Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశ నిర్మాణానికీ అవసరం
- రాజ్యాంగ బలంతోనే పురోగమనం : రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
- ప్రజల తీర్పును చట్టసభలు గౌరవించాలి : ఉపరాష్ట్రపతి వెంకయ్య
- కుటుంబ పార్టీలతో దేశంలో సంక్షోభం : ప్రధాని మోడీ
- అదో ఆధునిక భగవద్గీత : లోక్సభ స్పీకర్ ఓం బిర్లా
- 14 ప్రతిపక్షాలు గైర్హాజరు
న్యూఢిల్లీ : 'ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అత్యంత ముఖ్యం. సమర్థవంతమైన ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్యం దేనికీ పనికిరాదు. ప్రభుత్వం, ప్రతిపక్షాలు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ పౌరుల ప్రయోజనాల దృష్ట్యా కలిసి పని చేయాలి. రాజ్యాంగ నిర్మాతలు దీనిని ఊహించారు. ఇది దేశ నిర్మాణానికి కూడా అవసరం' అని రాజ్యాంగ దినోత్సవ సభలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగ బలంతో దేశ అభివృద్ధి ప్రయాణం పురోగమిస్తుందని అన్నారు. రాజ్యాంగ నిర్మాణంలో మహిళల కృషి అపూర్వమని పేర్కొన్నారు. శుక్రవారం నాడిక్కడ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు ప్రసంగించారు. మోడీ సర్కార్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతుందని విమర్శిస్తూ 14 ప్రతిపక్ష పార్టీలు ఈ వేడుకల్లో పాల్గొనలేదు. తొలుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సభ్యులందరీ చేత రాజ్యాంగ ప్రవేశిక చదివించారు. రాజ్యాంగ సభ చర్చల డిజిటల్ వెర్షన్, రాజ్యాంగం కాలిగ్రాఫ్ కాపీ డిజిటల్ వెర్షన్, అన్ని సవరణలు పొందిపరుస్తూ నవీకరించిన రాజ్యాంగాన్ని ప్రతిని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ విడుదల చేశారు. అలాగే 'రాజ్యాంగ ప్రజాస్వామ్యంపై ఆన్లైన్ క్విజ్'ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మాట్లాడుతూ '72 ఏండ్ల క్రితం ఇదే సెంట్రల్ హాల్లో మన రాజ్యాంగ నిర్మాతలు స్వతంత్ర దేశం ఉజ్వల భవిష్యత్తు కోసం రాజ్యాంగ పీఠిక పత్రాన్ని స్వీకరించారు. దేశ అభివృద్ధి ప్రయాణం మన రాజ్యాంగ బలంతో పురోగమిస్తోందని నేను నమ్ముతున్నాను' అన్నారు. 'దేశంలో మొదటి నుంచి మహిళలకు ఓటు హక్కు ఇవ్వబడింది. చాలా మంది మహిళలు రాజ్యాంగ సభలో సభ్యులుగా ఉన్నారు. రాజ్యాంగ నిర్మాణంలో కూడా వారు అపూర్వమైన కృషి చేశారు' అని తెలిపారు. ఎంపీలు అధికార, ప్రతిపక్ష పార్టీలకు ప్రాతినిధ్యం వహించినా పార్లమెంట్ గౌరవాన్ని కాపాడేవారని అన్నారు. 'భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ ప్రజాసేవ నిజమైన లక్ష్యానికి విఘాతం కలిగించేంతగా ఉండకూడదు. ప్రజా శ్రేయస్సు కోసం మంచి పనులు చేయడంలో అధికార పక్షం, ప్రతిపక్ష సభ్యులు పోటీ పడాలి. అప్పుడే అది ఆరోగ్యకరమైన పోటీగా పరిగణించబడుతుంది. పార్లమెంటు 'ప్రజాస్వామ్య దేవాలయం' అని మనమందరం నమ్ముతాము. కాబట్టి, ప్రతి ఎంపీ ఈ దేవాలయంలో బాధ్యతగా మెలగాలి' అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల పట్ల ప్రజలు లోతైన గౌరవాన్ని కలిగి ఉన్నారు. వారి త్యాగాల వల్ల మనం స్వేచ్ఛా గాలిని పీల్చడం సాధ్యమైంది. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం విలువలు రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరచబడ్డాయి. మన దైనందిన జీవితంలో ఆ గొప్ప జాతీయ ఆదర్శాలను అనుసరించడానికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలి' అన్నారు.
