Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొమ్మిది రోజులు..121 శాతం పెరిగిన మరణాలు
- ఉత్తరాఖండ్‌లో 11 మంది ఐఎఫ్ఎస్ అధికారులకు పాజిటివ్
- కర్నాటక మెడికల్ కాలేజీలోని 66 మంది స్టూడెంట్స్‌కు కరోనా
న్యూఢిల్లీ :దేశవ్యాప్తంగా కరోనా ఇన్ఫెక్షన్ కేసులు తగ్గాక.. మళ్లీ కోరలు విప్పుతున్నది. గత తొమ్మిది రోజుల నివేదికను పరిశీలిస్తే, మరణాల రేటు 121 శాతం పెరిగింది. నవంబర్ 15న దేశవ్యాప్తంగా 197 మంది కరోనా సోకి మరణించగా, నవంబర్ 23న అది కాస్త..437కి పెరిగింది.
కరోనా మూడోవేవ్ ముప్పు పొంచిఉన్నదన్న భయం వెంటాడుతున్నది. మరోవైపు కేంద్రప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా పరీక్షల సంఖ్య తగ్గడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ 13 రాష్ట్రాలకు లేఖ రాసింది.
కర్నాటకలో 66 మంది విద్యార్థులకు కరోనా
కర్నాటకలోని ధార్వాడ్‌లోని ఎస్డీఎం మెడికల్ కాలేజీలో 66 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు గుర్తించారు. అందరికీ రెండు డోసుల టీకాలు పూర్తయ్యాయి. 400 మంది విద్యార్థులున్న ఈ కళాశాల భవనంతో పాటు రెండు హాస్టళ్లకు సీల్ వేశారు. 300 మంది విద్యార్థులు కరోనా బారినపడినట్టు రిపోర్ట్ వచ్చింది. మరో 100 మందికి సంబంధించిన రిపోర్టు రావాల్సి ఉన్నది.
ధార్వాడ్ డిప్యూటీ కమిషనర్ నితీష్ పాటిల్ మాట్లాడుతూ, వారం రోజుల కిందట కొంతమంది విద్యార్థులు ఒక కార్యక్రమానికి హాజరయ్యారని చెప్పారు. ఆ విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయగా, అందరికీ పాజిటివ్ అని తేలింది. వారు ఎవరెవర్ని కలిసారన్న దానిపై వివరాలు సేకరిస్తున్నట్టు తెలిపారు.
బెంగాల్లోనూ పాజిటివ్ రేటు పెరగడంపై ఆందోళన
పరీక్షల్లో తగ్గుదల ఉంటే.... ఇన్ఫెక్షన్ను సరిగ్గా అంచనా వేయలేమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేఖలో పేర్కొంది. గత కొద్ది రోజులుగా బెంగాల్‌తో పాటు పలు రాష్ట్రాల్లో పాజిటివ్ రేటు పెరుగుతోందని లేఖలో పేర్కొన్నారు.
పరీక్షలు సరిగ్గా చేయకపోతే, ప్రజలలో సంక్రమణ వ్యాప్తిని అంచనా వేయడం కష్టమని ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖలో రాశారు. జూన్ 2021 వరకు సగటున 67,644 పరీక్షలు నిర్వహిస్తున్నట్చు బెంగాల్ ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ స్వరూప్ నిగమ్‌కు లేఖ రాశారు. ఇవి ఇప్పుడు నవంబర్ 22 వరకు రోజుకు 38,600 పరీక్షలకు తగ్గించబడ్డాయి.
యాంటిజెన్ పరీక్షకు బదులుగా ఆర్టీ పీసీఆర్ పై దృష్టి పెట్టండి
ప్రస్తుతం బెంగాల్లో పాజిటివ్ రేటు 2.1శాతంగా ఉందని భూషణ్ లేఖలో పేర్కొన్నారు. గత 4 వారాల్లో ఇదే అత్యధికం. చాలా జిల్లాల్లో పాజిటివ్ రేటు పెరుగుతోంది. వీటిలో డార్జిలింగ్, దక్షిణ్ దినాజ్‌పూర్, హౌరా, పశ్చిమ 24 పరగణాలు, దక్షిణ 24-పరగణాలు, జల్పాయిగురి, కోల్‌కతా ఉన్నాయి. యాంటిజెన్ పరీక్షకు బదులుగా,ఆర్టీ పీసీఆర్ పరీక్షపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలని సూచించారు.
ఆ 13 రాష్ట్రాలివే..
బెంగాల్‌తో పాటు, గోవా, జమ్మూ కాశ్మీర్, కేరళ, లడఖ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్ , సిక్కింలకు కూడా ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. కేరళకు రాసిన లేఖలో, ఆగస్టులో రాష్ట్రం 2.96 లక్షల కరోనా పరీక్షలను నిర్వహిస్తోందనీ, ఇప్పుడు అది 56 వేలకు తగ్గించబడిందని మంత్రిత్వ శాఖ తెలిపింది.