Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్ఎఫ్హెచ్ఎస్-5 లో యూపీ ప్రదర్శన దారుణం
- ప్రతి అంశంలోనూ జాతీయ సగటు కంటే తక్కువే..!
- చిన్నారుల్లో పోషకాహార లోపం, రక్తహీనత
లక్నో : బీజేపీ పాలిత రాష్ట్రం యూపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే, యోగి పాలనలో రాష్ట్రం చాలా అభివృద్ధి చెందిందనీ, 'ఉత్తర ప్రదేశ్'ను 'ఉత్తమ' ప్రదేశ్‌గా చూపించే ప్రయత్నాలను బీజేపీ నాయకులు, శ్రేణులు చేస్తున్నాయి. ఈ విధంగా బహిరంగ సభల్లో, సామాజిక మాధ్యమాల్లో ఆ పార్టీ ప్రచారాలు చేసుకుంటున్నది. కానీ, కేంద్రం తాజాగా విడుదల చేసిన 'నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్)-5' సమాచారం మాత్రం యూపీలోని కఠిన పరిస్థితులను వెల్లడిస్తున్నాయి. యూపీతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు చెందిన ఎన్ఎఫ్హెచ్ఎస్ సమాచారాన్ని కేంద్రం విడుదల చేసిన విషయం విదితమే. ఈ సమాచారం ప్రకారం.. ప్రతి అంశంలోనూ యూపీ ప్రదర్శన దారుణంగా ఉన్నది. జాతీయ సగటుతో పోల్చుకుంటే యూపీ వెనుకబడిపోయింది. ముఖ్యంగా, యోగి పాలనలో ఇక్కడి చిన్నారులు, మహిళలు ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారిలో పోషకాహార లోపం, రక్తహీనత సమస్యలు ఉన్నాయి. ఐదేండ్ల కంటే తక్కువ వయసు ఉన్న చిన్నారుల్లో ఎత్తుకు తగిన బరువు లేనివారి శాతం 2015-16లో ఆరు శాతంగా ఉన్నది. అయితే, 2020-21 నాటికి అది 7.3 శాతానికి పెరగటం గమనార్హం. ఇదే సమయంలో రక్త హీనతతో బాధపడుతున్న 6-59 నెలల మధ్య వయసు ఉన్న చిన్నారుల సంఖ్య 63 శాతం నుంచి 66 శాతానికి పెరగటం గమనార్హం. కాగా, యూపీలో దాదాపు 1.86 లక్షల మంది చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని సమాచార హక్కు ప్రశ్నకు సమాధానంగా సాక్షాత్తూ ప్రభుత్వ గణాంకాలే వెల్లడించడం గమనార్హం. అయితే, క్షేత్రస్థాయిలో ఈ సంఖ్య ఇంతకు మించి ఉంటుందని బాలల హక్కుల కార్యకర్తలు ఆరోపించారు. ఇక 15-19 ఏండ్ల మధ్య వయసున్న మహిళల్లో రక్త హీనత సమస్య క్రమంగా పెరిగింది.
ఇక ఎన్ఎఫ్హెచ్ఎస్-5 సమాచారం ప్రకారం ప్రతి అంశంలోనూ జాతీయ సగటుతో పోల్చుకుంటే యూపీ వెనుకబడిపోయింది. శిశుమరణాల రేటు (ఐఎంఆర్) ప్రతి వెయ్యి మందికి యూపీలో 50.4 గా ఉన్నది. అయితే, జాతీయ సగటు 35.2గా ఉండటం గమనించాల్సిన అంశం. ఐదేండ్ల కంటే తక్కువ వయసున్న చిన్నారుల మరణాల రేటు (యూ5ఎంఆర్) యూపీలో ప్రతి వెయ్యి మందికి 59.8గా ఉన్నది. ఈ విషయంలో జాతీయ సగటు 41.9. ఇక 6-23 నెలల వయసున్న పిల్లల్లో తగిన డైట్ అందుతున్న వారి సంఖ్య యూపీలో 6.1 శాతంగానే ఉన్నది. దేశవ్యాప్తంగా ఇది 11.3గా ఉండటం గమనార్హం. ఇక వయసుకు తగిన ఎత్తు లేని వారు (ఐదేండ్ల కంటే తక్కువ వయసున్న చిన్నారుల్లో) 39.7 శాతంగా ఉన్నారు. జాతీయ స్థాయిలో ఇది 35.5 శాతంగా ఉన్నది. ఇక గర్భిణీలుగా ఉన్న సమయంలో లేదా తల్లులు వందరోజులు ఐరన్ ఫోలిక్ యాసిడ్‌ను వాడినవారి సంఖ్య యూపీలో 22.3 శాతంగా ఉన్నది. ఈ అంశంలో జాతీయ సగటు 44.1 శాతంగా ఉండటం గమనార్హం. ఈ ఎన్ఎఫ్హెచ్ఎస్-5 సర్వేను యూపీలో 2020 జనవరి-2021 ఏప్రిల్ మధ్య నిర్వహించారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటికే ఆరోగ్య సేవలు చాలా పేలవంగా ఉన్నాయనీ అనేక సర్వేలు, అధ్యయనాల్లో తేలినట్టు రాష్ట్రంలోని ఆరోగ్యనిపుణులు, రాజకీయ విశ్లేషకులు గుర్తు చేశారు. సాధారణ సమయాల్లో కంటే కరోనా లాక్డౌన్ సమయాల్లో రాష్ట్రంలో ఆరోగ్య సేవలు పేలవ స్థితిలో ఉన్నాయన్న జీన్ డ్రీజ్, విపుల్ పైక్రా అధ్యయనాన్ని ఈ సందర్భంగా వారు ఉటంకించారు.