్రకటించింది. అవార్డును రాష్ట్రపతి చేతులు మీదుగా సంతోష్ బాబు భార్య సంతోషి, ఆయన తల్లి మంజుల అందుకున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన డిఫెన్స్ ఇన్వెస్టిచర్ సెర్మనీలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 2021 సంవత్సరానికి గాను గ్యాలంట్రీ అవార్డులు, విశిష్ట సేవా డెకరేషన్లను అందజేశారు. బీహార్ రెజిమెంట్ (మరణానంతరం) 16వ బెటాలియన్ కల్నల్ బికుమళ్ల సంతోష్ బాబు ఆదర్శప్రాయమైన నాయకత్వాన్ని, చురుకైన వత్తి నైపుణ్యాన్ని ప్రదర్శించాడని రాష్ట్రపతి ట్విట్టర్లో పేర్కొన్నారు. అతను ప్రస్ఫుటమైన ధైర్యాన్ని ప్రదర్శించారనీ, దేశం కోసం అత్యున్నత త్యాగం చేశాడని తెలిపారు. ఆపరేషన్ స్నో లియోపార్డ్ సమయంలో గాల్వాన్ వ్యాలీ (తూర్పు లడఖ్)లో మోహరించిన 16 బీహార్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ బికుమల్ల సంతోష్ బాబు శత్రువులను ఎదుర్కొనేందుకు ఒక అబ్జర్వేషన్ పోస్ట్‌ను ఏర్పాటుచేసే పనిలో ఉండగా... ప్రత్యర్థుల నుంచి గట్టి ప్రతిఘటనను ఎదురైంది. తీవ్రంగా గాయపడినా... ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆయన ముందుండి నడిచారు. శత్రు సైనికుల దాడిని ఆయన తుది శ్వాస వరకూ ధైర్యంగా ఎదిరించారని రాష్ట్రపతి కొనియాడారు.