Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు అమెజాన్ ఉద్యోగుల సమ్మె
- భారత్తో పాటు 20 దేశాల్లో స్ట్రైక్
న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ అయిన అమెజాన్లో ఉద్యోగులు నేడు (శుక్రవారం) సమ్మెకు దిగనున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 దేశాలకు చెందిన అమెజాన్ ఉద్యోగులు ఈ స్ట్రైక్లో పాల్గొననున్నారు. ఇందులో భారత్, జర్మనీ, అమెరికా వంటి దేశాలు ఉన్నాయి. పనికి తగిన వేతనం, పని ప్రదేశాల్లో మెరుగుదల, ఉద్యోగ భద్రత, కార్మికుల హక్కులతో పాటు పలుడిమాండ్లను ఈసంస్థ ఉద్యో గులు, కార్మికులు వినిపిస్తున్నారు. ఎక్కువ గంటలు పని చేయించుకొని తక్కువ వేతనం చెల్లిస్తున్నారనేది ఇక్కడి ఉద్యోగుల్లో ఉన్న ఆందోళన. దీంతో తమ డిమాండ్ల పరిష్కారం కోసం వారు 'బ్లాక్ఫ్రైడే' సమ్మెకు సిద్ధమ య్యారు. కాగా, తమ నిరసనను ప్రపంచానికి చాటి చెప్పేందుకు 'మేక్ అమెజాన్ పే.కామ్' పేరుతో ఆ సంస్థ ఉద్యోగులు ఇప్పటికే ఒక వెబ్సైట్ను ఆవిష్కరించారు. తమ డిమాండ్లను వారు ఆ వెబ్సైట్లో పొందుపరిచారు. కాగా, ఈ 20 దేశాల్లోని అమెజాన్ ఉద్యోగులతో పాటు, యూనియన్ సంఘాలు, గ్రీన్పీస్, ఆక్స్ఫామ్ వంటి స్వచ్ఛంద సంస్థలు మద్దతు పలుకుతున్నాయి. కార్మికుల సమ్మె అమెజాన్ సంస్థకు అన్ని విధాలుగా దెబ్బేనని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా, కరోనా మహమ్మారి కాలంలో సంస్థ ఉద్యోగులు తీవ్రంగా కష్టపడి పని చేయడంతోనే రెండు వందల బిలియన్ డాలర్ల ధనవంతుల జాబితాలో అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ చేరారని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఉద్యోగులు, కార్మికుల శ్రమతో భారీ లాభాలను గడించిన ఆయన అంతరిక్ష యాత్రలు చేపడుతున్నారు కానీ, వారి శ్రమను గుర్తించడం లేదని సెటైర్లు వేస్తున్నారు.