Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశవ్యాప్తంగా ఆందోళనలు
- రోడ్ల దిగ్బంధం...ప్రదర్శనలు
- ఢిల్లీ శిబిరాల్లో పోటెత్తిన అన్నదాతలు
- అంతర్జాతీయంగా సంఘీభావ కార్యక్రమాలు
చారిత్రాత్మ రైతు పోరాటం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. పన్నెండు నెలల సుదీర్ఘ రైతుల పోరాటం చరిత్రలో నిలిచిపోనుంది. రైతు, ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలనే సామాన్య ప్రజల సంకల్పానికి రైతు ఉద్యమం సాక్ష్యంగా నిలుస్తుంది. వ్యవసాయాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నాలను తిప్పికొట్టే సంకల్పంతో సాగిన రైతు ఉద్యమ మొదటి వార్షికోత్సవం దేశవ్యాప్తంగా అత్యంత ఉత్సాహంగా... ఉత్తేజంతో జరిగింది. దేశవ్యాప్తంగా ఆందోళనలు భారీస్థాయిలో జరిగాయి. ఇసుకేసినా రాలనంత మంది రైతులు దేశ రాజధాని సరిహద్దులను చుట్టుముట్టారు. రోడ్ల దిగ్బంధం, ప్రదర్శనలు, టాక్టర్ మార్చ్‌లు, ఎద్దుల బండ్ల కవాతులతో ఆందోళనలు మిన్నంటాయి. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లోని రైతు ఉద్యమ శిబిరాల్లో అన్నదాతలు పోటెత్తారు. అంతర్జాతీయంగా సంఘీభావం కార్యక్రమాలు జరిగాయి.
న్యూఢిల్లీ: దేశవ్యాప్త జరిగిన కార్యక్రమాల్లో లక్షలాది మంది రైతులతో పాటు కార్మికులు, యువకులు, మహిళలు, విద్యార్థులు, సామాన్య పౌరులు పాల్గొన్నారు. ఢిల్లీలో రైతు ఉద్యమ శిబిరాలు అన్నదాతల(మోర్చాలు)తో నిండిపోయాయి. రాజధానిలోని ఘాజీపూర్ సరిహద్దు వద్ద ఎస్కేఎం నేతలు హన్నన్ మొల్లా, రాకేష్ తికాయత్, అశోక్ ధావలే, యోగేంద్ర యాదవ్, మేథా పాట్కర్, ఆశిష్ మిట్టల్, డిపి సింగ్ తదితరులు పాల్గొన్నారు. సింఘూ సరిహద్దు వద్ద ఎస్కేఎం నేతలు దర్శన్ పాల్, బల్బీర్ సింగ్ రాజేవాలా, కృష్ణ ప్రసాద్, ప్రముఖ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్, ఐద్వా ప్రధాన కార్యదర్శి మరియం ధావలే, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ నేత అనీరాజా తదితరులు పాల్గొన్నారు. టిక్రీ సరిహద్దు వద్ద జోగిందర్ సింగ్ ఉగ్రహాన్ తదితరులు పాల్గొన్నారు. షాజహాన్‌పూర్ సరిహద్దు వద్ద అమ్రారామ్ తదితరులు పాల్గొన్నారు. అన్ని ఉద్యమ శిబిరాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పంజాబ్‌కు చెందిన ప్రముఖ గాయకులు పాటలతో ఉర్రూతలుగించారు. వివిధ రాష్ట్రాల్లోని రాజధాను ల్లోనూ, జిల్లా ప్రధాన కార్యాలయాల్లోనూ ఆందోళన జరిగాయి. దేశంలోని అన్నదాతలకు మద్దతుగా వివిధ కార్మిక, విద్యార్థి, యువజన, మహిళా, ప్రజా సంఘాలు, ఇతర సంఘాలు ఒక్కతాటిపైకి వచ్చాయి. వివిధ రాష్ట్రాల్లో జరిగిన కార్యక్రమాల్లో రైతు ఉద్యమానికి మద్దతుగా లక్షలాది మంది రైతులు