Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీస మద్దతు ధర చట్టం చేయాలి
- 2014 ఎన్నికల సభల్లో మోడీ హామీ ఇచ్చారు
- 2011లో అప్పటి ప్రధానికి లేఖ రాశారు
- కేరళలో స్వామినాథన్ కమిటీ సిఫార్సుల కంటే అధికంగా ఎంఎస్పీ
- నల్లచట్టాలు రదయ్యాయి.. తెల్లచట్టాలు రావాలి : ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయూ
న్యూఢిల్లీ : కనీస మద్దతుధరపై ప్రధానిమోడీ అబద్ధాలు ఆడుతున్నారని ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా విమర్శించారు. ఎంఎస్పీ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం నాడిక్కడ ఏఐకేఎస్, ఏఐ ఏడబ్ల్యూయూ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఏఐకేఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్ ధావలే, హన్నన్ మొల్లా, సహాయ కార్యదర్శి ఎన్‌కె శుక్లా, కోశాధికారి కృష్ణ ప్రసాద్, ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సహాయ కార్యదర్శి విక్రమ్ సింగ్‌లు కనీస మద్దతు ధరపై ప్రత్యేక పత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా హన్నన్ మొల్లా మాట్లాడుతూ దేశంలో 90 కోట్ల మంది రైతులు మద్దతు ధర కోసం ఉద్యమిస్తున్నారని అన్నారు. రైతులకు వ్యతిరేకంగా ఉన్న మూడు నల్ల చట్టాలను రద్దు చేసి, తెల్ల (కనీస మద్దతు ధర) చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఎంఎస్పీ లేకపోవడంతో రైతులు ఆత్మహత్యలకు గురవుతున్నారనీ, దేశంలో ప్రతి రోజు 52 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు లక్ష మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. కనీస మద్దతు ధరతోనే రైతులు కొంత వరకైనా సమస్యల నుంచి బయటపడగలుగుతారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 23 పంటలకు మద్దతు ధర ఇస్తున్నట్టు చెపుతున్నదనీ, కానీ, అది కంటితుడుపు చర్యగానే ఉందని విమర్శించారు. రైతులందరికీ, అన్ని పంటలకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగంపై అపూర్వమైన అనుభవం ఉన్న స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలుచేయాలనీ, కొత్తగా కమిటీల ఏర్పాటు అవసరంలేదని స్పష్టం చేశారు. 2014లో ఎన్నికల సభల్లో స్వామినాథన్ కమిషన్ సిఫార్స్‌లు అమలు చేస్తామనీ, మద్దతు ధర ఇస్తామని ప్రధాని మోడీ ప్రచారం చేశారని గుర్తు చేశారు. అలాగే 2011లో గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ, కనీస మద్దతు ధర చట్టం చేయాలని అప్పటి ప్రధానికి లేఖ రాశారని తెలిపారు. ఇప్పుడు ఆయనే ప్రధానిగా ఉన్నారునీ, మద్దతు ధర కల్పిస్తున్నామంటూ ప్రతి రోజు అబద్ధపు ప్రచారాన్ని చేస్తున్నారని విమర్శించారు. దేశంలో కేవలం 15 శాతం మంది రైతులు మాత్రమే మద్దతు ధర పొందుతున్నారని, 85 శాతం మందికి ఎంఎస్పీ అందడం లేదన్నారు. కేరళ స్వామినాథన్ కమిటీ సిఫార్స్‌లకు మించి మద్దతు ధర ఇస్తుందనీ, వివిధ రాష్ట్రాల్లో కనీస మద్దతు ధర అమలుకాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో క్వింటా వరికి ప్రభుత్వం రూ.1,940 ఎంఎస్పీ ప్రకటిస్తే, అక్కడి రైతులు కేవలం రూ.1,100 మాత్రమే పొందుతున్నారని అన్నారు. అంటే కేంద్రం ప్రకటించిన అరకొర ఎంఎస్పీ కూడా రైతులకు అందటంలేదని తెలిపారు. ప్రపంచంలోని సుదీర్ఘంగా సాగిన చారిత్రాత్మక రైతు పోరాటంపై అనేక అభాండాలు వేశారనీ, ఆరోపణలు చేశారనీ, కానీ ఉద్యమం ఏడాదిపాటు మొక్కవోని దీక్షతో సాగిందని తెలిపారు. మోడీ రాజ్యాంగ సాంప్రదాయాలన్నింటికి తిలోదకాలు ఇస్తున్నారనీ, కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తరువాత చెప్పాల్సిన నిర్ణయాలను, ఆయన ముందుగానే ప్రకటించి వాటిని మంత్రివర్గం ముందుకు తీసుకువెళుతున్నారని విమర్శించారు.
తెలంగాణ సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
రైతు ఉద్యమంలో సుమారు ఏడు వందల మంది రైతులు అమరులయ్యారనీ, వారందరికీ కేంద్ర ప్రభుత్వం పరిహారం అందించాలని హన్నన్ మొల్లా డిమాండ్ చేశారు. ఒక్కొక్కరి రూ.3 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. మరణించిన రైతుల పేర్ల జాబితాను తెలంగాణ ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. అలాగే నేడు (గురువారం) హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద జరిగే కిసాన్ మహా పంచాయత్‌లో తాను సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) నేత రాకేష్ టికాయిత్ తదితరులు పాల్గొనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే లక్నోలో కిసాన్ మహాపంచాయత్ జరిగిందనీ, 28న ముంబారులో జరగనుందని తెలిపారు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆలోచన చేయాలి : బి.వెంకట్
రైతుల సమస్యలపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆలోచనలు చేయాలని ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ సూచించారు. ఎంఎస్పీ చట్టం ప్రజల డిమాండ్ అని పేర్కొన్నారు. వ్యవసాయ కార్మికులు కూడా ఎంఎస్పీ చట్టంపై ఆధారపడి ఉన్నారని అన్నారు. ఆ చట్టం ఆమోదం పొందితే రైతులకు మంచి ఆదాయాలు వస్తాయనీ, తద్వారా వ్యవసాయ కార్మికులు మంచి వేతనాలు పొందగలుగుతారని తెలిపారు. దేశంలో వివిధ రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో మద్దతు ధర సరైన పద్దతిలో నిర్ణయించకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని అన్నారు. విద్యుత్ బిల్లు రద్దు కాకపోతే తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏమిటనీ, రెండు రాష్ట్రాల్లో 25 శాతం రైతులు మోటార్లపై ఆధారపడి ఉన్నారని తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన బిల్లు ఆమోదం పొందితే, మోటార్లకు మీటర్లు తప్పనిసరిగా పెడతారన్నారు. తెలంగాణ తరహాలోనే ఏపీ ప్రభుత్వం కూడా రైతు ఉద్యమంలో మరణించిన రైతులకు పరిహారం ఇవ్వడంపై స్పందించాలని డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధర ఇవ్వకుండా, ధాన్యం కొనుగోలు జరగకపోతే పంజాబ్, హర్యానా, పశ్చిమ యూపీ తరహాలోనే తెలుగు రాష్ట్రాలు నష్టపోతాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల సీఎంలు కనీస మద్దతు ధర కోసం, విద్యుత్ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటానికి నాయకత్వం వహించి కేంద్రంపై వత్తిడి చేసేందుకు ముందుకు రావాలని కోరారు. అలాగే రెండు రాష్ట్రాల్లోని అసెంబ్లీల్లో తీర్మానాలు చేయాలని డిమాండ్ చేశారు.