Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివక్షకు గురవుతున్న ముస్లింలు, దళితులు, ఆదివాసీలు
- ఆక్స్‌ఫాం ఇండియా సర్వే వెల్లడి
న్యూఢిల్లీ : ఈదేశంలో మతాన్ని, కులాన్నిబట్టి పౌరులకు ఆరోగ్యసేవలు దక్కుతున్నాయని, కరోనా సంక్షోభంలో పాలకులు తీసుకున్న చర్యలు 'ఇస్లామోఫోబియా'ను పెంచిందని 'ఆక్స్‌ఫాం ఇండియా' సర్వే పేర్కొన్నది. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో తాము వివక్షను ఎదుర్కొన్నామని సర్వేలో పాల్గొన్న 33శాతం ముస్లింలు, 20శాతానికిపైగా దళితులు, ఆదివాసీలు చెప్పారు. దేశంలోని 28 రాష్ట్రాలు, ఐదు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ఏడాది ఫిబ్రవరి-ఏప్రిల్ మధ్య సర్వే నిర్వహించామని 'ఆక్స్‌ఫాం ఇండియా' పేర్కొన్నది. 'సెక్యూరింగ్ రైట్స్ ఆఫ్ పేషెంట్ ఇన్ ఇండియా' పేరుతో సర్వే నివేదికను విడుదల చేసింది. సర్వేలో మొత్తం 3890 మంది నుంచి వివరాలు సేకరించారు. కర్నాటకకు చెందిన 28శాతం మంది, గుజరాత్‌కు చెందిన 24శాతం మంది, మహారాష్ట్రకు చెందిన 21శాతం మంది, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖాండ్, రాజస్థాన్‌కు చెందిన 20శాతం మంది భాషాపరమైన వివక్షను ఎదుర్కొన్నామని చెప్పారు. వలసదారులపై విద్వేషం వల్లే వైద్య నిపుణుల నుంచి వివక్షను ఎదుర్కొన్నామని అన్నారు. ముంబయి మహానగరంలో మత వివక్ష ఎంత బలంగా ఉందన్న విషయాన్ని ఈ సర్వే వెలుగులోకి తీసుకొచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ దళితుల పట్ల అంటరానితనం చూపుతున్నారని, కొన్ని ప్రయివేట్ క్లీనిక్స్ దళితులకు చికిత్స చేయడానికి నిరాకరిస్తున్నాయని సర్వే పేర్కొన్నది. ఆరోగ్య సేవల్లో తాము వివక్షకు గురవుతున్నామని 21శాతం దళితులు చెప్పారు.