Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏర్పాటుచేసిన నేషన్ ఫర్ ఫార్మర్స్
- అన్ని రాష్ట్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లపై విశ్లేషణ : సాయినాథ్
- మోడీ క్షమాపణలు దేశ ప్రజలకు కాదు కార్పొరేట్లకు : అశోక్ ధావలే
న్యూఢిల్లీ : దేశంలో వ్యవసాయ రంగం, అన్నదాతల దుస్థితిపై నేషన్ ఫర్ ఫార్మర్స్ వేదిక 'కిసాన్ కమిషన్'ను ఏర్పాటుచేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలను ఈ కమిషన్ తిరుగుతుందనీ, రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లపై విశ్లేషణ చేసి నివేదిక విడుదల చేస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం నాడిక్కడ స్థానిక ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా (పీసీఐ)లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రామన్ మెగసెస్ అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీలు ఇచ్చిన రిపోర్టులను విడుదల చేయకుండా, విడుదల చేసిన వాటిని అమలు చేయకుండా, కేంద్ర ప్రభుత్వమే హత్య చేస్తుందని విమర్శించారు. రైతు సమస్యలపై స్వామినాథన్ కమిషన్ 2004 డిసెంబర్లో తన తొలి రిపోర్టు ఇచ్చిందనీ, 2006 అక్టోబర్లో ఐదో (చివరి) రిపోర్టు ఇచ్చిందని తెలిపారు. సి2+50 శాతంతో కనీస మద్దతు ధర ఇవ్వాలని స్పష్టం చేశారనీ, గత 16 ఏండ్లుగా ఆ కమిషన్ సిఫార్సలు అమలు చేయలేదని విమర్శించారు. సుప్రీం కోర్టు కూడా ఇటీవల ఓ కమిటీ వేసిందనీ, ఆ కమిటీలో రైతులకు వ్యతిరేకంగా, కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్నవారే సభ్యులుగా ఉన్నారని తెలిపారు. అయినప్పటికీ ఆ కమిటీ రిపోర్టు ఇప్పటివరకూ బయటకు రాలేదనీ, ప్రభుత్వాలకు అనుకూలంగా లేకపోతే రిపోర్టులను బయటపెట్టరని సాయినాథ్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీల ముందుకు రైతులు రావటం లేదనీ, ఆ కమిటీలపై రైతులకు నమ్మకం లేదని అన్నారు. అందుకే తాము కిసాన్ కమిషన్ ఏర్పాటుచేస్తున్నామనీ, రైతుల వాస్తవ సమస్యలు, పరిష్కారాలు చూపేందుకు కమిషన్ పనిచేస్తుందని తెలిపారు. దేశంలోని రైతాంగం అంతా ఎంఎస్పీ చట్టం చేయాలని డిమాండ్ చేస్తున్నాదన్నారు. మూడు రైతు చట్టాలను రద్దు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం రైతుల సుధీర్ఘ పోరాట విజయమని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతి సుదీర్ఘ ప్రజాస్వామ్య, శాంతియుత చారిత్రాత్మక పోరాటాన్ని దేశ రైతాంగం చేపట్టారనీ, దేశంలోని రైతుల పోరాటం ప్రపంచానికే ఒక సాక్షిగా ఉందని స్పష్టం చేశారు. మూడు రైతు వ్యతిరేక చట్టాలు రాజ్యాంగ విరుద్ధం, చట్ట వ్యతిరేకమని పేర్కొన్నారు. ఎందుకంటే ఆయా చట్టాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 32కు వ్యతిరేకమని స్పష్టం చేశారు. అలాగే రాష్ట్ర జాబితాలో ఉన్న వ్యవసాయంపై కేంద్ర ప్రభుత్వం ఎలా చట్టం చేస్తుందని ప్రశ్నించారు. వచ్చే ఏడాది మొదట్లో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే చట్టాలను రద్దు చేశారనీ, ఇటీవలి జరిగిన ఉప ఎన్నికల్లో ఘోర వైఫల్యంతో మోడీ ప్రభుత్వం ఆలోచనలో పడిందన్నారు. రైతుల కోసం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో రైతులు కూడా ఎంఎస్పీ కోసం డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. అక్కడి రైతులకు కూడా ఎంఎస్పీ రావటం లేదని అన్నారు.
మోడీ క్షమాపణలు దేశ ప్రజలకు కాదు...కార్పొరేట్లకు : అశోక్ ధావలే
ప్రధాని మోడీ ఇటీవల చెప్పిన క్షమాపణలు దేశ ప్రజలకు కాదనీ, తన కార్పొరేట్ స్నేహితులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోవటంతో వారికి క్షమాపణలు చెప్పారని ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షుడు అశోక్ ధావలే విమర్శించారు. దేశంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కిసాన్ కమిషన్ అవసరం ఉందనీ, దానికి ఏఐకేఎస్, ఎస్కేఎం మద్దతుతో పాటు సహకారం అందిస్తాయని తెలిపారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను తొక్కిపెట్టారనీ, అమలు చేయలేదని విమర్శించారు.75 ఏండ్ల స్వాతంత్ర భారతదేశం లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులను చూడలేదన్నారు. గత ఏడేండ్ల మోడీ పాలనకు అక్టోబర్ 3న లఖింపూర్ ఖేరీలో రైతులపై జరిగిన మారణకాండ పరాకాష్టకు నిదర్శనమన్నారు. గతంలో రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చల్లో విద్యుత్ బిల్లును ఉపసంహరించు కుంటామని మోడీ సర్కార్ హామీ ఇచ్చిందనీ, కానీ ఇప్పుడు శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో విద్యుత్ బిల్లు ఆమోదం కోసం ప్రభుత్వం జాబితా చేసిందని తెలిపారు. దీన్ని మోడీ మోసంగా చెప్పకూడదా? అని ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ నేత దినేష్ అబ్రోల్, ఫోరం ఫర్ రైట్ టూ ఎడ్యూకేషన్ సభ్యులు జగ్మోహన్ సింగ్, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల సంఘం నేత సబాస్టియన్, బ్యాంక్ ఉద్యోగుల సంఘం నేత థామస్ ఫ్రంక్, మహిళ నేత నవశ్రాన్ సింగ్ పాల్గొన్నారు.