Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అత్యల్ప స్థాయికి పడిపోయిన సంతానోత్పత్తి రేటు
- ప్రతినలుగురు ఆడపిల్లల్లో ఒకరికి బాల్యవివాహం : ఎన్ఎఫ్ఎచ్ఎస్-5 నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో గత కొన్నెండ్లుగా జనాభా తగ్గుముఖం పడుతున్నదని తాజాగా విడుదలైన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (ఎన్ఎఫ్హెచ్ఎస్-5) గణాంకాలు పేర్కొంటున్నాయి. ఎన్ఎఫ్హెచ్ఎస్-5 నివేదిక ప్రకారం.. గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో సంతానోత్పత్తి రేటు తగ్గుముఖం పడుతోంది. 2019-21లో సగటు భారతీయ మహిళ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. 2015-16లో నివేదించిబడిన వివరాలతో పోలిస్తే సంతానోత్పత్తి రేటు 2.2 నుంచి 2.0కు పడిపోయింది. దేశ సంతానోత్పత్తి రేటులో ఇప్పటివరకు నమోదైన అత్యల్పస్థాయి ఇదేనని ఎన్ఎఫ్హెచ్ఎస్-5 నివేదిక పేర్కొంది. ఈ సర్వేను 2019-21 మధ్య నిర్వహించారు. ఆ వివరాలను రెండు విడతలుగా విడుదల చేశారు. తొలివిడత గణాంకాలను గతేడాది డిసెంబరులో విడుదల చేయగా, రెండో విడత వివరాలను బుధవారం వెల్లడించారు. తాజా వివరాల ప్రకారం రీప్లేస్మెంట్ రేటు (జనన, మరణాలను బ్యాలెన్స్ చేసే స్థాయి) 2.1 కంటే సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉంది. దేశంలో సంతానోత్పత్తి రేటు అంతకంటే తక్కువగా ఉండటంతో జనాభా తగ్గుదల మొదలైందని సర్వే చెబుతోంది. 1998-99లో సంతానోత్పత్తి రేటు 3.2గా ఉంది. అంటే అప్పట్లో సగటు భారతీయ మహిళ తన జీవితకాలంలో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ఆ తర్వాత క్రమంగా ఇది తగ్గుతూ వస్తోంది. దాదాపు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ఆధునిక గర్భనిరోధక పద్ధతుల వాడకం పెరిగిందని తాజా సర్వే నివేదిక పేర్కొంది.
2019-21లో ఐదు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మినహా మిగిలిన చోట్ల సంతానోత్పత్తి రేటు 2 అంతకంటే తక్కువగానే ఉంది. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మేఘాలయ, మణిపూర్లలో మాత్రం రీప్లేస్మెంట్ స్థాయి కంటే ఎక్కువగా ఉన్నదని పేర్కొంది. ఉత్తరప్రదేశ్లో సంతానోత్పత్తి రేటు 2.4గా ఉండగా.. బీహార్లో 3గా తేలింది. దేశంలోనే అత్యల్ప సంతానోత్పత్తి రేటు సిక్కింలో నమోదైంది. అక్కడ టీఎఫ్ఆర్ రేటు 1.1గా ఉంది. ఇక లఢాక్లో సంతానోత్పత్తి రేటు ఐదేండ్లలో గణనీయంగా తగ్గి 2.3 నుంచి 1.3కు పడిపోయింది. అండమాన్ నికోబార్, గోవాల్లోనూ 1.3గా నమోదైంది. దేశంలో బాల్యవివాహాలు గతంలో కంటే తగ్గినప్పటికీ ఇంకా ప్రతి నలుగురు ఆడపిల్లల్లో ఒకరికి ఇంకా 18 ఏండ్లు నిండకుండానే వివాహం జరుగుతోందని సర్వే గుర్తించింది. 18 ఏండ్లు నిండకుండానే పెండ్లి చేసుకునే వారి సంఖ్య ఐదేండ్ల క్రితం 26.6శాతంగా ఉండగా.. 2019-21లో 23.3శాతానికి తగ్గింది. ఇక కుటుంబ నియంత్రణ సాధనాలు వాడే వారి సంఖ్య కూడా 54శాతం నుంచి 67శాతానికి పెరిగినట్టు సర్వే వెల్లడించింది. అయితే, ఇప్పటికీ ప్రతి ముగ్గురిలో ఒకరు ఎలాంటి కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించడం లేదు. మహిళలు, పిల్లల్లో సగం మంది రక్త హీనతతో బాధపడుతున్నారు. ఆరు నెలల్లోపు పిల్లలకు పాలు ఇస్తున్న తల్లులు 2015-16లో 55 శాతం ఉండగా, ప్రస్తుతం 64 శాతానికి పెరిగింది. మొత్తంగా జనాభా మాత్రం పెరగకుండా, తగ్గకుండా స్థిరంగా కొనసాగుతున్నదని ఎన్ఎఫ్హెచ్ఎస్-5 నివేదిక పేర్కొంది.