Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తరువాత స్థానాల్లో జార్ఖండ్, యూపీ, మధ్యప్రదేశ్, మేఘాలయ
- పేదరికంలో అత్యంత తక్కువలో కేరళ
- పేదరిక సూచీని విడుదల చేసిన నిటి ఆయోగ్
న్యూఢిల్లీ: దేశంలో అత్యంత పేదరికం ఉన్న రాష్ట్రాల్లో బీహార్ అగ్రభాగాన నిలిచింది. ఆ తరువాతి స్థానాల్లో జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లు ఉన్నాయి. కేరళలో పేదరికం అత్యంత తక్కువ ఉంది. శుక్రవారం నిటి ఆయోగ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ (ఎంపీఐ) నివేదిక విడుదల చేసింది. ఆరోగ్యం, పోషకాహారం, విద్య, జీవన ప్రమాణాలు వంటి 12 అంశాలను పరిశీలించి ఈ నివేదిక విడుదల చేసింది. పేదరికంలో మొదటి ఐదు స్థానాల్లో ఉన్న బీహార్‌లో 51.91 శాతం, జార్ఖండ్‌లో 42.16 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 37.79 శాతం, మధ్యప్రదేశ్‌లో 36.65 శాతం, మేఘాలయలో 32.67 శాతం మంది ప్రజలు పేదరికంలో ఉన్నారు. ఈ రాష్ట్రాల్లో పేదరికం సూచీ 0.212 నుంచి 0.265 వరకు ఉందని నిటి ఆయోగ్ తెలిపింది. పేదరిక సూచీలో కేరళ (0.71 శాతం), గోవా (3.76 శాతం), సిక్కిం (3.82 శాతం), తమిళనాడు (4.89 శాతం) మరియు పంజాబ్ (5.59 శాతం) భారతదేశం అంతటా అత్యల్ప పేదరికాన్ని నమోదు చేసి, పేదరికం సూచికలో దిగువన ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో పేదరికం సూచీ 0.000 నుంచి 0.052 ఉందని నిటి యోగ్ తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో పేదరికం దిగువనే....
తెలుగు రాష్ట్రాల్లో పేదరికం తక్కువగానే ఉందని నిటి ఆయోగ్ పేదరికం సూచీ స్పష్టం చేసింది. తెలంగాణ (13.74 శాతం) 18 స్థానంలో నిలవగా..ఆంధ్రప్రదేశ్ (12.31 శాతం)తో 20 స్థానంలో ఉన్నది. ఆ రెండు రాష్ట్రాల్లో 0.053 నుంచి 0.105 వరకు పేదరికం ఇండెక్స్ తెలిపింది. ఇక శిశుమరణాల్లో మొదటి ఐదు స్థానాల్లో ఉత్తరప్రదేశ్ (4.9), బీహార్, (4.58 శాతం), మధ్యప్రదేశ్ (3.60 శాతం), చత్తీస్‌గఢ్ (3.32 శాతం), జార్ఖండ్ (3.32 శాతం) ఉన్నాయి. చివరి స్థానాల్లో కేరళ (0.19 శాతం), గోవా (0.57 శాతం), సిక్కిం (1 శాతం), తమిళనాడు (1.15 శాతం), త్రిపుర (1.28 శాతం) ఉన్నాయి. దిగువ నుంచి తెలంగాణ (1.38 శాతం) ఏడో స్థానంలోనూ, ఆంధ్రప్రదేశ్ (1.80 శాతం) 13 స్థానంలోనూ నిలిచాయి.
ప్రసూతి ఆరోగ్యం (మటెర్నల్ హెల్త్) ప్రసూతి ఆరోగ్యం తక్కువ ఉన్న రాష్ట్రాలు బీహార్‌లో 45.62 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 35.35 శాతం, జార్ఖండ్‌లో 33.07 శాతం, నాగాలాండ్‌లో 33.06 శాతం, మేఘాలయలో 31.70 శాతం ప్రజలకు ప్రసూతి ఆరోగ్యం సరిగా లేదు. ప్రసూతి ఆరోగ్యంలో బాగా ఉన్న రాష్ట్రాలు కేరళ (1.73 శాతం), సిక్కిం (5.42 శాతం), తమిళనాడు (6.70 శాతం), గోవా (7.14 శాతం), ఆంధ్రప్రదేశ్ (9.66 శాతం) ఉన్నాయి. చివరి ఆరో స్థానంలో తెలంగాణ (10.87 శాతం) ఉంది.
పోషకాలు తక్కువ
ప్రజలకు పోషకాలు (న్యూట్రిషన్) తక్కువ ఉన్న రాష్ట్రాల్లో బీహార్ (51.88 శాతం), జార్ఖండ్ (47.99 శాతం), మధ్యప్రదేశ్ (45.49 శాతం), ఉత్తరప్రదేశ్ (44.47 శాతం), చత్తీస్‌గఢ్ (43.02 శాతం) మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి. చివరి ఐదు స్థానాల్లో సిక్కిం (13.32 శాతం), కేరళ (15.29 శాతం), అరుణాచల్ ప్రదేశ్ (21.04 శాతం), మిజోరం (21.37 శాతం), పంజాబ్ (22.11 శాతం) ఉన్నాయి. తెలంగాణలో 31.10 శాతం పోషకాహర లోపంతో ఉంటే.. ఏపీలో 26.38 శాతం ఉన్నట్టు పేర్కొంది.
పాఠశాల విద్య తక్కువ
బీహార్ (26.27 శాతం), మేఘాలయ (19.71 శాతం), జార్ఖండ్ (18.32 శాతం), అరుణాచల్‌ప్రదేశ్ (17.77 శాతం మందికి పాఠశాల విద్య అందటం లేదు. ఆ ఐదు రాష్ట్రాలు పాఠశాల విద్యలో వెనుకబడి ఉన్నాయి. చివరి ఐదు స్థానాల్లో కేరళ (1.78 శాతం), హిమాచల్ ప్రదేశ్ (3.78 శాతం), గోవా (4.70 శాతం), మణిపూర్ (5.36 శాతం), మహారాష్ట్ర (6.54 శాతం) ఉన్నాయి. తెలంగాణలో 15.84 శాతం మందికి పాఠశాల విద్య అందటం లేదు.