Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు-2021కు కేంద్ర మంత్రి వర్గం బుధవారం ఆమోదం తెలిపింది. దీనిని వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఆమోదానికి పెట్టనుంది. ఈ నెల 19న ప్రధాని మోడీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ, మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటామని ప్రకటించారు. దానికి అనుగుణంగానే కేంద్ర మంత్రివర్గం నల్ల చట్టాల రద్దు బిల్లుకు ఆమోదం తెలిపింది. వ్యవసాయరంగంలో సంస్కరణల పేరుతో వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్ వ్యవస్థను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు, కాంట్రాక్టు వ్యవసాయాన్ని రుద్దేందుకు గత ఏడాది సెప్టెంబరులో ఈ మూడు బిల్లులను కేంద్రం ఏకపక్షంగా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూడు చట్టాలను చుట్టజుట్టాలని కేంద్ర మంత్రివర్గం తాజాగా నిర్ణయించింది. నల్ల చట్టాల రద్దుతోబాటు మంత్రివర్గ సమావేశం మరి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంది. కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మంత్రివర్గ నిర్ణయాలను మీడియాకు వెల్లడిస్తూ, రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ మూడు చట్టాలను వెనక్కి తీసుకునే బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. కరోనా సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో గతేడాది ఏప్రిల్ నుంచి అమలులోకి వచ్చిన ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం (పిఎంజికెఎవై) గడువును 2022 మార్చి వరకు పొడిగించాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. ఈ పథకం కింద అర్హులైన ప్రతిఒక్కరికీ నెలకు అదనంగా 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తారు. ప్రతిపక్షాలు, పలు ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ఒత్తిడి నేపథ్యంలో కేంద్రం ఈ పథకాన్ని పొడిగించింది. కేంద్ర పాలిత ప్రాంతం దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూలో విద్యుత్ సరఫరా, రిటైల్ సప్లైను ప్రయివేటీకరించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది.