Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: భారతీయ స్టేట్ బ్యాక్ (ఎస్బీఐ) అమరావతి సర్కిల్ తన సీఎస్ఆర్ కార్యకలాపాల కింద పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా మేనేజింగ్ డైరెక్టర్ (ఆర్ అండ్ డీబీ) చల్లా శ్రీనివాసులు శెట్టీ.. దీన్ దయాళ్ శ్రావణ ఫౌండేషన్ (విజయవాడ)కు 300 హియరింగ్ మెషిన్లను విరాళంగా అందజేశారు. అలాగే, వన్యప్రాణుల వినియోగం కోసం వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఇండియాకు రెండు సోలార్ డీప్ వెల్ పంపింగ్ సిస్టమ్స్, శ్రీ షిరిడి సాయి సేవా ట్రస్ట్ (గుంటూరు)కు రేడియోగ్రఫీ యూనిట్‌తో కూడిన ఒక ఎక్స్-రే మెషిన్‌ను అందించారు. సుపరిపాలన, వన్యప్రాణుల రక్షణ, ఆరోగ్య సంరక్షణ, రోగనిర్ధారణ మొదలైన రంగాలలో వివిధ కార్యకలాపాల కోసం ఎస్బీఐ తన సీఎస్ఆర్ ఫండ్స్‌ను వినియోగిస్తూ.. చిన్న స్వచ్ఛంద సంస్థలపై కూడా దృష్టి సారించి ప్రోత్సహిస్తోందని ఆయన అన్నారు. అలాగే, ఎస్బీఐ అమరావతి సర్కిల్ జనరల్ మేనేజర్ విన్సెట్ ఎండీ మాట్లాడుతూ.. సమాజానికి తమవంతు సాయంగా తిరిగి ఇచ్చే నైతికత్వంతో ఎస్బీఐ వివిధ సీఎస్ఆర్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అంతటా మెగా ట్రీ ప్లాంటేషన్ సందర్భంగా ఒకే రోజు 25,000కు పైగా మొక్కలు నాటామని డీజీఎం అండ్ సీడీవో వి ప్రేమ్ జీ తెలిపారు. జనరల్ మేనేజర్లు ఖాద్రీ గుండురావ్, మణికంఠన్ నాయర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.