Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభివృద్ధి జరిగితే ఎన్నికల్లో విజయానికి ఇంత హింస ఎందుకు?
- త్రిపుర సీఎంపై సొంతపార్టీ బీజేపీ ఎమ్మెల్యేల ఆగ్రహం
న్యూఢిల్లీ : బీజేపీ పాలిత రాష్ట్రం త్రిపుర సీఎం విప్లవ్ దేవ్‌పై సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ రగడపై విప్లవ్ దేవ్, రాష్ట్ర ప్రభుత్వం తీరును వారు తప్పుబట్టారు. ఈ హింసాత్మక పరిస్థితిని అదుపు చేయడానికి సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు, కేంద్ర హౌం మంత్రి అమిత్ షా సైతం కలుగజేసుకోవాల్సి వచ్చిందని బీజేపీ ఎమ్మెల్యేలు సుదీప్ రారు బర్మాన్, ఆశిశ్ సాహాలు ఆరోపించారు. ప్రజల ప్రాణాలను కాపాడటంలో రాష్ట్ర పోలీసులూ విఫలమయ్యారని చెప్పారు. '' ఇటీవల చోటు చేసుకున్న హింస పార్టీ ప్రయోజనాలను దెబ్బ తీస్తుంది. మేము ఈ విషయాలన్నీ పార్టీ (బీజేపీ) జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, నేషనల్ సెక్రెటరీ (ఆర్గనైజేషన్) బీఎల్ సంతోశ్, అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ లకు తెలియజేశాం'' అని బర్మన్ వెల్లడించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న హింసకు, అధికార పార్టీ గుండాల బెదిరింపులకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ఈ సందర్భంగా ప్రజలను వారు కోరారు. ' రాష్ట్రంలో గత 44 నెలల కాలంలో బీజేపీ ఎంతో అభివృద్ధి చేసి ఉంటే ఎన్నికల్లో విజయం సాధించడానికి ఇంత హింస ఎందుకు?' అని వారు ప్రశ్నించారు. షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 25న (నేడు) త్రిపుర స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార బీజేపీ, విపక్ష తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కార్యకర్తలు, మద్దతుదారుల మధ్య ఘర్షణలు నెలకొన్న విషయం విదితమే. ఇటు సొంత పార్టీ ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నది.