దేశం సంక్షోభం వైపు: ప్రధాని మోడీ
కుటుంబ పార్టీలతో దేశం సంక్షోభం వైపు పయనిస్తోందనీ, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తిపై విశ్వాసం ఉన్న వారికి ఆందోళన కలిగించే విషయమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. దోషులుగా తేలిన అవినీతిపరులను మరిచిపోయి కీర్తించే ధోరణి ఉందనీ, సంస్కరించుకునే అవకాశం కల్పిస్తూనే ప్రజా జీవితంలో ఇలాంటి వారిని కీర్తించడం మానుకోవాలని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కర్తవ్యాన్ని నొక్కివక్కాణించి ఉంటే బాగుండేదని అన్నారు. రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య లక్షణాన్ని కోల్పోతే రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలుగుతుందని అన్నారు. ప్రజాస్వామ్య స్వభావాన్ని కోల్పోయిన పార్టీలు ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడగలవు? ప్రశ్నించారు. రాజ్యాంగం కేవలం అనేక వ్యాసాల సమాహారం కాదని, గొప్ప సంప్రదాయమని అన్నారు. ఈ సందర్భంగా 2008 నవంబర్ 26న ముంబాయిలో జరిగిన ఉగ్రవాద దాడుల అమరవీరులకు నివాళులర్పించారు.
ప్రజల తీర్పును చట్టసభలు గౌరవించాలి : ఉపరాష్ట్రపతి వెంకయ్య
ప్రజల తీర్పును చట్టసభలు గౌరవించాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. దేశం ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఉండాలని రాజ్యాంగం కోరుతుందని తెలిపారు. దేశంలోని శాసనసభలు 'సంభాషణలు, చర్చల' ద్వారా మార్గనిర్దేశం చేయబడాలని నొక్కి చెప్పారు.
రాజ్యాంగం ఆధునిక భగవద్గీత : లోక్సభ స్పీకర్ ఓం బిర్లా
దేశ రాజ్యాంగం ఆధునిక భగవద్గీత వంటిదనీ, దేశం కోసం కృషి చేయడానికి ఇది తమను ప్రేరేపిస్తుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. రాజ్యాంగ దినోత్సవాల్లో ప్రతిపక్ష పార్టీలు పాల్గొని ఉండవలసిందన్నారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, గవర్నర్ ప్రసంగాలను బహిష్కరించే సంప్రదాయం లేకుండా చూడాలని తాను కృషి చేస్తున్నట్టు తెలిపారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి వేదికపై కూర్చునేందుకు ఆసనాలను కేటాయించినట్టు తెలిపారు. వారికి ఈ విషయాన్ని ముందుగానే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, లోక్సభ సభాపతి కార్యాలయం తెలియజేసినట్టు చెప్పారు. అయినప్పటికీ వారు హాజరు కాలేదన్నారు. తమకు సీట్లు కేటాయించలేదని ఆరోపించారని, అది వాస్తవం కాదని వివరించారు.
బీజేపీ సర్కార్ రాజ్యాంగాన్ని గౌరవించటంలేదు : 14 ప్రతిపక్షాలు
ఈ సమావేశానికి 14 ప్రతిపక్ష పార్టీలు గైర్హాజరయ్యాయి. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో ప్రతిపక్షాలు ఐక్యతా రాగాన్ని అందుకున్నాయి. కాంగ్రెస్, డీఎంకే, తృణముల్ కాంగ్రెస్, సీపీఐ(ఎం), సీపీఐ, ఆర్జేడీ, శివసేన, ఎన్సీపీ, ఐయూఎంఎల్, ఎస్పీ, ఆర్ఎస్పీ తదితర పార్టీలు దూరంగా ఉన్నాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ విప్ మాణిక్యం ఠాగూర్ మీడియాతో మాట్లాడుతూ 'బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించటం లేదు. వారు రాజ్యాంగం ప్రకారం పాలించడం లేదు. కానీ వారు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవాలంటున్నారు. ఇదొక ప్రచార కార్యక్రమం' అని విమర్శించారు.