Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కోసం తక్షణమే తగిన నిధులను విడుదల చేయాలని కోరుతూ 80 మందికి పైగా ఆర్థిక, విద్యావేత్తలతో కూడిన బృందం ప్రధాని మోడీకి బహిరంగ లేఖ రాసింది. ఈ పథకం గ్రామీణ పేదలకు జీవనాధారంగా మారిందని లేఖలో పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఉపాధి, వేతనాలపై పడిన ప్రభావాన్ని తగ్గించడం.. కరోనా ముందున్న పరిస్థితుల్లోకి వెళ్లడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ, ఆయా అంశాలను పరిగణలోకి తీసుకుని ఎంజీఎన్ఆర్ఈజీఏకు నిధులు పెంచడంతో పాటు వెంటనే విడుదల చేయాలని పేర్కొన్నారు. ఎంజీఎన్ఆర్ ఈజీఏ కింద పని కోసం డిమాండ్ పెరుగుతున్నప్పటికీ, ఈ పథకానికి నిధుల కేటాయింపు తగ్గింది. మరీ ముఖ్యంగా కరోనా రెండో ఏడాదిలో దాదాపు 30శాతం తగ్గించబడింది. లేఖలో ప్రస్తావించిన మరిన్ని వివరాలు ఇలావున్నాయి.. ''నిధుల కొరత పని కోసం డిమాండ్ అణచివేతకు దారితీస్తుంది. కార్మికులకు వేతన చెల్లింపు సైతం ఆలస్యం అవుతుంది. ఇవి చట్టం ఉల్లంఘన కిందకు వస్తుంది'' అని లేఖలో పేర్కొన్నారు.
పెండింగ్ బకాయిలు రూ. 1,121 కోట్లకు పైనే..
ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద పనికోసం అధిక డిమాండ్ ఉంది. అయితే, నిధుల కొరత దీనిపై ప్రభావం చూపు తోంది. దీంతో ప్రతి ఇంటికి 100 రోజుల పనిదినాలు కల్పి స్తామన్న వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేకపోయింది. ఎంజీ ఎన్ఆర్ఈజీఎస్ కింద ఈ ఏడాది ఉపాధి పొందిన 51 శాతం కుటుంబాలకు 30 రోజులు లేదా అంతకంటే తక్కువ రోజులు పని లభించింది. 80 రోజుల కంటే ఎక్కువ రోజులు ఉపాధి పొందిన వారు 10శాతం కంటే తక్కువగానే ఉన్నారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్కు తగిన నిధులు కల్పించ డంతో గ్రామీణ కుటుంబాల సంక్షేమ అవకాశాలు మెరుగు పడటమే కాకుండా.. ఆర్థిక పునరుద్ధరణలోనూ సహాయ పడుతుందని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖపై సంతకం చేసిన వారిలో ఆర్థికవేత్తలు ప్రభాత్ పట్నాయక్, జీన్ డ్రేజ్, జయతి ఘోష్, అశ్విని దేశ్పాండే, అర్జున్ జయదేవ్, అమియా బాగ్చి వంటి ప్రముఖులు ఉన్నారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ లక్షలాది గ్రామీణ కుటుంబాలకు కీలకమైన జీవనాధారంగా ఉందని ఇదివరకే అనేకసార్లు నిరూపించబడింది. కరోనా మహమ్మారి, లాక్డౌన్ సమయంలో మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇప్పుడు కూడా, దేశవ్యాప్తంగా ఉపాధి స్థాయిలు, వేతన ఆదాయాలు మునుపటి కంటే చాలా తక్కువగా ఉన్నాయి. ఇది శ్రామిక కుటుంబాల జీవన పరిస్థితులను అలాగే ఆర్థిక పునరుద్ధరణకు విస్తృత సంభావ్యతను ప్రభావితం చేస్తుంది, ఈ నేపథ్యంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఎదుర్కొంటున్న నిధుల కొరతను లేఖలో హైలెట్ చేశారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కొనసాగింపు, విస్తరణకు అనుగుణంగా రాష్ట్రాలకు నిధులు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు ఆర్థిక, విద్యావేత్తలు ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. కరోనా మహమ్మారి ప్రారంభ ఏడాదిలో అభద్రతలోకి జారుకునున్న లక్షలాది కుటుంబాలు మునుపటి ఏడాదితో పోలిస్తే 2020లో ఎంజీ ఎన్ఆర్ఈజీఎస్ పనికోసం 41 శాతం ఎక్కువగా చూశాయి. అయితే, నిధులు కేటాయింపు మాత్రం 30 శాతం తగ్గడం దురదృష్టకరం. 2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్లో కేటాయించిన రూ.73,000 కోట్లలో రూ.17,451 కోట్లు (దాదాపు మొత్తంలో నాలుగింట ఒక వంతు) మునుపటి సంవత్సరాలలో పెండింగ్లో ఉన్న వేతనాలను తీర్చగలవు. ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు నెలలకు పైగా సమయం ఉండటంంతో బడ్జెట్ కేటాయింపుల అంచనా వ్యయం ఇప్పటికే మించిపోయిందని అధికారిక డేటా సమాచారం. పీపుల్స్ యాక్షన్ ఫర్ ఎంప్లారుమెంట్ గ్యారెంటీ (పీఏఈజీ) అంచనా ప్రకారం 15 నవంబర్ 2021 నాటికి ఈ కార్యక్రమం రూ.10,000 కోట్ల లోటులో ఉంది. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కార్మికులకు చెల్లించాల్సిన పెండింగ్ వేతనాలు రూ.1,121 కోట్లకు పైగా ఉన్నాయి. 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుండి పొందిన దానికంటే ఎక్కువ ఖర్చు చేశాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాన్ని అమలు చేయలేని పరిస్థితిలోకి దిగజారాయని దీన్నిబట్టి తెలుస్తున్నది.