Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు బ్యాంకులు, ఒక ప్రభుత్వ బీమా కంపెనీ ప్రయివేటపరం
- చట్ట సవరణ బిల్లులు సిద్ధం చేసిన మోడీ సర్కార్
- అత్యంత కీలకమైన పీఎఫ్ఆర్డీఏ చట్టానికి సవరణ
- కంపెనీల చట్టం కిందకు జాతీయ పెన్షన్ పథకం ట్రస్ట్!
న్యూఢిల్లీ : ఆర్థికసంస్కరణల పేరుతో గత ఏడేండ్లుగా మోడీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల జీవితాల్ని ఎంత అతలాకుతలం చేస్తున్నాయో అందరికీ తెలిసిందే. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో అత్యంత ప్రమాదకరమైన బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లులను కేంద్రం తీసుకురాబోతోంది. రెండు బ్యాంకులు, ఒక ప్రభుత్వ బీమా కంపెనీ (వాటి పేర్లు ఇంకా బయట పెట్టలేదు)ని ప్రయివేటుపరం చేయడానికి చట్ట సవరణ బిల్లులు సిద్ధంచేసింది. 1970, 1980 బ్యాంకింగ్ కంపెనీల చట్టంతోపాటు 1949 బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్‌కు సవరణలు చేయడమే సభలో ప్రవేశపెట్ట బోతున్న సవరణ బిల్లు ఉద్దేశమని కేంద్రం తాజాగా పేర్కొన్నది. ప్రయివేటపరం చేయాలనుకుంటున్న ప్రభు త్వ బ్యాంకుల పేర్లను కేంద్రం ఇంకా బహిర్గతం చేయలేదు. వాటి వివరాలు ప్రతిపాదిన సవరణ బిల్లులో లేవని సమాచారం. ఈనెల 29 నుంచి ప్రారంభం కాను న్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లులపై వాడివేడి చర్చసాగుతుందని భావిస్తున్నారు. మొత్తం 26 బిల్లుల్ని కేంద్రం ప్రవేశపెట్టనున్నది. బిల్లుల్ని ప్రవేశపెట్టడం, పరిశీలన, ఆమోదం కోసం బ్యాంకింగ్ సవరణ బిల్లులు లిస్టయినట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. రెండు ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రయివేటీకరణ సహా పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.లక్షా 75వేల కోట్లు సమీకరించనున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.
పెన్షన్ హక్కులపై దెబ్బ
అలాగే ఈ సమావేశాల్లో మరో కీలకమైన పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) చట్ట సవరణ బిల్లును కూడా ప్రవేశపెట్టనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. జాతీయ పెన్షన్ వ్యవస్థ(ఎన్పీఎస్) ట్రస్ట్‌ను పీఎఫ్ఆర్డీఏ నుంచి వేరుచేయటమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. తద్వారా ఎన్పీఎస్ ట్రస్ట్ నిర్వహణలో సమూల మార్పులు చేపట్టడానికి కేంద్రం సిద్ధమైంది. ఎన్పీఎస్ ట్రస్ట్ హక్కులు, అధికారాలు, విధులు ఇకపై కంపెనీల చట్టం కిందకు తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. లేదంటే ఒక ఛారిటబుల్ ట్రస్ట్‌గా కొనసాగిస్తారని వార్తలు వెలువడుతున్నాయి.