Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రైతుల మనోభావాలు, సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో లఖింపూర్ ఖేరీలో స్థానిక చక్కెర మిల్లులు ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమాలకు కేంద్ర హౌం సహాయ మంత్రి అజరు మిశ్రా టేని దూరంగా ఉన్నారు. అయితే ఈ విషయంలో ప్రధాని మోడీ నైతిక బాధ్యతతో వ్యవహరించలేకపోవడం విడ్డూరంగా ఉన్నదని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) విమర్శించింది. షహీద్ కిసాన్ అస్థి కలాష్ యాత్ర మధ్యప్రదేశ్‌లోని వివిధ జిల్లాల గుండా సాగుతోంది. అమరవీరులకు నివాళులర్పించేందుకు స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. బుధవారం సర్ ఛోటూ రామ్ జన్మదినాన్ని దేశ రాజధాని సరిహద్దు ప్రాంతాల్లో రైతు ఉద్యమ శిబిరాల్లోనూ, ఇతర అనేక చోట్ల కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ దివస్‌గా ఉత్సాహంగా జరిగింది. సంయుక్త కిసాన్ మోర్చా సర్ ఛోటూ రామ్‌కు, ఆయన స్ఫూర్తిదాయకమైన వారసత్వానికి తన ప్రగాఢమైన నివాళులర్పించింది. ఎంఎస్పీకి చట్టబద్ధంగా హామీ ఇవ్వాలని చాలా మంది ఎన్డీఏ మద్దతుదారులు కూడా కోరుకుంటున్నారని మీడియా హౌస్ చేపట్టిన మార్కెట్ సర్వేలో స్పష్టం అయింది. మరోవైపు, వ్యవసాయ కుటుంబాలకు సంబంధించిన ఎన్ఎస్ఓ ఇటీవలి విడుదల చేసిన 77వ రౌండ్ సిట్యువేషన్ అసెస్మెంట్ సర్వే అధికారిక డేటా ప్రకారం చాలా మంది రైతులకు ఎంఎస్పిని పొందలేదని స్పష్టం చేస్తుందని ఎస్కేఎం తెలిపింది.
రేపు కర్నాటకలో రోడ్లపైకి రైతన్న
కర్నాటకలో రైతు పోరాటాల మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 26న (శుక్రవారం)రైతులు వీధుల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా ముఖ్యమైన రహదారులపై ఆ రోజు పెద్ద సంఖ్యలో రైతులు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల పరిధిలోని దాదాపు 25 ప్రాంతాల్లో నిరసనలు చేపట్టేందుకు నిర్ణయించారు. ఈ హైవే జామ్‌కు సంబంధించిన రెండు నిరసన స్థానాల్లో బెంగళూరుకు చెందిన ప్రజలు కూడా శ్రీరంగపట్నం, చిక్బల్లాపూర్ జిల్లాలోని చదలపురా వద్ద వాహనాల ర్యాలీలలో చేరనున్నారు. తమిళనాడులో కార్మిక సంఘాలతో కలిసి అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించనున్నారు. చెన్నైలో కూడా నిరసన ప్రదర్శన, సభ ఉంటుంది. రారుపూర్, రాంచీ వంటి అనేక రాష్ట్ర రాజధానులకు ట్రాక్టర్ ర్యాలీలు చేయబడుతున్నారు. నవంబర్ 25 ఉదయం గరియాబంద్ నుండి రారుపూర్ ర్యాలీ బయలుదేరుతుంది. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో 25, 26 తేదీల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణలోని హైదరాబాద్‌లో నేడు నవంబర్ 25వ తేదీన ఇందిరాపార్క్ సమీపంలోని ధర్నా చౌక్ వద్ద మహా ధర్నా నిర్వహించనున్నారు. పాతబస్తీలో రైతు సంఘాలు, కార్మిక సంఘాలతో కలిసి కలెక్టరేట్‌కు పాదయాత్ర నిర్వహించి వినతి పత్రం సమర్పించనున్నారు. ఇదిలా ఉండగా, వేలాది మంది రైతులు ట్రాక్టర్లు, రేషన్, ఇతర సామాగ్రితో ఢిల్లీ చుట్టూ ఉన్న ఉద్యమ శిభిరాలకు చేరుకుంటున్నారు. ఈ ఉద్యమంలో తన ప్రాణాలను అర్పించిన సుఖ్‌దేవ్ సింగ్ చక్కివాలాకు ఎస్కేఎం వినయపూర్వక నివాళులర్పిస్తుంది. భావ్దీన్ టోల్ ప్లాజా వద్ద నిరసన తెలుపుతున్న రైతులకు వంట చేసి తినిపిస్తూ కిసాన్ ఆందోళనలో తన సేవను నిరంతరం అందిస్తున్న అమరవీరుడు ఆయనని ఎస్కేఎం పేర్కొంది.
29న పార్లమెంట్‌కు ట్రాక్టర్స్ మార్చ్ : రాకేశ్ తికాయత్
ఈనెల 29న 60 ట్రాక్టర్లతో పార్లమెంటు వరకూ మార్చ్ నిర్వహించనున్నట్టు బీకేయూ నేత రాకేశ్ తికాయత్ తెలిపారు. పంటల కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు చట్టబద్ధత కల్పించడం సహా ఇతర డిమాండ్లపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తాము ఈ ట్రాక్టర్స్ మార్చ్ నిర్వహంచనున్నట్టు చెప్పారు. ప్రభుత్వం తెరిచి ఉంచిన రోడ్ల మీదుగానే ట్రాక్టర్లు పార్లమెంటు వరకూ వెళ్తాయన్నారు. ''మేం రోడ్లు దిగ్బంధం చేస్తున్నామనే ఆరోపణలకు తావీయం. రోడ్లు దిగ్బంధించడం మా ఉద్యమం కాదు. ప్రభుత్వంతో చర్చించడమే మా ఉద్యమం ఉద్దేశం. మేం నేరుగా పార్లమెంటుకు వెళ్తాం'' అని రాకేశ్ తికాయత్ తెలిపారు. సుమారు వెయ్యి మంది వరకూ పార్లమెంటుకు వెళ్తున్నట్టు ఆయన చెప్పారు. కనీస మద్దతు ధరపై ప్రభుత్వ స్పందన గురించి వేచిచూస్తున్నామని, దానికి తోడు ఏడాదిగా సాగించిన రైతు నిరసనల్లో 750 వరకు రైతులు చనిపోవడానికి కేంద్రం బాధ్యత తీసుకోవాలని తికాయత్ అన్నారు.