Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడాది నిరసనలతో హక్కులపై రైతులకు పెరిగిన అవగాహన
- ఎంఎస్పీ, పంట కొనుగోలు, ప్రభుత్వాల తీరుపై వచ్చిన స్పష్టత
- ఇదంతా వ్యతిరేక విధానాలు అవలంభించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కారణంగానే : యూపీ రైతులు
న్యూఢిల్లీ : వివాదాస్పద సాగు చట్టాల రద్దు, కనీసం మద్దతు ధర (ఎంఎస్పీ) కు చట్టబద్దమైన హమీ కోసం రైతన్నలు ఏడాది పాటు నిరసనలు చేశారు. దేశ రాజధాని న్యూఢిల్లీకి వెళ్లే మూడు ప్రధాన పాయింట్లను బ్లాక్ చేస్తూ వారు తమ ఆందోళనలను కొనసాగించారు. దేశంలోని ప్రజలు, కార్మికులు, విద్యార్థులు, మేథావులు, రాజకీయ నాయకులు.. ఇలా ప్రతీ వర్గం నుంచీ రైతుల ఆందోళనకు మద్దతు లభించింది. గతేడాది నవబంర్ 26 నుంచి దేశవ్యాప్తంగా రైతన్నలు శాంతియుతంగా నిరసనలు చేస్తూ వచ్చారు. అయితే, యూపీ ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో మోడీ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మరో దారి లేకపోవడంతో ఆ మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని ఈనెల 19న మోడీ ప్రకటించారు. అయితే, పార్లమెంటులో చట్టాలను రద్దు చేసేవరకు, ఎంఎస్పీపై స్పష్టతతో పాటు మరికొన్ని డిమాండ్లు నెరవేరేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని అన్నదాతలు స్పష్టం చేసిన విషయం విదితమే.
ఐకమత్యంగా పోరాడిన రైతులు తమ నిరసనలతో మోడీ ప్రభుత్వాన్ని మెట్టు దిగేలా చేయడంలో సఫలీకృతులయ్యారు. అలాగే, ఏడాది పాటుగా సాగిన ఈ నిరసనలు అన్నదాతల్లో పలు అంశాలపై అవగాహనను పెంచాయి. తమ హక్కుల గురించి తెలిసేలా చేశాయి. ముఖ్యంగా, ఎంఎస్పీ అంటే కూడా తెలియని రైతులకు అది తమ హక్కు అని తెలిపింది ఏడాది పాటుగా సాగిన ఆందోళనలే. ఈ విషయాన్ని ఏడాదిపాటుగా నిరసనల్లో పాల్గొన్న అనేక మంది యూపీ రైతులు వెల్లడించారు. పంటకు పెట్టే పెట్టుబడి, ఎకరాకు అయ్యే ఖర్చు, కనీస మద్దతు ధర, బహిరంగ మార్కెట్ ధర, పంట నష్టం అంచనా, ఏపీఎంసీలకు బయట సాధారణ మార్కెట్లలో రేటు.. ఇలా పలు విషయాల్లో కచ్చితమైన గణాంకాలను ఇప్పుడు రైతులు చెప్పగలుగుతున్నారు. అయితే, ఏడాది పాటు సాగిన నిరసనలే తమకు ఈ విషయాల గురించి తెలిసేలా చేశాయని రాంపూర్ జిల్లా బిలాస్పూర్ బ్లాక్‌కు చెందిన రైతు హరీందర్‌సింగ్ తెలిపారు. పంటను ప్రభుత్వాలు కొంటాయనీ, ఇది ప్రతి రైతు హక్కు అని తెలుసుకున్నామని ఆయన అన్నారు.
రైతు నిరనల కారణంగా ప్రస్తుత ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు తమకు తెలిశాయని గుర్జీత్ సింగ్ అనే రైతు వెల్లడించారు. '' సాధారణంగా వ్యవసాయం అంటే నష్టదాయకమైన వ్యాపారమనే భావన అందరిలో ఉండేది. అయితే, అది వాస్తవం కాదనీ, దాన్ని పాలక ప్రభుత్వాలు అలా తయారు చేశాయనే విషయాన్ని ఇప్పుడు ప్రతి ఒక్కరూ సమగ్రంగా వివరిస్తారు. ఇదంతా ప్రస్తుత ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల కారణంగానే '' అని ఆయన ఆరోపించారు.
వ్యవసాయాన్ని క్రమక్రమంగా నష్టదాయకమైన వ్యాపారంగా ఎలా చేశారు? ఎంఎస్పీ అంటే ఏమిటీ ? రైతులను కార్పొరేట్ల కూలీలుగా మార్చే ప్రయత్నాలు.. ఇలా పలు అంశాలను ఏడాది పాటు సాగిన ఆందోళనలతో నేర్చుకోగలిగానని రాంపూర్ జిల్లా దేవాపూర్ గ్రామానికి చెందిన రైతు అమీర్ అహ్మద్ (52) తెలిపారు.
'యూపీలో వరి కొనుగోలు నిరాశజనకం'
లఖింపూర్ ఖేరీ ఘటనలో తీవ్రంగా గాయపడిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నాయకుడు తాజిందర్ సింగ్ విర్క్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వరి కొనుగోలు నిరాశజనకంగా ఉన్నదన్నారు. '' గతనెల 1 నుంచి కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైంది. 70 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలును లక్ష్యంగా ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఇప్పటి వరకు కేవలం 4.98 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు జరిగింది. నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 4000 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, 1712 కేంద్రాలు మాత్రమే ప్రస్తుతం పని చేస్తున్నాయి'' అని ఆయన ఆరోపించారు. 'కఠిన', ఆచరణకుయోగ్యం నిబంధనలు, షరతులు, అవినీతి కారణంగా రైతులు కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ. 1940 కంటే తక్కువగా రూ. 1350కు తమ పంటలను అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని తాజిందర్‌సింగ్ అన్నారు. మొత్తం 6,42,224 మంది రైతులకు గానూ ప్రభుత్వం కేవలం 71,352 మంది రైతుల నుంచే కొనుగోలు జరిపిందని ఆరోపించారు. తేమ, నాణ్యత తో పాటు రైతుల నియంత్రణలో లేని ఇతర చిన్న చిన్న కారణాలు చూపుతూ పంట కొనుగోలుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలిపారు.