Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల్లో పోటీ అంశంపై కేంద్రానికి సుప్రీంకోర్టు ప్రశ్న
న్యూఢిల్లీ: క్రిమినల్కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నాయకులను ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాలం నిషేధం విధించేందుకు సిద్ధంగా ఉన్నారా? అరటూ సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. దోషులుగా తేలిన రాజకీయ నాయకులు (ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు) ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ న్యాయవాది అశ్విని కుమార్ ఉపా ధ్యాయ దాఖలు చేసిన పిటిషన్ను తాజాగా సుప్రీంకోర్టు విచారించింది. ''కేసుల్లో శిక్ష పడిన వ్యక్తి గుమాస్తా కాలేడు, కానీ మంత్రి కాగలడు'' అని ఉపాధ్యాయ కోర్టుకు తెలిపారు. శిక్షపడిన నేతలపై జీవితకాల నిషేధం విధించాలని కోరారు. ఇక ఈ అంశంపై ప్రభుత్వ అభిప్రాయం ఏమిటని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజును ప్రశ్నించారు. ''ఎన్నికలలో పోటీ చేయకుండా దోషులుగా తేలిన రాజకీయ నాయకులను నిషేధించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?'' అని సీజేఐ ప్రశ్నించారు. కేంద్రం నిర్ణయం తీసుకోకపోతే తప్ప చట్టాన్ని రూపొందించడం లేదా ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించడం కుదరదని ధర్మాసనం పేర్కొంది. దీని కోసం ఎన్నికల కమిషన్ను సైతం సంప్రదించాల్సి ఉంటుందనీ, న్యాయస్థానం ఈ సమస్యను నిర్ణయించడం అంత సులభం కాదనీ, శాసన మార్గన్ని అనుసరించాలా? వద్దా? అనేది కేంద్ర నిర్ణయించుకోవాలని ధర్మాసనం తెలిపింది. కాగా, 2020లో ఉపాధ్యాయ పిటిషన్ను కేంద్రం వ్యతిరేకించింది. బ్యూరోక్రాట్లు ''సర్వీస్ కండిషన్స్'' ద్వారా పాలించబడుతున్నప్పటికీ, ఎంపీలు, ఎమ్మెల్యేలకు అలాంటి నియమాలు లేవని వాదించారు. ఆరేండ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటుపడే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రాజకీయ నాయకులు పాలించబడుతున్నారని ప్రభుత్వం తన అఫిడవిట్లో పేర్కొంది. ఇక దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై జీవితకాల నిషేధానికి 2017లో భారత ఎన్నికల సంఘం మద్దతు ఇచ్చింది. కానీ తర్వాత, శాశ్వత నిషేధాన్ని కోరుకోవడం లేదు కానీ ఒక నిర్ణీత చట్రంలో రాజకీయాలను నేరరహితం చేయడానికి అనుకూలంగా ఉందని చెబుతూ తన వైఖరిని వెనక్కి తీసుకుంది.