Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వృద్ధి గణాంకాలతో పరిష్కరించలేం..
- అత్యంత ధనికులకు అధిక ఆదాయం, సంపద
- పేదలు, మధ్య తరగతిపై పరోక్ష పన్నుల మోత
- ప్రపంచంలో ఎక్కడా లేనంతగా భారత్లో పేదరికం : ఆర్థిక విశ్లేషకులు
కరోనా రెండో వేవ్ తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుందని ప్రధాన మీడియా తెగ ప్రచారం చేస్తోంది. పేదరికంలో కూరుకుపోయిన వారి జీవితాలు ఏమేరకు బాగుపడ్డాయో చెప్పటం లేదు. మనదేశంలో అసమానతలు, పేదరికం మునుపెన్నడూ లేనంతగా పెరిగాయని ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ నివేదికలు పేర్కొన్నాయి. ఉదాహరణకు ముకేశ్ అంబానీ లాంటి శతకోటీశ్వరుల(బిలియనీర్లు) సంపద కరోనా సమయంలో భారీగా పెరిగింది. ఒక గంటలో ఆయన సంపాదన..ఒక సాధారణ కార్మికుడికి 10000ఏండ్లు పడుతుంది. మనదేశంలో శతకోటీశ్వర్లకు, ధనికులకు పన్ను ప్రయోజనాలు. పేదలు, మధ్య తరగతిపై పరోక్ష పన్నుల మోత. అందువల్లే వీరు మరింత పేదరికంలోకి కూరుకుపోతున్నారని ఐరాస తాజా నివేదిక (యుఎన్డీపీ) అభిప్రాయపడింది.
న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం, మోడీ సర్కార్ విధించిన ఏకపక్ష లాక్డౌన్ దేశ ప్రజల జీవితాల్ని అతలాకుతలం చేసింది. ముఖ్యంగా పేద, మధ్య తరగతి వర్గాల ఆర్థిక స్థితిగతులు దారుణంగా దెబ్బతిన్నాయి. కరోనాకు ముందు కూడా వారి పరిస్థితి ఏమంత బాగోలేదు. గత మూడు దశాబ్దాలుగా దేశంలో నెలకొన్న తీవ్రమైన అసమానతలు, అవి మరింత ముదిరి సంక్షోభంతో బయటపడ్డాయని కొంతమంది ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. విభిన్న కోణాల్లో విస్తరించిన (ఆకలి, పౌష్టికాహార లోపం, విద్య, వివక్ష..మొదలైనవి) పేదరికంపై ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన నివేదికలోనూ ఇదే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. ఇందులో భారత్కు సంబంధించి ఐరాస ముఖ్యమైన విషయాలు పేర్కొన్నది.
పేదల్లో అత్యధికం ఎస్సీ, ఎస్టీ, ఓబీలే
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 139కోట్లమంది పేదరికంలో కూరుకుపోయారు. అందులో 22.7కోట్లమంది భారత్లోనే ఉన్నారని నివేదిక తెలిపింది. మనదేశంలో ప్రతి ఆరుగురు పేదల్లో ఐదుగురు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సామాజిక వర్గాలకు చెందినవారున్నారు. పౌష్టికాహారం కోసం, ఆకలి సమస్యను తీర్చుకోవటానికి పోరాడుతున్న ప్రజలు భారత్లోనే అత్యధికంగా ఉన్నారు. విద్య అందుబాటులో లేనివారు, కుల, మత వివక్షను ఎదుర్కొనేవారు ఈ దేశంలోనే అత్యధికంగా ఉన్నారని నివేదిక స్పష్టం చేసింది. అత్యధికమంది శతకోటీశ్వరులు (బిలియనీర్లు) ఉన్న మూడో అతిపెద్ద దేశం భారత్. ఇదే దేశంలో మరోవైపు దశాబ్దాలుగా అసమానతలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. అందువల్లే కరోనా సంక్షోభం తర్వాత పేదరికం 60శాతం పెరిగింది.
