Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారత్‌లోని మహిళలు, చిన్నారుల్లో రక్తహీనత సమస్య ఆందోళనకరంగా ఉన్నది. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో దాదాపు సగం మందికి పైగా మహిళలు, చిన్నారులు రక్త హీనతతో బాధపడుతున్నారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్-5) ఫేజ్-2 సమాచారం ఈ విషయాన్ని వెల్లడించింది. 2019-21 ఎన్ఎఫ్హెచ్ఎస్-5 రెండో దశలో (ఫేజ్-2) భారతదేశం, 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జనాభా, పునరుత్పత్తి, శిశు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, పోషకాహారం, ఇతర అంశాలపై కీలక సూచికల ఫ్యాక్ట్షీట్లను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది.
అరుణాచల్‌ప్రదేశ్, చండీఘఢ్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ ఎన్సీటీ, ఒడిశా, పుదుచ్చేరి, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, యూపీ, ఉత్తరాఖండ్ లు ఈ సర్వే జాబితాలో ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్ఎఫ్హెచ్ఎస్-5 ఫేజ్ 1లో కవర్ చేయబడిన 22 రాష్ట్రాలు, యూటీల కు చెందిన ఫలితాలు గతేడాది డిసెంబర్లో విడుదలైన విషయం విదితమే.
ఎన్ఎఫ్హెచ్ఎస్-5 ఫేజ్ 2 తాజా సమాచారం ప్రకారం.. పిల్లల పోషకాహార సూచికలు ఆలిండియా స్థాయిలో స్వల్ప మెరుగుదలను చూపాయి. అయితే, రక్తహీనత మాత్రం చిన్నారులు, మహిళల్లో ఆందోళనకరంగా ఉన్నది. '' చిన్నారులు మహిళల్లో రక్తహీనత ఆందోళన కలిగిస్తున్నది. ఐరన్‌ఫోలిక్ ఆసిడ్ (ఐఎఫ్ఏ) మాత్రల కూర్పులో గణనీయమైన పెరుగుదల ఉన్నప్పటికీ ఎన్ఎఫ్హెచ్ఎస్-4తో పోల్చుకుంటే ఫేజ్ 2 అన్ని రాష్ట్రాలు, యూటీల్లో, ఆలిండియా స్థాయిలో సగం మందికి పైగా మహిళలు (గర్భిణీ స్త్రీలతో సహా), చిన్నారులు రక్త హీనతతో ఉన్నారు'' అని పేర్కొన్నది.
ఆరు నెలల కంటే తక్కువ వయసు ఉన్న శిశువులకు తల్లిపాలు ఇవ్వడంలో మెరుగుదల కనిపించింది. 2015-16లో ఇది 55 శాతంగా ఉండగా, 2019-21 నాటికి అది 64 శాతానికి పెరిగింది. ఫేజ్-2 అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ ఈ విషయంలో గణనీయమైన మెరుగుదల కనిపించింది. ఇక సంస్థాగత జననాలు ఆలిండియా స్థాయిలో 79 శాతం నుంచి 89 శాతానికి గణనీయంగా పెరిగాయి.
ఇక ఫేజ్-2లోని రాష్ట్రాలు, యూటీలలో కుటుంబ నియంత్రణ అవసరాలు 13 శాతం నుంచి తొమ్మిది శాతానికి గణనీయంగా క్షీణించాయి. ఆలిండియా స్థాయి, 14 రాష్ట్రాలు, యూటీలలో మొత్తం సంతానోత్పత్తి రేటు (టీఎఫ్ఆర్) 2.2 నుంచి 2.0కు పడిపోగా, ఫేజ్-2 రాష్ట్రాలలో ఇది 2.1గా ఉన్నది. కాగా, ఈ ఎన్ఎఫ్హెచ్ఎస్-5 ను దేశవ్యాప్తంగా 707 జిల్లాల్లోని దాదాపు 6.1 లక్షల ఇండ్లను కవర్ చేస్తూ నిర్వహించారు. ఇందులో 7,24,115 మంది మహిళలు, 1,01,839 మంది పురుషులను ఈసర్వే కవర్ చేసింది. కాగా, ఎన్ఎఫ్హెచ్ఎస్-5 సమాచారం మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నది.