తరలివచ్చారు. కర్నాటకలో బెంగళూరు, శ్రీరంగపట్నం, చిక్బల్లాపూర్, బెల్గాం, విజయపుర, భాగేవాడిలో రైతులు, కార్మికులు చక్కా జామ్‌లు నిర్వహించి రాష్ట్ర రహదారులను దిగ్బంధించారు. చిక్బల్లాపూర్లోనూ వాహన ర్యాలీ నిర్వహించారు. కర్నాటకలోని మైసూరు, కోలార్, దేవంగెరెలో కూడా నిరసన కార్యక్రమాలు జరిగాయి. పశ్చిమ బెంగాల్లో ధర్మతల్లా, కోల్‌కతాలో భారీ బహిరంగ ర్యాలీ జరిగింది. దీని తరువాత ధర్మతల్లా నుండి సీల్దా స్టేషన్ వరకు భారీ ప్రదర్శన జరిగింది. బీహార్‌లోని పాట్నాలో బుద్ద స్మృతి పార్కు నుంచి కలెక్టరేట్ వరకు రైతులు, కార్మికులతో కలిసి ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. సీతామధి, రోహ్తాస్, భోజ్‌పూర్, ఖగారియా, బెగుసరారు, సమస్తిపూర్, బక్సర్, దర్భంగా, గయా, అర్వాల్, నలంద, షేక్పురాతో పాటు ఇతర జిల్లాల్లో కూడా నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఛత్తీస్‌గఢ్‌లోని రారుపూర్‌లో భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. బస్తర్, బీజాపూర్ జిల్లాలో గిరిజన రైతులు సిల్గర్, గంగలూరులో ధర్నాలతో రైతు ఉద్యమ వార్షికోత్సవాన్ని పాటించారు. తమిళనాడు, జార్ఖండ్, తెలంగాణ, ఒరిస్సా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో కూడా నిరసన కార్యక్రమాలు జరిగాయి.
అంతర్జాతీయ సంఘీభావం
అనేక అంతర్జాతీయ సంఘాలు ఉద్యమానికి తమ మద్దతు, సంఘీభా వాన్ని అందించాయి. అంతర్జాతీయ రైతుల సంఘాలు మద్దతు లేఖ పంపించాయి. ''భారత రైతులు తమ ఉద్యమంతో ప్రపంచాన్ని ప్రేరేపిం చారు. కార్మిక వర్గం, రైతాంగం ఐక్యంగా పోరాడితే ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా విజయం సాధించగలమనే విషయాన్ని వారు చూపారు. ఏడాది పాటు జరిగిన ఈ ఆందోళనలు కార్మిక సంఘాలు, ఇతర సామాజిక ఉద్యమాలు భాగస్వామ్యం అయ్యాయి. గ్రామీణ సమాజాల మధ్య సంఘీభావం, మత సామరస్యం, ఐక్యత స్ఫూర్తిదాయకమైన సందేశాలను అందించింది'' అని మద్దతు లేఖలో పేర్కొన్నాయి. వివిధ దేశాలలో సంఘీభావ కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతున్నాయి. యుకెలోని లండన్‌లో హైకమిషన్ ఆఫ్ ఇండియా ముందు కిసాన్ ప్రదర్శన జరిగింది. నేడు కూడా అదే స్థలంలో ప్రదర్శన, జాగరణ జరుగుతుంది. లెచ్వర్త్ సిటీలో ''కిసాన్ స్లీప్ అవుట్'' జరుగుతుంది. న్యూయార్క్‌లో మహా కిసాన్ విక్టరీ కార్ ర్యాలీ జరగనుంది. ఇదే డిసెం బర్ 4న కాలిఫోర్నియాలో కారు, ట్రక్ ర్యాలీ కార్యక్రమం జరగనుంది. డిసెంబర్ 5న కాలిఫోర్నియాలో ఆందోళన జరగనుంది. బ్రిటిష్ కొలంబియాలో ''ఢిల్లీ చలో స్లీప్ అవుట్'' కార్యక్రమం జరిగింది. రైతు ఉద్యమానికి దాదాపు 80అంతర్జాతీయ సంస్థలు మద్దతు తెలిపాయి.