కరోనా మరింత పెంచింది..
దేశంలో అసమానతల్ని కరోనా సంక్షోభం మరింత పెంచిందని 'ప్యూ రీసెర్చ్ సెంటర్' నివేదిక (మార్చి, 2021)కూడా తెలిపింది. అదనంగా మరో 7.5కోట్లమంది పేదరికంలోకి కూరుకుపోయారని, మధ్య తరగతి ప్రజల్లో 3.2కోట్లమంది ఉన్నారని పేర్కొన్నది. అయితే భారత్లో ప్రధాన మీడియా ఏదీ కూడా ఈ విషయాల్ని ప్రస్తావించటం లేదని, ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటే పేద ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయా? అనేది ప్రధాన మీడియా చూపటం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
శతకోటీశ్వర్ల సంపద డబుల్
'ద ఇండియా ఫోరం' వారి నివేదిక ప్రకారం, భారత ఆర్థిక వ్యవస్థ ప్రధాన సమస్య 'అసమానతలే'. తీవ్రమైన, కఠినమైన కరోనా సంక్షోభం సమయంలో భారత్లో శతకోటీశ్వరుల సంఖ్య 102 నుంచి 140కి పెరిగింది. వీరి మొత్తం సంపద రెట్టింపైంది. అమెరికా, చైనా తర్వాత శతకోటీశ్వరులు అత్యధికంగా ఉన్న మూడో దేశం భారత్. మరోవైపు భారత్లో పేదరికం 60శాతం వరకు పెరిగింది. ప్రపంచబ్యాంక్ 2020 లెక్కల ప్రకారం, ప్రపంచ జనాభాలో భారత్ దేశం వాటా 17.8శాతంగా ఉంది. తీవ్రమైన పేదరికంతో బాధపడుతున్న వారు 6.89కోట్లమంది (20.17శాతం) భారత్లో ఉన్నారు.
జాతీయ సంపదలో ఎక్కడీ
జాతీయ సంపదలో వాటా వివరాల్ని కూడా ఈ నివేదికలో ప్రస్తావించారు. 60 ఏండ్ల క్రితం(1961లో) జాతీయ సంపదలో శతకోటీశ్వరుల వాటా 11.9శాతం. ధనికుల వాటా 43.2శాతం. పేదరికంలో దిగువన ఉన్న 50శాతం ప్రజల వాటా 12.3శాతం. 60ఏండ్ల తర్వాత (2020లో) శతకోటీశ్వరుల సంపద వాటా 42.5శాతానికి చేరుకుంది. ధనికుల వాటా 74.3శాతానికి పెరిగింది. అదే పేదరికంలో ఉన్న 50శాతం ప్రజల వాటా 2.8శాతానికి పడిపోయింది. భారత ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న తీవ్రమైన అసమానతల్ని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి.
ఎందుకిలా?
గత రెండు దశాబ్దాలుగా మనదేశంలో భూపంపిణీ పూర్తిగా ఆగిపోయింది. భూపరిమితి చట్టాలు కాగితాలకే పరిమితమయ్యాయి. వాటిని పట్టించుకునేవాడే లేడు. పాలకులంతా పట్టణీకరణపై దృష్టిసారించారు. కేంద్రంలో పాలకుల విధానాలు రైతుల్ని అప్పుల్లోకి నెడుతున్నాయి. రుణాల బాధ, పంట నష్టాలతో రైతు మరింతగా కుంగిపోతున్నాడు. గంటకు వంద మంది రైతులు..రైతు కూలీలుగా మారుతున్న దేశమిది. పన్ను విధానాలు శతకోటీశ్వర్లుకు, ధనికులకు అనుకూలంగా ఉండటం పేదరికం పెరడానికి కారణమైంది. మోడీ సర్కార్ వచ్చాక కార్పొరేట్ పన్నును గణనీయంగా తగ్గించింది. మరోవైపు పరోక్ష పన్నుల్ని(నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్) భారీగా పెంచింది.